కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ గెలవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. కోల్‌కతాలో సోమవారంనాడు మీడియాతో ఆమె మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ప్రజలు మద్దతిస్తే, అఖిలేష్ ఈ ఎన్నికల్లో గెలిచే వీలుందని అన్నారు.యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకే తమ మద్దతు ఉంటుదని ఇప్పటికే ప్రకటించిన మమతా బెనర్జీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం యూపీలో టీఎంసీ పోటీ చేస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ప్రకటించడంతో పాటు సోమ, మంగళవారంలో రెండ్రోజుల పాటు యూపీలో ఆమె పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం అఖిలేష్ యాదవ్‌తో కలిసి సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె పాల్గొంటారు. సమాజ్‌వాదీ పార్టీకి మద్దతివ్వాలని ఈ సందర్భంగా ప్రజలను కోరనున్నారు. యూపీలో తొలి విడత పోలింగ్ ఈనెల 10న జరుగనున్న నేపథ్యంలో మమత యూపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది. 403 సభ్యుల యూపీ అసెంబ్లీకి ఏడు విడతల్లో పోలింగ్ జరుగనుంది. మార్చి 7వ తేదీతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
* సీఎం జగనా.. లేక సజ్జలా అనేది అర్థం కావడం లేదు: ఎంపీ రఘురామ
చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రను మాత్రమే తీసేయాలని పిటిషన్ వేశానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పిటిషన్ వేయలేదని చెప్పారు. చింతామణి నాటకాన్ని నిషేధించవద్దని చెప్పాను అని తెలిపారు. జగన్, ఇతర నేతల మాటలు నమ్మి మోసపోకండని సూచించారు. నాటకాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పిటిషన్ వేశానని పేర్కొన్నారు. చింతామణి నాటకంపై వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోనని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతో ఎలా కాళ్ల బేరానికి వచ్చారు? అని ఎంపీ ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు వారి నేతలను తక్షణమే వదిలించుకోవాలన్నారు. సీఎం జగనా.. లేక సజ్జలా అనేది ప్రజలకు అర్థంకావడం లేదన్నారు. ఎంపీగా తాను రాజీనామా చేస్తున్నానని తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో తాను నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
* మోడీకి ఎదురుపడి ఎందుకు అడగలేదు?: షర్మిల
బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని, మోడీకి ఎదురుపడి ఎందుకు అడగలేదు? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బండ బూతులు తిట్టిన నోటితో బాగున్నారా అని అడుగలేకపోయారా?, సమతా మూర్తి విగ్రహావిష్కరణకు పోని పాపాన్ని కడుక్కోవటానికి ఈ రోజు యాదాద్రి యాగానికి వెళ్ళారా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
* బాలయోగి పేరు మార్పు అక్కసు తీర్చుకోవటానికే: జవహర్
అక్కసు తీర్చుకోవడానికే గురుకులాలకు బాలయోగి పేరు మార్చారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. దళిత ప్రతీకగా వున్న నాయకుని పేరు మార్చటం సరైనది కాదన్నారు. అట్టడుగు స్థాయి నుండి ఎదిగిన నాయకుడు బాలయోగి అని అన్నారు. ఆయన దళిత నవతరానికి స్పూర్తి అని తెలిపారు. జగన్ మదటి నుండి దళితులపై వేధింపులతో ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. దళితులపై భౌతిక దాడులే కాదు వారిని మానసింకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దళితులపై వేధింపులతోనే జగన్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. పేరు మార్పు ఆలోచన విరమించుకోవాలని… గురుకులాలకు బాలయోగి పేరు కొనసాగించాలని జవహర్ డిమాండ్ చేశారు.
