NRI భార్యల వేధింపుల నుంచి వారి భర్తలను రక్షించేందుకు ఓ కొత్త చట్టం కావాలని పంజాబ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ గిల్ మంగళవారం డిమాండ్ చేశారు. ఈ విషయమై చర్చ జరగాలంటూ లోక్సభ సెక్రెటరీ జనరల్కు నోటీసు ఇచ్చారు. ఎన్నారై భర్తల వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు చట్టాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన.. భార్యల వేధింపుల నుంచి భర్తలకు ఎటువంటి రక్షణ లేదని పేర్కొన్నారు. ‘‘విదేశాలకు వెళ్లిన కొందరు యువతులు తమ భర్తలను వదిలేయడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో నా దృష్టికి వచ్చాయి. వరుళ్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒదుడుకులకు లోనయ్యాయి’’ అని ఆయన లోక్సభ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
**తమ భార్యలు అమెరికాలో సెటిలయ్యేందుకు భర్తలు ముందుగా ఎంతో ఖర్చు పెడుతున్నారని జస్బీర్ సింగ్ పేర్కొన్నారు. IELTS పరీక్షకు సిద్ధమయ్యే క్రమంలో, ఆ తరువాత విదేశాల్లో చదువుకయ్యే ఖర్చు మొత్తం అబ్బాయిల కుటుంబాలే భరిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ‘‘విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని, అక్కడ ఉద్యోగం సంపాదించాక కొందరు యువతులు వారి భర్తలను వదిలించుకుంటున్నారు. భర్తలకు భాగస్వామి వీసాను స్పాన్సర్ చేసేందుకు ముందుకు రావట్లేదు. భార్యలను వదిలిపెట్టిన భర్తలను శిక్షించేందుకు మన వద్ద చట్టాలు ఉన్నాయి. కానీ.. భర్తలను ఇలా మానసికంగా, ఆర్థికంగా గాయపరుస్తోన్న మహిళలను శిక్షించేందుకు చట్టమే లేదు.’’ అంటూ తన నోటీసులో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
**కాంట్రాక్ట్ పెళ్లిళ్లతో కలకలం!
అమెరికాలో ఉద్యోగం సంపాదించి, అక్కడే సెటిలవ్వాలని అనేక మంది భారతీయులు కోరుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే.. పంజాబ్ రాష్ట్రంలో ఈ ట్రెండ్ కాస్తంత బలంగా వేళ్లూనుకుంది. ఈ క్రమంలోనే అక్కడ కాంట్రాక్ట్ పెళ్లిళ్ల పద్ధతి ఉనికిలోకి వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. సాధారణంగా అమెరికా కల సాకారం చేసుకునే క్రమంలో మొదటి అడుగు అమెరికా స్టూడెంట్ వీసా పొందడం! ఇందుకోసం యువత IELTS లాంటి కఠినమైన పరీక్ష పాసవ్వాలి. ఆ తరువాత..వచ్చే విద్యార్థి వీసా సాయంతో అమెరికాలో చదువు పూర్తి చేసుకుని అనంతరం ఉద్యోగం సంపాదించాలి. అయితే.. పంజాబ్లో యువకుల కంటే యువతులే అధిక సంఖ్యలో IELTS పాసవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో విదేశీ చదువుకయ్యే ఖర్చు భరించలేని యువతులను పెళ్లి చేసుకునేందుకు కొందరు యువకులు ముందుకు వస్తున్నారు. ఆ తరువాత భార్యలు అమెరికాలో సెటిలయ్యాక.. వారి ద్వారా జీవిత భాగస్వాములకు ఇచ్చే వీసా సంపాదించి అమెరికాలో అడుగుపెట్టాలని యువకులు కోరుకుంటున్నారు. ఇందుకోసం అమ్మాయిల IELTS పరీక్షకు కోచింగ్ ఖర్చు మొదలు, అమెరికాలో చదువుకయ్యే వ్యయాన్నంతా తామే భరించేందుకు వరుడి కుటుంబాలు సిద్ధపడుతున్నాయి. ఈ క్రమంలోనే వధువు, వరుడి కుటుంబాల మధ్య ఒప్పందాలు కుదురుతున్నాయి. వీటినే స్థానికంగా కాంట్రాక్ట్ పెళ్లిళ్లని పిలుస్తున్నారు. అయితే.. అమెరికా వెళ్లిన యువతులు మాత్రం అక్కడ ఉద్యోగం సంపాదించి..ఆపై భర్తల వీసా ఊసెత్తకుండా సైలెంటైపోతున్నారని తెలుస్తోంది. ఫలితంగా కొందరు యువకులు తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక, అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇటీవల కొన్ని వెలుగులోకి వచ్చాయని స్థానికులు అంటున్నారు. అయితే.. ఇంతకాలం స్వదేశంలో సవాలక్ష ఆంక్షల నడుమ బందీలుగా ఉంటున్న యువతులు, తమకు లభించిన స్వేచ్ఛను వదులుకునేందుకు ఇష్టపడట్లేదని, అక్కడ కూడా భర్తల ఆంక్షలు మొదలవుతాయంటూ దూరంగా ఉండిపోతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి ఎన్నారై భార్యల కారణంగా తీవ్ర ఆవేదనకు లోనవుతోన్న యువకులను కాపాడేందుకు కొత్త చట్టం కావాలంటూ కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ బుధవారం లోక్సభలో డిమాండ్ చేశారు.