శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ – TNI ఆధ్యాత్మిక వార్తలు – 07/02/2022
యాదాద్రిలోని బాలాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ్మస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు కేసీఆర్‌కు ఆశీర్వచనం అందించారు.బాలాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.స్వామి వారి దర్శనానికి కంటే ముందే కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, మర్రి జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆలయ పండితులు, అధికారులతో కేసీఆర్ సమీక్షించి, పలు సూచనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
_____________________________________
1. ఓం నమో వేంకటేశాయ
తిరుమల సమాచారం 07-02-22 సోమవారం
నిన్న 06-02-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తల సంఖ్య 33,737 మంది…
స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 13,954 మంది…
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.82 కోట్లు …
2. బ్రహ్మోత్సవ తర 4వ వారం కొమురవెల్లిలో భక్తజన సందోహం
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల 4వ వారాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆలయానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. భక్తిప్రపత్తులతో మల్లన్నకు బోనం నివేదించారు. స్వామివారికి చెలుక, నజరు, ముఖ మండపపట్నాలు వేయడంతో పాటు గంగరేగుచెట్టుకు ముడుపులు కట్టి కష్టాలు తీర్చాలని వేడుకున్నారు. మల్లన్న సహోదరి ఎల్లమ్మకు కల్లు శాకపోసి, బోనాలు నివేదించి ఒడిబియ్యం సమర్పించి చల్లగా కాపాడాలని వేడుకున్నారు. శివసత్తులు, పోతరాజులు భక్తిపారవశ్యంతో సిగాలు ఊగారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఈవో బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ధర్మకర్తలు బొంగు నాగిరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, కొంగరి గిరిధర్, చింతల పర్శరాములు, కొమురెల్లి తదితరులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామిని డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి దర్శించుకుని అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఎల్లమ్మకు బోనం నివేదించారు.
3.చరిత్రలో తొలిసారి.. ఒక్కరోజు బ్రహ్మోత్సవం.. ఏకాంతమే!
ప్రతి ఏడాదీ సూర్యజయంతి రోజున నిర్వహించే రథసప్తమి వేడుకలను ఈ సారి కోవిడ్ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 8న ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. కరోనా కారణంగా స్వామివారి ఉత్సవాలను రెండేళ్లుగా భక్తుల సమక్షంలో కాకుండా శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది బ్రహ్మోత్సవాలతోపాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకలను మాత్రం భక్తుల సమక్షంలో నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఒమిక్రాన్ విజృభణతో రథసప్తమి వేడుకలను కూడా ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. చరిత్రలో తొలిసారి రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనుండడం గమనార్హం.
*ఒకే రోజు సప్తవాహనాలపై..
రథసప్తమి వేడుకలను శ్రీవారి ఆలయంలో ఒక్కరోజు బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు తొమ్మిది రోజుల్లో 16 వాహనాలపై కొలువుదీరి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. రథసప్తమి పర్వదినంనాడు మాత్రం శ్రీవారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. వేకువజాము నుంచే వాహన సేవలు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది అన్ని వాహన సేవలు ఆలయానికే పరిమితం కానున్నాయి.
4. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఆదిదేవుడు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు. తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. వేలాది మంది భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. దేవస్తానం అనుబంధ ఆలయాల్లో దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజకార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రమాదేవి నేతృత్వంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
5. ఆలయాల్లో అన్నదానానికి గ్రీన్‌సిగ్నల్!
కొవిడ్ నేపథ్యంలో ఆపేసిన అన్నదాన కార్యక్రమాలను దేవదాయశాఖ మళ్లీ పునరుద్ధరిస్తోంది. కేసులు పెరుగుతున్నాయనే కారణంతో దేవదాయశాఖ ఆదేశాలతో జనవరి మొదటి నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూర్తిగా అన్నదానాలు నిలిపివేశారు. తాజాగా ప్రకాశం జిల్లా మాలకొండలోని మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అన్నదానానికి అనుమతివ్వాలని ఈవో కోరగా దేవదాయశాఖ అనుమతిచ్చింది. ఆలయం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల పరిధిలో భోజన వసతి లేనందున భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఈవో చేసిన విజ్ఞప్తిని అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. ఇక శ్రీకాళహస్తి ఆలయంలోనూ అన్నదానాన్ని ప్యాకెట్ల రూపంలో పునఃప్రారంభించారు.