* తెలంగాణ వ్యాప్తంగా దళితబందు ఇవ్వాలి: ఈటెల
దళిత బందు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల కేసీఆర్ మాట్లాడిన తీరుతో ఆయన ఎవరో తెలిసిందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. హుజురాబాద్ ఎన్నికల్లో తిరిగిన మంత్రులంతా ఎక్కడున్నారని ఈటెల రాజేందర్ నిలదీశారు
* నకిలీ సమాజ్‌వాదీల వల్లే యూపీ అభివృద్ధిలో స్తబ్దత: మోదీ
సమాజ్‌వాదీ పార్టీ, ఆ పార్టీ సన్నిహతుల కారణంగా ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి గండిపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సామాన్య ప్రజానీకం అభివృద్ధికి, పేద ప్రజానీకం స్థితిగతులు మెరుగుపరడానికి వాళ్లు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజనౌర్‌లో సోమవారంనాడు ఏర్పాటు చేసిన జన్ చౌపల్ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని వర్చువల్ మీట్ ద్వారా మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీపై, గతంలో ఆ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించారు. యూపీ అభివృద్ధి జలాల్లో స్తబ్ధతకు నకిలీ సమాజ్‌వాదీలే కారణమని అన్నారు. తమకోసం, తమ సొంత వాళ్ల దాహం తీర్చేందుకు, స్వలాభం కోసమే వాళ్లు పాటుపడ్డారని, ఆ స్వార్థం వల్లే యూపీలోని అభివృద్ధి జలాల్లో స్తబ్దత ఏర్పడిందని అన్నారు.
*అనంతలో పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష
ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దును నిరసిస్తూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు దిగారు. ఎమ్మార్మో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన, ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేయడం ఆటవిక విధానంగా ఉందన్నారు. ఏసీ రూముల్లో కూర్చుని విజయవాడలో నిర్ణయం చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రజలకు ఏది అనుకూలమో కూడా ఆలోచించాలని.. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వల్ల 8 మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఎక్కడ కళ్యాణదుర్గం… ఎక్కడ రామగిరి కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్లో రామగిరి ఏ విధంగా కలుపుతారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెవెన్యూ డివిజన్లో మార్పు జరిగిందని పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు.
*కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కేటీఆర్ లేఖ
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సింగరేణిని దెబ్బతీస్తే బీజేపీ దెబ్బ తినడం ఖాయమని స్పష్టం చేశారు. సింగరేణి జోలికి వస్తే కార్మికుల డేగ ఢిల్లీకి తాకుతుందన్నారు. సింగరేణిని కేంద్రం ఉద్దేశ పూర్వకంగా చంపే కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
* వైసీపీ పాలన దెబ్బకు కుదేలైన నిర్మాణరంగం: దేవినేని ఉమ
నెలల వైసీపీ పాలన దెబ్బకు ఏపీలో నిర్మాణ రంగం కుదేలైందని ట్విటర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వేలకు చేరిన ఇనుముసిమెంటుఇటుక ధరలు రెట్టింపయ్యాయన్నారు. కరెంటు కోతలతో ఉత్పత్తి తగ్గటమే కారణమని సంస్థలు చెబుతున్నాయని ఉమ పేర్కొన్నారు. సర్కారు తీరుతో ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ఉపాధినిచ్చే నిర్మాణ రంగం సంక్షోభంలో పడడానికి మీ అసమర్థతదోపిడిలు కారణం కాదాఅని దేవినేని ఉమ ప్రశ్నించారు.
*కేసీఆర్‌పై దేశద్రోహం కేసు వేయాలని బీజేపీ నిర్ణయం: రామచంద్రరావు
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దేశద్రోహం కేసు వేయాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత రామచంద్రరావు వెల్లడించారు. రోజుకో గంట పాటు కోర్టుల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. ఫిబ్రవరి నుంచి కోర్టుల ముందు చేంజ్ సీఎం.. నాట్ కానుస్టూషన్పేరుతో బీజేపీ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఇంకా రామచంద్రరావు మాట్లాడుతూ.. ప్రధాని మోదీఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. రాజ్యాంగానికి సంకెళ్లు వేయాలని టీఆర్ఎస్ భావిస్తోందన్నారు.
