కరోనా ఫస్ట్ వేవ్ మొదలైన కొత్తలో సినీ పరిశ్రమలో హీరోల పారితోషికాలపై పెద్ద చర్చే నడిచింది. పరిశ్రమ కష్టాల్లో ఉండడం వల్ల హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని కొందరు నిర్మాతలు, ఆయా శాఖల సంఘాలు కోరాయి. తమిళ ఇండస్ట్రీలోనూ ఈ చర్చ నడిచింది. కానీ టాలీవుడ్‌లో హీరోలు పారితోషికం తగ్గించిందే లేదు. ఇలాంటి ఓ అనుభవాన్ని హీరోయిన్ శ్రుతీహాసన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అలాగే సలార్ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ‘‘సలార్ పూర్తిగా యాక్షన్ సినిమా. కానీ ఇందులో నాకు యాక్షన్ సన్నివేశాలు లేదు. నా పాత్ర చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. సినిమాలో నా పాత్ర సింపుల్‌గా ఉంటుంది. కథతో సంబంధం ఉండదని చాలామంది అనుకుంటున్నారు. నా పాత్రే కథను నడిపిస్తుంది’’ అని శ్రుత్రీహాసన్ చెప్పారు. కరోనా సమయంలో శ్రుతీహాసన్‌ను పారితోషికం తగ్గించుకోమని ఓ నిర్మాత కోరారట. అందుకు తొలుత ఆమె అంగీకరించిందట. తనతో పని చేస్తున్న హీరో కూడా రేటు తగ్గించుకుంటే నేనూ అందుకు సిద్ధమే అని శ్రుతీ చెప్పారట. ఆ సంగతి ఆమె మాటల్లోనే ‘‘కరోనా మొదటి వేవ్ తగ్గుతున్న సమయంలో ఓ నిర్మాత పారితోషికం తగ్గించుకోమని అడిగారు. అదే సమయంలో నా సినిమాలో హీరో మాత్రం రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు. దానితో నేను కుదరదని చెప్పేశా. హీరో రెమ్యూనరేషన్ ముందు హీరోయిన్లకు ఇచ్చేది చాలా తక్కువ. హీరోలతో సమానంగా ఇవ్వమని ఏహీరోయిన్ డిమాండ్ చేయదు. అలా అడగడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి హీరోయిన్‌లకు ఇచ్చే తక్కువ రెమ్యూనరేషన్‌ను తగ్గించుకోమనడం కరెక్ట్ కాదు. అని ఆ నిర్మాతకు సమాధానమిచ్చా’’ అని రఽశుతీహాసన్ తెలిపారు. అయితే ఆ సినిమా ఏంటి? హీరో, నిర్మాతలు ఎవరనేది శ్రుతీ బయట పెట్టలేదు.