భారత రాజ్యాంగం పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అచ్చంపేట శాసనసభ్యుడు గువ్వల బాలరాజు వత్తాసు పలికారు. అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ సోమవారం ఉదయం పది గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట క్యాంపు కార్యాలయం ముట్టడి ప్రకటించిన విషయం విదితమే. దీంతో ముందస్తుగా నియోజకవర్గంలోని అన్ని మండలాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులను తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
క్యాంపు కార్యాలయం ముందు హై టెన్షన్..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తప్పక ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి చేస్తామని కాంగ్రెప్ నాయకుల ప్రకటించారు. అనుకున్న విధంగానే డిసిసి అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ యువసేన నాయకులు పోలీసుల కళ్లుగప్పి ఉదయం 11:30 గంటలకు అచ్చంపేట క్యాంప్ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులకు వ్యతిరేకంగా ఖబర్దార్ అంటూ నినాదాలు చేసుకుంటూ దూసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు డిసిసి అధ్యక్షుడు తోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అదుపుచేస్తున్నారు. ఇంతలో మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గేటు వైపు దూసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ జెండాను క్యాంపు కార్యాలయంలో పడవేశారు.
కాంగ్రెస్ v/s టీఆర్ఎస్ మధ్య బాహా బాహి..
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోపలికి కాంగ్రెస్ నాయకులను రాకుండా పోలీసులు అడ్డుకునే పయత్రం చేస్తున్నారు. అయితే అప్పటికే లోపల ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు కుడా వారిన అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు ఢీ అంటే ఢీ అనే విధంగా ఎదురుదాడికి దిగారు. దీంతో డిసిసి అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాంప్ ఆఫీస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో ఎదురు దాడి చేశారు. అనంతరం ఇరు పార్టీల నాయకులు పరుగులు తీశారు. దీంతో అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఇరు పార్టీలకు చెందిన నాయకుల మధ్య మరింత వివాదం చోటు చేసుకోకుండా పోలీసులు చెదరగొట్టారు