Devotional

నర్మదా నది విశిష్టత ఇది!

నర్మదా నది విశిష్టత ఇది!

మన దేశంలో నదులను పవిత్రంగా చూస్తారు. గంగ, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ మొదలైన నదులకు ఉన్నట్టుగానే నర్మదా నదికి కూడా ఎంతో చారిత్రక ప్రశస్త్యం ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఈ నది జలాలు ఎంతో మహిమాన్వితమైనవి.మధ్య ప్రదేశ్లోని అమర్ కంఠక్ పర్వతాల్లో పుట్టి మొదటి 320 కిలోమీటర్లు సాత్పూరా శ్రేణులపైన ఉన్న మాండ్ల కొండలలో ప్రవహింస్తుంది. ఆ తర్వాత జబల్ పూర్ వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య, సాత్పూరా శ్రేణుల మధ్య ఉన్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది. అక్కడి గుజరాత్ లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రములో కలుస్తుంది. మొత్తం 1289 కిలోమీటర్లు ప్రయాణించే నర్మదా నది ఒడ్డున ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలతో పాటు పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. నర్మద నదిని భూమిపైకి దింపడం కోసం పురూరవుడు తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నర్మదను దివి నుండి భువికి పంపిస్తాను.

ఈ ప్రవాహాన్ని తట్టుకుని అడ్డుగా నిలిచే వారెవరని అడుగుతాడు శివుడు. అప్పుడు వింధ్య పర్వత రాజు, తన కుమారుడైన అమర్ కంటక్ అడ్డుగా నిలుస్తాడని శివునికి చెప్తాడు. వెంటనే శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదానది దివి నుండి భువికి వచ్చిందని ఓ పురాణ గాథ.అమర్ కంటక్ లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసి స్వర్గ ప్రాప్తి పొందాడు పురూరవుడు. అంతటి మహత్యం కలిగినది నర్మదా నది. నర్మద ఎక్కడ పుట్టిందో అక్కడే నర్మదామాత గుడి కూడా వెలసింది. నర్మదామాత గుడి ఎదురుగా పార్వతీదేవి ఆలయం ఉంది. శివరాత్రికి ఇక్కడ జాతర జరుగుతుంది. ఇది ఇక్కడ జరిగే అతి పెద్ద జాతర. ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు ఇక్కడ అనేక జాతరలు జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు ఈ జాతరలకు తరలివస్తుంటారు. చాలామంది భక్తులు శివరాత్రికి ఇక్కడ జాగారం చేస్తారు. శివరాత్రినాడు నర్మదానదిలో పవిత్ర స్నానం చేసి శివుడిని దర్శించుకుని తరువాత నర్మదామాతను పూజిస్తారు.

ఇక్కడ నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతిదేవితోపాటు శివుడు, సీతా రాములు, హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి.అమర్ కంటక్ నుండి కపిల ధార 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కపిల ధార వద్ద నర్మదానది ఒక లోయ గుండా ప్రవహిస్తుంటుంది. ఇక్కడ జలపాతం 100 అడుగుల ఎత్తు నుండి ఓంకార శబ్దం చేస్తూ పడుతుంది. ఈ నాదం ఎంతో ఆధ్యాత్మిక భావన కలిగిస్తుంది. ఈ నాదం వినేందుకే చాలామంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో రాతితో చెక్కిన ఏనుగు బొమ్మ ఉంటుంది. ఆ ఏనుగు బొమ్మ కాళ్ల మధ్యనుండి దూరి వెళ్తే పుణ్యం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఏనుగుపైన అంబారీ ఎక్కిన ఓ స్త్రీ విగ్రహం తలలేకుండా మొండెం మాత్రమే ఉంటుంది. ఔరంగజేబు జరిపిన దాడిలో తల ధ్వంసం అయిందని చరిత్రకారుల మాట. శ్రీ శంకరాచార్య ఆశ్రమం, బర్సానాశ్రమం, కళ్యాణ సేవాశ్రమం, శ్రీ ఆదినాథ్ జైన్ మందిరం, మాయికీ బగియాగా వ్యవహరించే దేవతా వనం, యంత్ర మందిరం మొదలైనవి ఇక్కడ ఆలయానికి దగ్గరలో ఉంటాయి. యంత్ర మందిరానికి దగ్గర్లో రామకృష్ణ మందిరం కూడా ఉంటుంది.నర్మదానది సముద్రమట్టానికి 1060 మీటర్ల ఎత్తులో మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లాలో ఉందీ ప్రాంతం. అక్కడి నుండి నర్మదా నది దిగువకి ప్రవహిస్తూ చుట్టుపక్కల ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తుంది. ప్రాచీన, ఆధ్యాత్మిక కట్టడాలకు అమర్ కంఠక్ నెలవు. ప్రతీ ఏటా ఇక్కడుండే దేవాలయాలను వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు.

మధ్యప్రదేశ్లో మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం జబల్ పూర్. ధౌన్ ధార్ జలపాతాలు, నర్మదానది చుట్టుపక్కల పాలరాతి కట్టడాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎన్నో దర్శనీయ ప్రాచీన కట్టడాలు పర్యటకులను ఆకట్టుకుంటాయి. చుట్టుపక్కలున్న హనుమంతల్ బడా జైన్మందిర్, మదన్ మహల్, దుమ్నా ప్రకృతి ఉద్యానవనం, రాణి దుర్గావతి మ్యూజియం ఇక్కడ చూడతగిన ప్రాంతాలు.దక్షిణ ముఖంగా నర్మదా నది ప్రవహిస్తూ ప్రకృతి సోయగాలతో అలరారుతున్న మరో ప్రాంతం హోషంగాబాద్.

ఇక్కడ మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రకృతి ప్రియులకు ఇది చక్కటి ప్రాంతం. మాల్వా రాజ్యాన్ని పరిపాలించిన హోషంగ్ షా పేరే ఈ ప్రాంతానికి వచ్చింది. సెథనీ ఘాట్, హోషంగ్ షా కోట, ఆదామ్ గఢ్ కొండల్లో రాతికట్టడాలపై వర్ణచిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. మధ్యప్రదేశ్ ఖండ్వా జిల్లాలోని చిన్న పట్టణం ఓంకారేశ్వర్. నర్మదానది, కావేరి సంగమ ప్రాంతంలో ఉన్న ఓంకారేశ్వర్. శైవ పుణ్యక్షేత్రాలైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ ఆ పరమశివుడు ఓంకార రూపంలో దర్శనమిచ్చాడని చెప్తారు. అందుకే దీనిని ఎంతో పుణ్య క్షేత్రంగా భావిస్తారు. మధ్యప్రదేశ్లో నర్మద నది ఒడ్డున ఉన్న మరో పట్టణం మహేశ్వర్. ఖర్గోనే జిల్లాలో ఉన్న ఈ ప్రాంతంలో కూడా పురాతన ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అలనాటి రాజుల కోటలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఒకవేళ మహేశ్వర్ వెళ్లాలనుకుంటే మాత్రం నర్మద నది ఒడ్డున ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం తప్పకుండా చూడాల్సిందే.