దేశవాళీ మెగాటోర్నీ రంజీ ట్రోఫీకి వేళైంది. కరోనా వైరస్ విజృంభణతో గత రెండు సీజన్లుగా నిలిచిపోయిన రంజీ ట్రోఫీ ఈనెల 10 నుంచి మొదలవుతున్నది. కట్టుదిట్టమైన బయోబబుల్ ఏర్పాట్ల మధ్య టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ పక్కా ప్రణళికతో సిద్ధమైంది. ఇందులో భాగంగా రంజీ ట్రోఫీ తొలి దశ షెడ్యూల్ను గురువారం బీసీసీఐ కార్యదర్శి జై షా విడుదల చేశాడు. టోర్నీకి సంబంధించిన వివరాలను ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాలతో షా పంచుకున్నాడు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని గతానికి భిన్నంగా ఎనిమిది ఎలైట్ గ్రూపులతో పాటు ప్లేట్ గ్రూపుతో జట్లను విభజించారు. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు మూడేసి మ్యాచ్లు ఆడుతాయి. ఎలైట్ గ్రూపు మ్యాచ్లు రాజ్కోట్, కటక్, చెన్నై, అహ్మదాబాద్, తివేండ్రమ్, ఢిల్లీ, హర్యానా, గువాహటిలో జరుగనుండగా, ప్లేట్ లీగ్ మ్యాచ్లకు కోల్కతా ఆతిథ్యమివ్వనుంది. ఒక్కో జట్టు మూడేసి మ్యాచ్లు ఆడుతుంది. టాప్లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెడుతాయి. ఇందులో లోర్యాంక్ టీమ్ ప్లేట్ గ్రూపు విజేతతో ప్రి క్వార్టర్స్లో తలపడుతుంది. మొత్తంగా 62 రోజుల్లో 64 మ్యాచ్లు జరుగుతాయి. టోర్నీ తొలి దశ మ్యాచ్లు ఈనెల 10 నుంచి మొదలై మార్చి 15 వరకు జరుగుతాయి. ఐపీఎల్ టోర్నీ అనంతరం మే 30న మొదలై జూన్ 26 వరకు రెండో దశ మ్యాచ్లు ఉంటాయని జై షా పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే పెరిగిన మ్యాచ్ ఫీజులు అమల్లోకి రానున్నాయి. అయితే టోర్నీని కుదించిన దృష్ట్యా లీగ్ దశలో నిష్క్రమించిన జట్ల ప్లేయర్లకు అంతగా లాభించకపోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి బయోబబుల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు షా వివరించాడు.
**బెంగళూరులో గులాబీ టెస్టు
భారత్, శ్రీలంక మధ్య గులాబీ బంతితో బెంగళూరు వేదికగా డే అండ్ నైట్ టెస్టు జరుగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం ధృవీకరించాడు. వెస్టిండీస్తో సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంకతో మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. అయితే లంకతో సిరీస్ల కోసం వేదికలు ఇంకా ఖరారు కాలేదని త్వరలోనే ప్రకటిస్తామని దాదా తెలిపాడు. మరోవైపు ఈసారి ఐపీఎల్ స్వదేశంలోనే జరుగుతుందని సంకేతాలు ఇచ్చాడు. ముంబై, పుణెలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తామని, నాకౌట్ వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో మహిళల టీ20 చాలెంజ్ టోర్నీ నిర్వహిస్తామని పేర్కొన్నాడు.