ScienceAndTech

అమెరికా సహకారంతో ఏపీలో అణువిద్యుత్ కేంద్రం

అమెరికా సహకారంతో ఏపీలో అణువిద్యుత్ కేంద్రం

అమెరికా సహకారంతో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్‌ కేంద్రం నెలకొల్పాలని ప్రతిపాదించినట్లు పీఎంవో కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ గురువారం రాజ్యసభకు తెలిపారు. వైస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ మొత్తం ఆరు రియాక్టర్లతో 1,208 మెగావాట్ల సామర్ధ్యంతో ఈ అణు విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అయితే దేశీయంగా తయారయ్యే ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్స్‌ (పీహెచ్‌డబ్ల్యూఆర్‌)ను ప్రతిపాదిత కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంలో ఏర్పాటు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం 18 ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్స్‌ అణు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండగా మరో ఆరు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. అదనంగా మరో 10 ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్స్‌ ఏర్పాటుకు ఆర్థిక, పాలనాపరమైన మంజూరు జరిగింది. ఈ మొత్తం రియాక్టర్ల ద్వారా 7 వేల మెగావాట్ల అణు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని మంత్రి వివరించారు.