6. మేడారంలో సకల సదుపాయాలు: సత్యవతి
దక్షిణాది కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పించనున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగే జాతరలో భక్తులు సులభంగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 నుంచి 20 వరకు జాతర మార్గాల్లో భారీ వాహనాల రాకపోకలను నిషేధించనున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత, ప్యాసింజర్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
7. బాసరలో పదో శతాబ్ది శాసనం
సరస్వతీ దేవి కొలువుదీరిన బాసరలో కొత్త శాసనం వెలుగు చూసింది. ఇది 10వ శతాబ్దికి చెందినదని భావిస్తున్నారు. ఒక విశ్రాంతి వసతి, ఇళ్ల నిర్మాణం చేపట్టిన కార్యక్రమానికి చెందిన శాసనంగా పరిశోధకులు గుర్తించారు. బాసర గ్రామ సమీపంలోని దస్తగిరి గుట్ట మీద పెద్ద గుండుపై ఈ శాసనం చెక్కి ఉంది. స్థానిక యువకులు రమేశ్, యోగేశ్, ఆనంద్ తదితరుల ద్వారా సమాచారం అందుకున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బలగం రామ్మోహన్ దాన్ని పరిశీలించారు.కల్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడైన రెండో తైలపుని కుమారుడు సత్యాశ్రయుని పేరు ఇందులో కనిపిస్తోందని, సత్యాశ్రయునికి ఇరవ బెడంగ, సట్టి, సట్టిగ అనే పేర్లు కూడా ఉన్నాయని శాసనాన్ని పరిష్కరించిన శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. బసది, నివాసాల కోసం ఈ శాసనాన్ని వేయించినట్టు తెలుస్తోందని తెలిపారు. అందులో రామస్వామి అన్న పేరు కనిపిస్తోందని, అప్పట్లో ఆయన న్యాయాధికారి అయ్యుంటాడని భావిస్తున్నట్టు వెల్లడించారు. దిగువన త్రిశూలం గుర్తు ఉన్నందున, ఆ రాజు శైవ ఆరాధకుడై ఉంటాడని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
8. మేడారంలో భక్తజన సందడి
ములుగు జిల్లా మేడారం జాతరకు ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వాహనాల ద్వారా చేరుకుని.. జంపన్న వాగులో స్నానాలు చేసి.. గద్దెల వద్ద సమ్మక్క–సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. ముడుపులు కట్టారు. సుమారు 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. వాహనాలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై రాకపోకలను పునరుద్ధరించారు.
9. మేడారం జాతరకు 3845 బస్సులు: ఆర్టీసీ ఈడీ
అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్కసారలమ్మ జాతరకు 3845 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఈడీ మునీశ్వర్ తెలిపారు. మేడారం జాతరకు ఆర్టీసీ ఏర్పాట్లపై సోమవారం మునీశ్వర్ మీడియాతో మాట్లాడారు. జాతరకు బస్సుల్లో 21 లక్షల మందిని తరలించడమే ఆర్టీసీ లక్ష్యమన్నారు. ఇతర జిల్లాలకు చెందిన బస్సులను కూడా వరంగల్ నుండి మేడారంకు నడుపుతున్నామని తెలిపారు. 51 పాయింట్స్ నుండి మేడారంకు బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలో 30 పాయింట్స్ నుండి ప్రయాణికులను మేడారంకు తరలిస్తామన్నారు. వేరువేరు ప్రాంతాల నుండి వరంగల్‌కు చేరుకున్నవారు… హనుమకొండ నుండి మేడారంకు సురక్షితంగా చేర్చే విధంగా సర్వం సిద్ధం చేశామన్నారు. మేడారంలో భక్తులను జంపన్న వాగుకు తరలించడానికి తొలిసారి మినీ బస్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో, 42 క్యూ లైన్స్ ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఈడీ మునీశ్వర్ పేర్కొన్నారు.
