వేదమంత్రోచ్చారణ, శ్రీమన్నారాయణుడి శరణు ఘోషతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ముచ్చింతల్ ప్రాంతం మార్మోగిపోయిది. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల కోసం ముస్తాబైన సమతా స్ఫూర్తి కేంద్రం గురువారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లక్ష్మీనారాయణుడి సుప్రభాత సేవతో గురువారం కార్యక్రమాలు మొదలయ్యాయి. దుష్ట నివారణ కోసం శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్ట సిద్ధికి వాసుదేవేష్టి అష్టోత్తర శతనామ పూజను నిర్వహించారు.
1.విష్ణు సహస్రనామ పారాయణం.. పాల్గొన్న సీఎం కేసీఆర్ సతీమణి
ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువు మూడో రోజుకు చేరుకున్నది. ఉత్సవాల్లో భాగంగా నేడు యాగశాలలో శ్రీ లక్ష్మీనారాయణ యాగాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సాయంత్రం ప్రవచన మండపంలో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. విష్ణు సహస్రనామ పారాయణంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భారీ ఎత్తున భక్తులు పాల్గొని పారాయణం పఠించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 7 నుంచి 7:30 గంటల వరకు అతిథులకు సన్మానాలు, ఆశీర్వచనాలు అందించనున్నారు. రాత్రి 7:30 నుంచి 8:00 వరకు మ్యాపింగ్ వీడియో ప్రదర్శనలు, 8 నుంచి 10 వరకు శ్రీమన్నారాయణుడి భజనలు కొనసాగనున్నాయి.
2. నాలుగు మండపాలుగా యాగశాల విభజన
లక్ష్మీనారాయణుడి మహా యాగశాలను నాలుగు మండపాలుగా విభజించారు. భోగమండపం, పుష్పమండపం, త్యాగ మండపం, జ్ఞానమండపంగా వీటికి పేరు పెట్టారు. నాలుగు దిక్కుల్లో ఉన్న ఈ మండపాల్లో 114 యాగశాలలున్నాయి. మధ్య శాలలో జీయర్ స్వాములతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడే భగవంతుని దర్శనం ఉంటుంది. రోజుకు మూడు పూటల పూజా కార్యక్రమాలు ఇక్కడ్నుంచే నిర్వహిస్తారు. మిగతా యాగశాలల్లో రుత్వికులతో యాగ కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఒక్కో యాగశాలలో 9 యజ్ఞకుండాలు ఉంటాయి. చతురస్ర కుండం (స్వకయర్), యోని కుండం (ఇన్వర్టెడ్ హార్ట్), అర్థచంద్ర/ధనుష్కుండం (హాఫ్ మూన్), సహదస్ర కుండం (హెక్సాగాన్), వృత్త కుండం (సర్కిల్), పంచస్ర కుండం (పెంటాగన్), త్రికోణ కుండం (ట్రాయాంగ్యులర్), అష్ట్రాశమ కుండం (ఆక్టాగాన్), పద్మకుండం (లోటస్)గా వీటిని పిలుస్తారు. మొత్తంగా 1,035 యజ్ఞ కుండాల్లో 5 వేల మంది రుత్వికులతో యాగం నిర్వహిస్తారు.
3. మేడారం మహా జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల బస్సులు నడుపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ముందుగా ఆయన సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. మేడారం ఆర్టీసీ బస్టాండ్‌లో చేసిన ఏర్పాట్లతో పాటు టికెట్ కౌంటర్లు, క్యూలైన్లు, సిబ్బంది బస చేసేందుకు ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీపాటిల్తో ట్రాఫిక్ సమస్యలు, భక్తులకు ఇబ్బదులు కలుగకుండా ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో కంటే ఎక్కువగా భక్తులు ఆర్టీసీని ఆదరిస్తున్నారని తెలిపారు. రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామన్నారు.ఈనెల 13 నుంచి 12,500 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని, రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి బస్సు సర్వీసులు నడిపిస్తామని తెలిపారు. ప్రైవేట్ వాహనాలను అమ్మవార్ల గద్దెలకు దూరంగా నిలిపేస్తారని, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే గద్దెలకు సమీపంలో ఇబ్బంది లేకుండా దిగుతారని భక్తులకు సూచించారు. అలాగే తాడ్వాయిలోని టికెట్ ఇష్యూ పాయింట్‌ను పరిశీలించారు.టికెట్లు ఇచ్చే విధానాన్ని తెలుసుకున్నారు. వీఐపీ పార్కింగ్, శివరాంసాగర్ చెరువుల వద్ద ఏర్పాటు చేసిన అదనపు బస్సు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ముఖ్యంగా డ్రైవర్లకు ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు, ఓవర్‌టేక్‌ల విషయంలో పలు సూచనలు చేయాలని, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకునేలా చూడాలని అన్నారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ రఘునాథరావు, మునిశేఖర్, రీజినల్ మేనేజర్ విజయభాస్కర్, డివిజనల్ మేనేజర్ శ్రీదేవి, డిపో మేనేజర్లు భానుకిరణ్, మహేశ్‌కుమార్, హోహన్, కిరణ్‌రెడ్డి, బుచ్చయ్య ఉన్నారు.
