NRI-NRT

బహ్రెయిన్ గోల్డెన్ వీసా ఆఫర్!

బహ్రెయిన్ గోల్డెన్ వీసా ఆఫర్!

విదేశీ నిపుణులు, పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులను ఆకర్షించేందుకు గల్ఫ్ దేశం బహ్రెయిన్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. యూఏఈ మాదిరిగానే విదేశీయులకు ‘గోల్డెన్ వీసా’ పేరిట దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేయాలని యోచిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచే దిశగా బహ్రెయిన్ ఈ ప్రయోగానికి సిద్ధమైంది. ఇలా విదేశీయులకు దీర్ఘకాలిక వీసాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక, పెట్టుబడి, సేవ రంగాలు మరింత మెరుగుపడతాయనేది బహ్రెయిన్ ఆలోచన. ఇప్పటికే ఆ దేశ మంత్రివర్గం ఈ ప్లాన్‌కు గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చేసింది. దాంతో ఈ గోల్డెన్ వీసాపై ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్గత మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొన్న దాని ప్రకారం.. విదేశీయులకు ఇచ్చే ఈ గోల్డెన్ రెసిడెన్సీ వీసా నిరవధికంగా పునరుద్ధరించబడుతుంది. అలాగే బహ్రెయిన్‌లో పని చేసే హక్కుతో పాటు అపరిమిత ఎంట్రీ, ఎగ్జిట్‌లకు వీలు కల్పిస్తుంది. అంతేగాక వీసాదారుడి సన్నిహిత కుటుంబ సభ్యులకు ఆ దేశంలో నివాస సౌకర్యం సైతం ఉంటుంది. “ఈ పోటీ ప్రపంచంలో బహ్రెయిన్ నెగ్గాలంటే ఇలాంటివి చాలా అవసరం. ముఖ్యంగా ఆర్థిక, పెట్టుబడి, సేవ రంగాలకు ఇది ఊతమిస్తుంది. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, బహ్రెయిన్‌ విజయానికి దోహదపడే అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను ఆకర్షించే లక్ష్యంతో ఈ వీసాను తీసుకురావడం జరుగుతుంది.” అని మంత్రిత్వశాఖ వెల్లడించింది.

**గోల్డెన్ రెసిడెన్సీ వీసా పొందేందుకు అర్హులు..
* 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలంలో బహ్రెయిన్‌లో నివాసం ఉన్న ఉద్యోగులు.
* మంత్లీ శాలరీ సగటున 2వేల కువైటీ దినార్లు(రూ.3.95లక్షలు) ఉండాలి.
* దరఖాస్తుదారు తప్పనిసరిగా 2లక్షల కేడీలకు(రూ.4,94,19,030) తగ్గకుండా ఆ దేశంలో సొంత ఆస్తులను కలిగి ఉండాలి.
* పదవివీరమణ పొందిన వారు నెలవారీగా 4వేల కువైటీ దినార్లు(రూ.9,88,380) లేదా అంతకంటే ఎక్కువ జీతం పొందుతూ ఉండాలి.
* ఈ వీసా పొందిన వారు తప్పనిసరిగా ఏడాదికి కనీసం 90 రోజులైన బహ్రెయిన్‌లో గడపాల్సి ఉంటుంది.