అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘంగా ఉన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఇటీవల జరిగిన నూతన సభ్యత్వ నమోదులో రికార్డును నెలకొల్పింది. దీనితో ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు సంఘంగా ‘తానా’ తిరుగులేని శక్తిగా, అత్యధిక సభ్యులున్న సంస్థగా ఆవిర్భవించింది. తానా ఆవిర్భవించి 45 సంవత్సరాలు అవుతోంది. తానాలో మొన్నటి వరకు 34వేల మంది సభ్యులుగా ఉండేవారు. ఇటీవల తానాలో నూతన సభ్యత్వ నమోదును చేపట్టారు. గత జనవరి 31వ తేదీతో సభ్యత్వ నమోదు ముగిసింది. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా 39వేల మంది నూతన సభ్యులుగా నమోదయ్యారు. తానాలో ఆధిపత్యం కోసం ప్రస్తుతం మూడు వర్గాలు ఏర్పడ్డాయి. వీరంతా పోటాపోటీగా భవిష్యత్తులో తానాపై పెత్తనాన్ని చెలాయించడం కోసం రికార్డు స్థాయిలో సభ్యులను చేర్పించారు.
*తానా ఫౌండేషన్‌పై పెద్దల దృష్టి
తానాలో ఫౌండేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. ఈ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని సామాజిక సేవా కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారానే జరుగుతాయి. దీంతో తానా ఫౌండేషన్‌కు మంచి ప్రాధాన్యత ఉన్నది. తానా ఫౌండేషన్ ఒకప్పుడు దాతల ఆధ్వర్యంలోనే నడిచేది. సేవా కార్యక్రమాలకు తమ సొంత డబ్బులను ఖర్చు చేసేవారే ఈ ఫౌండేషన్ కార్యవర్గంలో ఉండేవారు. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ స్వరూపమే మారిపోయింది. మొన్నటి వరకు తానా ఫౌండేషన్లో 63 మంది దాతలు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ఇటీవల ఫౌండేషన్‌లో నూతన సభ్యత్వాల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. ఏకంగా 130 మంది సభ్యులు ఒక్కొక్కరు $10వేల డాలర్లు చెల్లించి సభ్యులుగా నమోదయ్యారు. దీంతో గతంలో ఫౌండేషన్లో 63 మంది డోనార్స్ సభ్యులుగా ఉండగా ప్రస్తుతం నూతన సభ్యులతో కలిసి 193 మందికి సభ్యత్వం చేరుకుంది. దీంతో అత్యధిక సేవలు అందించే సంస్థగా తానా ఫౌండేషన్ రూపుదిద్దుకోనుంది. కేవలం దాతలు పెద్దలకు మాత్రమే ప్రవేశం ఉండే తానా ఫౌండేషన్లో కూడా రాజకీయాలు చోటు చేసుకున్నాయి. తానాపై పట్టు సాధించడం కోసం పోటీలు పడుతున్న మూడువర్గాల వారు కేవలం రెండు రోజుల్లో ఆఖరి నిముషంలో ఈ నూతన సభ్యులను భారీ ఎత్తున చేర్పించడం అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదీ ఏమైనప్పటికీ తానా ఫౌండేషన్‌కు పెద్ద ఎత్తున మిలియన్ల కొద్దీ ఆదాయం లభించడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు అమెరికాలోనూ పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గం ఏర్పడింది. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.