NRI-NRT

సౌదీఅరేబియాలో కొత్త ప్రయాణ ఆంక్షలు

సౌదీఅరేబియాలో కొత్త ప్రయాణ ఆంక్షలు

గల్ఫ్ దేశం సౌదీ అరేబియా గురువారం కొత్త ప్రయాణ ఆంక్షలు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 9వ తేదీ(బుధవారం) నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 9 నుంచి సౌదీ పౌరులు విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా బూస్టర్ డోసు తీసుకుని ఉండాలి. అలాగే ఇతర దేశాల నుంచి కింగ్‌డమ్‌కు వచ్చే సౌదీ పౌరులతో సహా ప్రతి ప్యాసెంజర్ పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. అది కూడా ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్నదై ఉండాలి. అయితే, 8ఏళ్లలోపు పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇక కరోనా పాజిటివ్‌గా తేలి, టీకా తీసుకున్న సౌదీ పౌరులకు ఏడు రోజుల తర్వాతే దేశంలోకి ఎంట్రీ ఉంటుందని పేర్కొంది. అలాగే వ్యాక్సినేషన్ పూర్తి కాని వారికి పాజిటివ్‌గా వస్తే మాత్రం 10 రోజుల పాటు దేశం బయట ఉండాలని తెలియజేసింది. ఇకపోతే విదేశాలకు వెళ్లే సౌదీ పౌరులు రెండో డోసు తీసుకుని మూడు నెలలు గడిచిన తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలని తెలిపింది. కాగా, సౌదీతో పాటు ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఉద్ధృతి కొనసాగతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రయాణ ఆంక్షలను తీసుకువస్తున్నట్లు ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.