10. మదురై, పుదువైలోనూ శ్రీవారి ఆలయాలు
సహా మదురై, పుదుచ్చేరిలో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆదివారం టి.నగర్, వెంకట నారాయణరోడ్డులో వున్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ సమాచార కేంద్ర సలహామండలి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వైవీ సుబ్బారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ.. కాలినడకన తిరుమల చేరుకునే భక్తులు సేదదీరేందుకు మార్గమధ్యలో నాలుగు షెల్టర్లను నిర్మించతలపెట్టామని, అందులో ఊత్తుకోట, సితమంజేరిలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. గతంలో తమిళనాడు ప్రభుత్వం ఓఎంఆర్, ఈసీఆర్లలో సూచించిన స్థలాల్లో ఏదో ఒకదానిని ఈ ఏడాదిలోగా ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామని గతంలోలానే పునరుద్ఘాటించారు. టి.నగర్లో ఇప్పటికే వున్న ఆలయాన్ని భక్తుల మనోభావాల మేరకు మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా మదురైలో రెండెకరాలు స్వామివారి ఆలయం కోసం సిద్ధంగా వుందని, అక్కడ కూడా ఆలయం నిర్మిస్తామని తెలిపారు. ఉళుందూర్‌పేటలో స్వామి వారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఖరారయ్యాయని, పుదుచ్చేరిలోనూ ఆలయం నిర్మిస్తామన్నారు. జమ్మూకశ్మీర్‌లో 66 ఎకరాల్లో ఆలయనిర్మాణ పనులు అనుకున్నరీతిలో జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. టి.నగర్ జీఎన్ చెట్టి రోడ్డులో నిర్మిస్తున్న పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని, అక్టోబరు నాటికి పూర్త వుతుందన్నారు. అదే నెలలో కుంభాభిషేకం నిర్వహించి, దానిని ప్రారంభిస్తామన్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా తిరుమలలో నిలిపేసిన సర్వదర్శనాన్ని త్వరలోనే పునరుద్ధరి స్తామన్నారు. కొవిడ్ నిబంధనల మేరకు అనుమతి వుంటుందన్నారు.
11. శ్రీలక్ష్మీ నరసింహ్్స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
యాదాద్రిలోని బాలాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ్మస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు కేసీఆర్‌కు ఆశీర్వచనం అందించారు. బాలాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.స్వామి వారి దర్శనానికి కంటే ముందే కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, మర్రి జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా.. సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆలయ పండితులు, అధికారులతో కేసీఆర్ సమీక్షించి, పలు సూచనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
12. యాదాద్రి ఆలయ పరిసరాలను పరిశీలించిన సీఎం కేసీఆర్
యాదాద్రి ఆలయ పరిసరాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. బాలాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్‌కు ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు, విప్ గొంగిడి సునీత, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.
13. చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 7 జె.హెచ్.హార్డీ
1812: ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత చార్లెస్ డికెన్స్ జననం.
1877: ప్రముఖ ఆం గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీ జననం.
1888: ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జననం.
1897: ప్రముఖ ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త గెలీలియో ఫెరారిస్ మరణం.
1969: స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు మరియు చలనచిత్ర దర్శకులు ఆమంచర్ల గోపాలరావు మరణం.
1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది
14. శుభమస్తు
తేది : 7, ఫిబ్రవరి 2022
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 40 ని॥ నుంచి
మర్నాడు ఉదయం 6 గం॥ 15 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని
(నిన్న సాయంత్రం 5 గం॥ 16 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 3 ని॥ వరకు)
యోగము : శుభము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 28 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 11 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 1 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 37 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 54 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 36 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 20 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 11 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 28 ని॥ వరకు)
సూర్యోదయం : ఉద 6 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 13 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : మేషము
15. మంత్రాలయంలో రాములోరి విగ్రహ ఏర్పాటుకు రొళ్ల నుంచి భారీ శిల
ప్రసిద్ధిచెందిన కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు రొళ్ల మండలం నుంచి 350 టన్నుల బరువు, 44 అడుగుల పొడవు ఉన్న భారీ రాతిశిలను తరలించనున్నారు. మండలంలోని పిల్లిగుండ్లు గ్రామ సమీపాన గల మంజునాథ క్వారీ నుంచి ఈ శిలను తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. ఆదివారం శిలను మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సందర్శించారు. ఈప్రాంతం నుంచి మంత్రాలయంలో శ్రీరాముడి విగ్రహానికి పెద్ద శిలను తరలించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాతి శిలకు పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ వెంట స్థానిక నాయకులు, క్వారీ ఓనర్ మంజునాథ్ ఉన్నారు.
16. ఇంటికే సమ్మక్క సారలమ్మ ప్రసాదం డెలివరీ
మేడారం సమ్మక్క సారలమ్మ వారి ప్రసాదాన్నిఆర్టీసీ,తపాలా శాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందని ఆయన తెలిపారు.అమ్మవారి ప్రసాదంను డోర్ డెలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్, ఆర్టీసీ, ఐటీ శాఖల సేవలను వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి భారత పోస్టల్ సర్వీసు, ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా తమ ఇంటికే చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.