మహిళలకు ఎక్కడైనా పురుష టైలర్ చేత డ్రెస్సులు కుట్టించేందుకు కొలతలు తీయిస్తారా..? ఒక్కసారి ఆలోచించండి అది ఎంత దారుణమైన చర్య. కానీ.. పోలీసులే ఆ అమానవీయ ఘటనకు సాక్ష్యంగా నిలిచారు. మహిళా పోలుసులే బాధితులుగా మారారు.ఏపీలోని నెల్లూరులో మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కుట్టే విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం విమర్శల పాలైంది. పట్టణంలోని ఉమేశ్‌చంద్ర హాలులో సోమవారం సచివాలయ మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కోసం పురుష టైలర్‌తో కొలతలు తీయించారు. అక్కడే కొందరు మహిళా పోలీసులు ఉన్నా, వారితో కొలతలు తీయించకుండా జెంట్ టైలర్ కొలతలు తీసుకోవడంతో మహిళా కానిస్టేబుళ్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థంకాక ఇబ్బంది పడుతూనే కొలతలు ఇచ్చారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా… ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మహిళలకు పురుష టైలర్‌తో కొలతలు తీయించడమేంటి? మీ ఇంట్లో ఆడవాళ్లకైతే ఇలాగే కొలతలు తీయిస్తారా?” అని ప్రశ్నిస్తున్నారు.
**కొసమెరుపు:
*టైలర్స్ కొలతలు తీసుకునే విభాగానికి ఇంచార్జిగా ఉన్న హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ.
*కొలతలు తీసే ప్రదేశంలోకి ప్రవేశించి ఫోటోలు తీసిన వ్యక్తిపైనా కేసు నమోదు.