*ధర్మవరం సబ్ డివిజన్ తీసివేయడం దారుణం: సూర్యనారాయణ
ధర్మవరం రెవెన్యూ డివిజన్ కొనసాగించాలంటూకలెక్టర్ నాగలక్ష్మికి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలను జిల్లాలుగా చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పటి నుంచి ధర్మవరం రెవెన్యూ డివిజన్ ఉందన్నారు. అంతటి చరిత్ర ఉన్న ధర్మవరం సబ్ డివిజన్ తీసివేయడం దారుణమని మండిపడ్డారు. ఉద్యోగస్తులకు జీతాలు పెంచి మళ్ళీ తగ్గించినట్లే.. ధర్మవరం డివిజన్ తీసివేశారన్నారు. కదిరి సబ్ డివిజన్ తీసివేస్తే ఆ శాసనసభ్యుడు మళ్లీ సాధించుకున్నారని.. కానీ ధర్మవరం శాసనసభ్యుడు మాత్రం విజయవాడకు వెళ్లే పరిస్థితుల్లో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం శాసనసభ్యుడికి పుట్టపర్తిలోని రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసమే ఏమీ మాట్లాడడం లేదని సూర్యనారాయణ విమర్శలు గుప్పించారు.
*మణిపూర్‌లో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్, వామపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. మణిపూర్ ప్రొగ్రసివ్ సెక్యులర్ అలయెన్స్ (ఎంపీఎస్ఏ) పేరుతో ఈ కూటమి ఏర్పడింది. బీజేపీయేతర ఆరు పార్టీలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఫార్వార్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ, జేడీ(ఎస్)లు ఇందులో భాగస్వాములయ్యాయి. కూటమి ఏర్పాటును కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరు పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. ఏఐసీసీ మణిపూర్ ఎన్నికల పరిశీలకుడు జైరాం రమేష్, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబి సింగ్, వామపక్షాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
*పంజాబ్ సీఎం అభ్యర్థిగా చరణ్‌జిత్ చన్నీ ?
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతో గత కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు రాహుల్ తెరదించారు. ఆదివారం లుధియానా పర్యటనలో ఆయన ఈ ప్రకటన చేశారు. సాధా రణంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించదు. అయి తే పంజాబ్ ఎన్నికల విషయంలో ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టిం ది. పంజాబ్‌లో వివిధ రాజకీయ పరిణామాలు, సీఎం అభ్యర్థి కోసం చన్నీ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ మధ్య తీవ్ర పోటీ నెలకొనడం వంటి కార ణాల నేపథ్యంలో అధిష్ఠానం అభ్యర్థిని ఎన్నికలకు ముందు ప్రకటించింది. ప్రజ ల విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తే 60 మంది అభ్యర్థులను గెలిపించగలరని సిద్దూ ఇంతకుముందు వ్యాఖ్యానించారు. అలాగే సీఎం అభ్యర్థిని నిర్ణయిం చడానికి అధిష్ఠానం ఇంతకుముందు పంజాబ్‌లో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంది. ఈ పరిణామాల తర్వాత చన్నీని సీఎం అభ్యర్థిగా నిర్ణయించింది. 14న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
*అప్పులు తెచ్చినా ఒక్క అభివృద్ధి పనైనా చేశారా?: కొల్లు రవీంద్ర
రాష్ట్రపతి పాలన పెట్టైనా ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాలని టీడీపీ నేత కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని మంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. దివాలాతీయడంతో ఏం చేయలేకపోతున్నామని మంత్రులు అంటున్నారని చెప్పారు. కరోనా పేరుతో కేంద్రం నుంచి అదనపు నిధులు, అప్పులు తెచ్చినా ఒక్క అభివృద్ధి పనైనా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులను మభ్యపెట్టి ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిన ఏకైక సీఎం జగనే అని విమర్శించారు.
*సీఎం కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి: భట్టి
రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ జాతికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆదివారం కాంగ్రెస్ మహిళా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ లోయర్‌ట్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు గౌరవించే విధంగా రూపొందించిన భారత రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవమానపర్చడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు, ఎస్సీసెల్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బాలాపూర్ చౌరస్తాలోనూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మరోవైపు.. హైదరాబాద్ జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ నాయకులు ఆదివారం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు.
*యూపీ ఎన్నికల తర్వాత మళ్లీ బాదుడే!
కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిజస్వరూపం మళ్లీ బహిర్గతం కానుందని, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను మరో పది రూపాయలు పెంచడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ‘బట్టే బాజ్.. ఝూటే బాజ్ పార్టీ బీజేపీ’అని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.