4. యాదాద్రీశుడి సేవలో వినోద్ కుమార్
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, సివిల్ సప్లై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నారసింహుడిని దర్శించుకున్నారు.శుక్రవారం ఉదయం వినోద్ కుమార్ కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారి నిజాభిషేకం సేవలో పాల్గొని ప్రత్యేక పూజలుచేపట్టారు.అంతకు ముందు అర్చకులు వినోద్ కుమార్‌కు ఘన స్వాగతం పలికారు. స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం యాదాద్రి పునర్నిర్మాణ పనుల గురించి వినోద్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.
5. శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.83 కోట్లు..
తిరుమలలోని శ్రీవారిని నిన్న 31,167 మంది భక్తులు దర్శించుకున్నారు. 15,701 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన కానుకల వల్ల రూ. 1.83 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారం భక్తులకు దర్శనం అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు.
6. వెబ్సైట్లో పాలకమండలి తీర్మానాల జీవోపై వెనక్కి తగ్గిన TTD
తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో పాలకమండలి తీర్మానాల జీవోలు పెట్టని అంశంలో టీటీడీ వెనక్కి తగ్గింది. ప్రభుత్వం వల్లే ఏడాది కాలంగా పాలకమండలి తీర్మానాలను టీటీడీ గోప్యంగా ఉంచింది. మాజీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ ఇచ్చిన లీగల్ నోటీసులతో జీవోలు పెట్టే అంశంపై టీటీడీ నిర్ణయం మార్చుకుంది. ఏడాది కాలంగా పెట్టని పాలకమండలి తీర్మానాలను వెబ్సైట్లో ఉంచింది.
7. ఈ నంబర్ 04030102829కి కాల్ చేస్తే బస్సు పంపుతాం: సజ్జనార్
మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను చేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 50 ఏళ్లుగా ఆర్టీసీ మేడారానికి బస్సులను నడుపుతోందన్నారు. మొదట రెండంకెల బస్సులతో 1970లో స్టార్ట్ అయ్యిందని.. ప్రస్తుతం 7వందలకు పెరిగిందన్నారు. గత ఏడాది 19లక్షలకు పైగా భక్తులను మేడారం చేర్చామన్నారు. గత ఏడాది 3వేలకు పైగా బస్సులు- 50వేలకు పైగా ట్రిప్స్ రన్ చేశామన్నారు. మేడారం జాతరను రెవెన్యూగా చూడలేదని సజ్జనార్ తెలిపారు. గత ఏడాది 30 కోట్ల రెవెన్యూ వచ్చిందన్నారు. ఈ సారి 3845 బస్సులు నడపాలని- 51 పాయింట్స్ నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. ఇతర రాష్ట్రాలు మహారాష్ట్రతో పలు ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతున్నామన్నారు. 30మంది ప్రయాణికులు ఉంటే ఈ నంబర్ 04030102829కి కాల్ చేస్తే బస్సు పంపుతామన్నారు. ప్రజలందరూ మా వెబ్ సైట్‌ను చూస్తే అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటి వరకూ 5వందల బస్సులు 12వందల ప్రయాణికులను మేడారం చేర్చామని సజ్జనార్ వెల్లడించారు.
8. భద్రాద్రిలో భక్త రామదాసు 389వ జయంతి ఉత్సవాలు
భద్రాచల రామయ్య ఆలయ నిర్మాత, వాగ్గేయకారుడు భక్త రామదాసు 389వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రామాలయంలోని భక్త రామదాసు విగ్రహానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. వాగ్గేయకారుడి విగ్రహంతో ఆలయ ప్రదక్షిణ, గిరిప్రదక్షణ చేశారు. చిత్రకూట మండపంలో వైభవంగా వాగ్గేయకారోత్సవాలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్వాంసులు భక్త రామదాసు కీర్తనలను ఆలపిస్తున్నారు. రామదాసు కీర్తనల ఘనతను చాటి చెప్పడానికి గత 16 ఏండ్లుగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. రామదాసు జన్మస్థలమైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోనూ ప్రభుత్వం భక్తరామదాసు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. భాషా సాంస్కృతిక శాఖ, ఖమ్మం జిల్లా యంత్రాంగం, భద్రాచలం దేవస్థానం, నేలకొండపల్లిలో ఏర్పాటైన శ్రీభక్తరామదాస విద్వత్ కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.