యావత్ ప్రపంచం గర్వించే విధంగా హైదరాబాద్ లో చినజీయరు స్వామీ ఏర్పాటు చేసిన 216 అడుగుల శ్రీరామనుజాచార్యుల స్వామివారి విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లేకపోవడం తెలుగు ప్రజలను నిరాశకు గురి చేసింది. ఆద్యాత్మికతతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం జరిగే సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన అని ప్రజలతో పాటు ఆధ్యాత్మిక వాదులు నిరసన వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల తెలంగాణాలో ప్రతిపక్షం భాజపాకు, అధికారంలో ఉన్న తెరాస మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్దంతో పాటు ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను ఇటీవల తెలంగాణా ప్రభుత్వం అరెస్టు చేయడం పట్ల భాజపా కేంద్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో తెలంగాణాకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏకంగా రాజ్యాంగాన్నే తిరిగి రాయాలని కేసీఆర్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ తెలంగాణా పర్యటనను కేసీఆర్ బహిష్కరించడం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రధాని మోడీ ఇంక్రీశాట్ లో జరిపిన అధికారిక పర్యటనకు కేసీఆర్ హాజరుకానప్పటికి చినజీయారు స్వామీ ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై ఉంటే బాగుండేదని తెలుగు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలను ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముడి పెట్టకూడదని వారు అభిప్రాయపడుతున్నారు. – కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్ట్.