*వేగంగా దూసుకుపోయే అధునాతన వందే భారత్ ట్రెయిన్ల తయారీ కోసం మేధా సర్వో డ్రైవ్స్ అనే హైదరాబాద్ కంపెనీ పోటీ పడుతోంది. బొంబార్డియర్, సీమెన్స్, భారత్ హెవీ ఎలక్ర్టికల్స్తో పాటు మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీ ఇందుకోసం ఇప్పటికే బిడ్ సమర్పించినట్టు సీనియర్ అధికారులు తెలిపారు. 2023 ఆగస్టునాటికి 75 వందే భారత్ ట్రెయిన్లను పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ఇప్పటికే 44 ట్రెయిన్ల తయారీ చేపట్టారు. మరో 58 ట్రెయిన్లకు ప్రొపల్షన్ సిస్టమ్స్ను సమీకరించే ప్రక్రియను రైల్వేస్ ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. వచ్చే మూడేళ్లకాలంలో 400 వందే భారత్ ట్రెయిన్లను తయారు చేయాలన్నది లక్ష్యం.
*కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టుబడులు అధికంగా ఆకర్షించి ‘రికవరీ’కి దోహదపడడం పైనే దృష్టి పెట్టారు తప్పించి, వృద్ధికి దోహ దం చేసే సంస్థాగత సంస్కరణలను ఏ మాత్రం పట్టించుకోలేదని ‘ఫిచ్ రేటింగ్స్’ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం ద్రవ్య లోటు జీడీపీలో 6.9 శాతానికి చేరడంపైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కాలానికి ద్రవ్య లోటు జీడీపీలో 6.6 శాతం ఉంటుందని తాము భావిస్తే 6.9 శాతానికి చేరడం ఆందోళనకరమని పేర్కొంది.
*హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ మరో ఘనత సాధించింది. బ్లూమ్బర్గ్ ‘జెండర్-ఈక్వాలిటీ సూచీ (జీఈఐ)-2022’లో స్థానం సంపాదించింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఈ సూచీలో స్థానం సంపాదించడం వరుసగా ఇది ఐదో సంవత్సరం. ప్రస్తుతం ఈ సూచీలో మన దేశం నుంచి స్థానం సంపాదించిన ఏకైక ఫార్మా కంపెనీ కూడా డాక్టర్ రెడ్డీసే. దీనికి తోడు ఎస్ అండ్ పీ సంస్థ ఏటా రూపొందించే ‘గ్లోబల్ సస్టెయినబిలిటీ ఇయర్ బుక్-2022లోనూ డాక్టర్ రెడ్డీస్ వరుసగా రెండో ఏడాదీ చోటు సంపాదించింది.
* బీపీసీఎల్ ప్రైవేటీకరణ ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఏ ఒక్క బిడ్డర్ కూడా కంపెనీ కార్యాలయాలను సందర్శించలేదని బీపీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ వీఆర్కే గుప్తా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్లో తనుకున్న 52.98 శాతం వాటా మొత్తాన్ని అమ్మకానికి పెట్టింది. అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత గ్రూప్ సహా మూడు కంపెనీల నుంచి మాత్రమే ఆసక్తి వ్యక్తీకరణలు (ఈఓఐ) లభించాయి.
*బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఈ దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా డేటా సెంటర్లు, ఎనర్జీ స్టోరేజీతో పాటు ఎలక్ట్రిక్ చార్జింగ్ ఇన్ఫ్రా, గ్రిడ్ స్కేల్ బ్యాటరీ సిస్టమ్స్ వంటి ఆధునిక సదుపాయాలకు సైతం మౌలిక హోదా కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ఈ సదుపాయాల ఏర్పాటుకు బ్యాంకుల నుంచి కారు చౌకగా రుణాలు లభిస్తాయి. కాబట్టి, ఈ నిర్ణయం ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, సునీల్ మిట్టల్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు భారీగా లబ్ది చేకూర్చనుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, ఈ విభాగాల్లో అదానీ, మిట్టల్, అంబానీలు ఇప్పటికే భారీ ప్రణాళికలు ప్రకటించారు.
*ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.310.40 కోట్ల లాభం ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.35.44 కోట్లతో పోల్చితే లాభం 775 శాతం పెరిగింది.
*మరో అంతర్జాతీయ బ్రాండ్ హైదరాబాద్కు రాబోతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఫిస్కర్ ఇంక్.. నగరంలో గ్లోబల్ టెక్నికల్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. కంపెనీ తన కార్లకు అవసరమైన సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఈ సెంటర్లో అభివృద్ధి చేయనుంది.