హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేపు మౌన దీక్ష చేయనున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ.. రేపు ఉదయం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్ష చేయనున్నారు. రేపు సాయంత్రం అఖిలపక్షాల నేతలతో చర్చించి.. తదపరి ఉద్యమ కార్యచరణపై స్పష్టతనివ్వనున్నారు. తన నివాసంలో పార్టీ కార్యకర్తలతోనూ బాలకృష్ణ సమావేశం నిర్వహించనున్నారు. హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయొద్దని హితవు పలికారు. వైకాపా ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్సభ కేంద్రం ఒక జిల్లా కావాలని బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.’అన్ని రంగాల్లో హిందూపురం అభివృద్ధి చెందిందని.. జిల్లా కేంద్రానికి అవసరమయ్యే సదుపాయాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. పరిసర ప్రాంతాల వాసులు హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయొద్దు. వెంటనే హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాలయ్య డిమాండ్ చేశారు.