DailyDose

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీగల వంతెన

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీగల వంతెన

తెలంగాణ– ఆంధ్రప్రదేశ్‌ మధ్య మరో వారిధికి మార్గం సుగమమైంది. దశాబ్దాల కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021– 22 బడ్జెట్‌లో రూ.600కోట్ల నిధులు కేటాయించింది. కృష్ణానదిపై బ్రిడ్జి కోసం సర్వే చేపట్టిన కన్సల్టెంట్‌ సంస్థ సోమశిల– సిద్దేశ్వరం వద్ద అధునాతన ‘ఐకానిక్‌’ (తీగల) వంతెన ఏర్పాటుకు నివేదిక ఇవ్వడంతో జాతీయ రహదారుల సంస్థ గత నెల 21న డీపీఆర్‌కు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. హైదరాబాద్‌– శ్రీశైలం జాతీయ రహదారిలోని 76/400 కి.మీ., కల్వకుర్తి (కొట్ర) నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ., రహదారిగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా సోమశిల వద్ద తీగల వంతెన నిర్మిస్తారు. ఇప్పటికే టూరిజం హబ్‌గా ఉన్న నాగర్‌కర్నూల్‌ జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. పర్యాటకానికి కేంద్ర బిందువుగా ఉన్న సోమశిల తెలంగాణకు మరో కలికితురాయిగా మారుతుంది. కృష్ణానది బ్యాక్‌వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో బ్రిడ్జి ఏర్పాటు కాబోతుంది.

*మూడు ప్రతిపాదనలు
కృష్ణానదిపై సోమశిల బ్రిడ్జి ఏర్పాటుకు కన్సల్టెంట్‌ సంస్థ మూడు ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల సంస్థకు నివేదిక సమర్పించింది. ఇందులో మూడో ఆప్షన్‌కు ఆమోదం ముద్ర వేసింది. మొదటి ఆప్షన్‌ సోమశిల కాటేజీల నుంచి 1,800 మీటర్ల బ్రిడ్జికి, రెండో ఆప్షన్‌ సోమశిల వెళ్లే రహదారిలో కుడివైపు కృష్ణానది బ్యాక్‌వాటర్‌ నుంచి రోడ్డు, 750 మీటర్ల బ్రిడ్జికి ప్రతిపాదించారు. మూడో ఆప్షన్‌లో ప్రతిపాదించిన సోమశిల రీ అలాన్‌మెంట్‌ 9.20 కి.మీ రహదారి 600 మీటర్ల ఐకానిక్‌ బ్రిడ్జి ప్రతిపాదనలకు జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది.æ కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పథకం కింద 173.73 కి.మీ., జాతీయ రహదారిలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలో 87.600 కి.మీ., రోడ్డు, 600 మీటర్ల తీగల వంతెనకు రూ.1,200 కోట్లు కేటాయించింది. సిద్దేశ్వరం రెండు కొండల మధ్య ఏర్పాటు కానున్న తీగల వంతెనతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల సమస్య తీరడంతోపాటు సోమశిల పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది.

*తీగల వంతెన అంటే.. 
సోమశిల– సిద్దేశ్వరం రెండు కొండల మధ్య (600 మీటర్లు) తక్కువ దూరం ఉండటంతో ఈ స్థలం ఎంపిక చేశారు. రెండు కొండల మధ్య పిల్లర్లు కాకుండా లండన్‌ బ్రిడ్జి మాదిరిగా అటు ఇటు రెండు పెద్ద టవర్లు నిర్మిస్తారు. ఈ రెండు టవర్లకు కేబుల్స్‌ బిగించి బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల కేబుల్స్‌ నుంచి బ్రిడ్జి సప్‌సెంట్‌ అవుతుంది. ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ మొగ్గు చూపింది.  

*అభివృద్ధికి బాటలు..
 జాతీయ రహదారి, సోమశిల బ్రిడ్జితో నాగర్‌కర్నూల్‌ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. అధునాతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. ఐకానిక్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకంగా ఈ ప్రాంతంలో రిసార్ట్స్‌ ఏర్పాటవుతాయి. వెనకబడిన ఈ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. నల్లమల అందాలు తిలకించేందుకు ఇప్పటికే పర్యాటకులు వస్తున్నారు. బ్రిడ్జి ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది.