* యూపీలో ‘ఉచితాల’ వర్షం కురిపించిన భాజపా.. !
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునే మేనిఫెస్టోతో భాజపా ముందుకొచ్చింది. మంగళవారం రాజధాని లఖ్‌నవూ వేదికగా ‘లోక్ కల్యాణ్ సంకల్ప పత్ర’ పేరిట భాజపా అగ్రనేత అమిత్ షా యూపీ వాసులపై హామీల వర్షం కురిపించారు. మరీ ముఖ్యంగా అన్నదాతలు, నిరుద్యోగులు, మహిళా సంక్షేమంపై ఆ పార్టీ గురిపెట్టింది. రైతన్నల కోసం ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ వరాలిచ్చింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఈ సంకల్ప పత్రాన్ని యూపీకి చెందిన భాజపా బృందం సిద్ధం చేసింది. ఇది కేవలం ప్రకటన పత్రం కాదు. ఇది యూపీ ప్రభుత్వ తీర్మానం. 2017లో ఇచ్చిన 212 హామీల్లో 92 శాతం నేరవేర్చాం. మేం చెప్పింది చేస్తాం’ అని వెల్లడించారు. అలాగే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ మేనిఫెస్టోలో వివరించారు. యూపీ ఏడు దశల్లో పోలింగ్‌కు వెళ్లనుంది. మొదటి దశ పోలింగ్ (ఫిబ్రవరి 10)కు సమయం దగ్గరపడింది.
*బీజేపీకి సిగ్గుందా? : మమత బెనర్జీ
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి, తమ ఓటును వృథా చేసుకోవద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ప్రజలను కోరారు. ఆమె మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్‌పీ నేతృత్వంలోని కూటమికి మద్దతు తెలిపేందుకు ఆమె ఇక్కడికి వచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో సరైన రీతిలో వ్యవహరించలేదని మమత బెనర్జీ ఆరోపించారు. ఈ మహమ్మారి రెండో ప్రభంజనం సమయంలో యోగి పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీని ఓడించడం కోసం ప్రచారంలో తలమునకలై ఉన్నారన్నారు. కోవిడ్ వల్ల ప్రజలు ప్రాణాలను కోల్పోతూ ఉన్నపుడు మీరెక్కడున్నారని యోగిని ఉద్దేశించి ప్రశ్నించారు.
*తెలంగాణలో నిజమైన గ్రామీణాభివృద్ధి జరుగుతోంది: కేటీఆర్
రాష్ట్రంలో నిజమైన గ్రామీణాభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో తొలి 10 గ్రామాల్లో 7 తెలంగాణకు చెందినవే అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న పల్లె ప్రగతి వల్లే ఇది సాధ్యమైంది అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది సీఎం కెసిఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి సాధించిన గొప్ప విజయం! రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి టీమ్ కి శుభాకాంక్షలు! అభినందనలు!!” అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
*ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి?: ఎంపీ రఘురామ
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ సీఎం అయి మూడేళ్లు అయిందని, ఇంతవరకు అమరావతి కట్టలేదన్నారు. గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు రాజధాని కట్టలేదని జగన్ విమర్శించారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎం అనాలని ప్రశ్నించారు. అప్పుల కోసం వైసీపీ ప్రభుత్వం చేయని తప్పులు, మోసాలు లేవనన్నారు. రాజధాని భూమిలో ఎక్కడ కూడా.. భూమి తాకట్టు లేదా అమ్మకం పెట్టొద్దని హైకోర్టు చెప్పిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
* చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్: సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగుల సమ్మె విషయంలో ఎర్ర జెండా వెనుక పచ్చజెండా ఎజెండా ఉందన్నారు. ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరని, చంద్రబాబు సీఎం కాలేదనే బాధ ఉన్నవాళ్లే ఆందోళనలు జరగాలని కోరుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు దత్తపుత్రుడు కూడా ఆందోళనలను కోరుకుంటున్నారంటూ పవన్ కల్యాణ్‌పై జగన్ సెటైర్లు వేశారు.
* కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి: మంత్రి Harishrao
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు బీజేపీ మొండిచేయి చూపిందని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించడంలో వివక్ష చూపించారన్నారు. ఇప్పటివరకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒకటే అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని హుస్నాబాద్‌లో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ నూతన కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
*
* బీజేపీకి రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిక
త్రిపుర అసెంబ్లీతోపాటు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన త్రిపుర ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహా కాంగ్రెస్‌లో చేరారు.ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ఆరోపిస్తూ త్రిపుర ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహాలు బీజేపీకి రాజీనామా చేశారు.ఇద్దరు ఎమ్మెల్యేలు గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరే ముందు ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కలిశారు.60 మంది సభ్యులున్న త్రిపుర అసెంబ్లీలో ఇప్పుడు బీజేపీ పార్టీ బలం 33కి తగ్గింది.‘‘చాలా మంది ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు, అయితే సాంకేతికత కారణంగా వారు మరికొన్ని నెలలు వేచి ఉండాలనుకుంటున్నారు. అందరూ బీజేపీపై విరక్తి చెందారు. గుజరాత్, హిమాచల్‌తో పాటు త్రిపుర రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగవచ్చని నేను భావిస్తున్నాను’’ అని బర్మాన్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత అన్నారు.
* విజయవాడకు రంగా పేరు పెట్టాలి.. టీడీపీ నుంచి డిమాండ్
కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు, పేర్ల నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి రాయలసీమ జిల్లాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవగా.. వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ పావులు కదుపుతున్నది. గత నెలలో వంగవీటి రాధపై రెక్కీ నిర్వహించారన్న విషయం సంచలనం రేపింది. దీన్ని తమ వైపు తిప్పుకునేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీ పోటీ పడి మరీ రాధతో భేటీలు నిర్వహించాయి. చివరకు ఓ అనుమకుడిని అరెస్ట్ చేయడంతో గొడవ పక్కకెళ్లిపోయింది. తాజాగా వంగవీటి మోహనరంగా పేరును వాడుకోవాలని ప్రతిపక్షం నిర్ణయించి ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నది.
* సర్కారీ కొలువుల్లో మహిళలకు 30 శాతం
గోవాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఉపాధి కల్పనకు రూ.500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సోమవారం నువెం అసెంబ్లీ సెగ్మెంట్లో బహిరంగ సభనుద్దేశించి ఆమె మాట్లాడారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో కుంభకోణాలకు చెక్ పెట్టడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. న్యాయ్ పథకం కింద బలహీన వర్గాల వారికి నెలకు రూ.6,000 అందిస్తామని చెప్పారు.మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంపు, మార్గోవా, పణజిల్లో వర్కింగ్ విమెన్‌కు హాస్టళ్లు, పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.80 మించకుండా చూడటం వంటి పలు హామీలను ఆదివారం విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ప్రకటించింది. 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచింది. కానీ చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
* వాస్తవాలకు భిన్నంగా మోడీ వ్యాఖ్యలు: Ponnala
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో ప్రధాని మోడీ వాస్తవాలకు భిన్నంగా మాట్లాడారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అని నిజం ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ… ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారా? అని ప్రశ్నించారు. చప్పట్లు కొడితే, దీపాలు వెలిగిస్తే కరోనా ఆగిందా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యం కోసం నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు కాంగ్రెస్ ఏం చేసిందని మోదీ అడుగుతున్నారని…. రైతు రుణమాఫీ చేసి, మద్దతు ధరపై కమిషన్ వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని చెప్పుకొచ్చారు. స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీని పట్టుకుని తుకుడే.. తుకుడే పార్టీ అని మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. చమురు ధరలు విపరీతంగా పెంచి, సామాన్యుల నడ్డి విడిచిన చరిత్ర మోడీదని మండిపడ్డారు. పారిశ్రామికులకు మేలు చేయడం మినహా.. సామాన్యులకు మోడీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.
* ఆర్థికాభివృద్ధిలో భారత్ పరుగులు : మోదీ
ప్రపంచ దేశాలన్నిటినీ ద్రవ్యోల్బణం ప్రభావితం చేసిందని, యూరో కరెన్సీ అమల్లో ఉన్న దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం అధికంగా ఉందని, కేవలం మన దేశంలో మాత్రమే దీనిని అదుపులో ఉంచగలిగామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం ఇచ్చారు.
* మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ రేవంత్‌రెడ్డి ట్వీట్
మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. హైదరాబాద్ శివార్లలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ అక్రమాలకు పాల్పడుతున్న తన పార్టీ నేతలపై చర్యలు తీసుకునే వరకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంటామని రేవంత్ ట్వీట్ చేశారు.
* ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది: బోండా ఉమ
ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏ, రిటైర్‌మెంట్ వయసు పెంచడం, పన్షనర్ల విషయంలో సర్కార్ మోసం చేసిందన్నారు. ఉద్యోగులకు మంచి జరగాలనే తాము కోరుకుంటున్నామని, ఈ విషయంలో వారికి అండగా ఉంటామని బోండా ఉమ స్పష్టం చేశారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజధాని ప్రజలను మోసం చేస్తున్నాయి: బాబురావు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజధాని ప్రాంత ప్రజలని మోసం చేస్తున్నాయని సీపీఎం బాబురావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ అమరావతి రాజధాని ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టిందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా రాజధాని ప్రాంతానికి కేటాయించలేదని మండిపడ్డారు. బీజేపీ లీడర్లు అమరావతి రాజధానికి సపోర్ట్ అన్నారని… కానీ నిధుల సాధన ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. జీవీఎల్ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్‌లో అమరావతి రాజధాని అని ప్రకటించారన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని అమరావతిని నిర్మిస్తామని మోడీ ప్రకటించారని… కానీ ఏమైందని నిలదీశారు. బీజేపీకి అధికారం ఇవ్వండి రూ.10 వేల కోట్లతో మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని సోము వీర్రాజు అంటున్నారని….అయితే కేంద్రంలో ఉన్నది బీజేపీ అని సోము వీర్రాజు మర్చిపోయినట్లున్నారని యెద్దేవా చేశారు. అమరావతి పేరు చెప్పి సోము వీర్రాజు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకూ రాజధాని అమరావతి సాధనకై నిరాహార దీక్ష చేస్తున్నామని బాబురావు తెలిపారు.
* గోవా ఎన్నికల ప్రచారానికి సిద్దరామయ్య
గోవా శాసనసభ ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య వెళ్లనున్నారు. గోవాలో రెండు రోజులపాటు వివిధ ప్రాం తాలలో ఆయన ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ అధిష్ఠానం సూచన మేరకు మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఆయన ప్రచారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరంగావ్, వాస్కో, దాబోలిన్, కార్తలిమ్ ప్రాంతాలలో మంగళవారం ప్రచారసభలలో పా ల్గొంటారు. బుధవారం ఎన్నికల పరిశీలకుల సభలో పాల్గొని సమీక్ష జరుపుతారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ గోవా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోవాలో ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌లలో సిద్దరామయ్య కూడా ఉన్నారు. మాజీ మంత్రులు హెచ్‌కే పాటిల్, ఎంబీ పాటిల్, ఆర్‌వీ దేశ్‌పాండే, సతీశ్ జార్కిహొళి, బీవీ శ్రీనివాస్ గోవాలో ప్రచారానికి వెళ్లనున్నారు. ఈనెల 14న గోవాలోని 40 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 301 మంది అభ్యర్థులు ఉండగా మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. గోవా ఎన్నికలపై జరిగిన సమీక్షలో కాంగ్రెస్‌కు 17-20 స్థానాలు సాధ్యమవుతాయని ప్రకటించాయి. గోవా రాష్ట్రానికి పొరుగున ఉండే కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నమేరకు వీరి ద్వారా ప్రచారం జరిపిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.
* జిల్లాల పునర్విభజనలో ఎవరి అభిప్రాయాలు
జిల్లాల పునర్విభజనలో ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదనిసొంత పార్టీ వ్యవహారంలా నిర్ణయాలు తీసుకున్నారని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అనేక జిల్లాల్లో స్థానిక సంఘాలుప్రజలు అభ్యంతరాలు తెలుపుతున్నారన్నారు. ప్రజల మనోభావాలను జగన్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసినో వ్యవహారం చూసి రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడ్డారన్నారు. దీనిని దృష్టి మరల్చేందుకే తెరపైకి కొత్త జిల్లా ఏర్పాటు చేశారని అన్నారు. రాజకీయ పార్టీలుప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే జిల్లాలకు పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తూర్పు కృష్ణకు ఎన్టీఆర్విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలన్నారు. దీనిపై ప్రభుత్వాన్ని అడిగినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రేపు విజయవాడ ధర్నా చౌక్‌లో దీక్ష చేయనున్నట్లు చెప్పారు. అవరసరమైతే సీఎం ఇల్లు ముట్టడికి సిద్ధమవుతామని బోండా ఉమ హెచ్చరించారు.
* ఉత్సవ విగ్రహంలా కిషన్ రెడ్డి.. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటాయించే నిధుల్లో కూడా కోత పెట్టడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహంలా మారిపోయాడు అని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు కిషన్ రెడ్డికి పట్టవు అని కోపోద్రిక్తులయ్యారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడితే బీజేపీ వాళ్ళు పెడర్థాలు తీస్తున్నారు. గతంలో ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని పు:న సమీక్షించారు అని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. అంబేద్కర్ స్పూర్తితోనే రాజ్యాంగంలో పు:న సమీక్షలు జరుగుతాయి. అందులో తప్పు ఏముంది అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులేదు. బీజేపీ వాళ్లకు దమ్ము ఉంటే బయ్యారం స్టీల్ ప్లాంట్, సాగు నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీని తీసుకురావాలని సవాల్ విసిరారు.ప్రభుత్వ సంస్థలు అమ్మడమే బీజేపీ పనిగా పెట్టుకుంది అని గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో అంబానీలు, ఆదానీలు తప్ప పేద ప్రజలు ఏవరూ బాగు పడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. దాన్ని చూసి ఓర్వలేక బీజేపీ కుట్రలు చేస్తున్నది. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం తెలంగాణ బీజేపీ ఎంపీలకు లేదు. చౌకబారు ఆరోపణలను బీజేపీ నాయకులు ఆపాలి. చేతకాని దద్దమ్మలా బీజేపీ వాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు. చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చమంటే కూడా బీజేపీ వాళ్లకు చేతకావడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది మాట్లాడిన వివాదం చేయడమే బీజేపీ వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. బీజేపీ వాళ్లకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
*పంజాబ్ సీఎం అభ్యర్థిగా చరణ్‌జిత్ చన్నీ ?
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతో గత కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు రాహుల్ తెరదించారు. ఆదివారం లుధియానా పర్యటనలో ఆయన ఈ ప్రకటన చేశారు. సాధా రణంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించదు. అయి తే పంజాబ్ ఎన్నికల విషయంలో ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టిం ది. పంజాబ్‌లో వివిధ రాజకీయ పరిణామాలు, సీఎం అభ్యర్థి కోసం చన్నీ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ మధ్య తీవ్ర పోటీ నెలకొనడం వంటి కార ణాల నేపథ్యంలో అధిష్ఠానం అభ్యర్థిని ఎన్నికలకు ముందు ప్రకటించింది. ప్రజ ల విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తే 60 మంది అభ్యర్థులను గెలిపించగలరని సిద్దూ ఇంతకుముందు వ్యాఖ్యానించారు. అలాగే సీఎం అభ్యర్థిని నిర్ణయిం చడానికి అధిష్ఠానం ఇంతకుముందు పంజాబ్‌లో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంది. ఈ పరిణామాల తర్వాత చన్నీని సీఎం అభ్యర్థిగా నిర్ణయించింది. 14న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
*అప్పులు తెచ్చినా ఒక్క అభివృద్ధి పనైనా చేశారా?: కొల్లు రవీంద్ర
రాష్ట్రపతి పాలన పెట్టైనా ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాలని టీడీపీ నేత కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని మంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. దివాలాతీయడంతో ఏం చేయలేకపోతున్నామని మంత్రులు అంటున్నారని చెప్పారు. కరోనా పేరుతో కేంద్రం నుంచి అదనపు నిధులు, అప్పులు తెచ్చినా ఒక్క అభివృద్ధి పనైనా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులను మభ్యపెట్టి ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువ ఇచ్చిన ఏకైక సీఎం జగనే అని విమర్శించారు.
*సీఎం కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి: భట్టి
రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ జాతికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆదివారం కాంగ్రెస్ మహిళా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ లోయర్‌ట్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు గౌరవించే విధంగా రూపొందించిన భారత రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవమానపర్చడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు, ఎస్సీసెల్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బాలాపూర్ చౌరస్తాలోనూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మరోవైపు.. హైదరాబాద్ జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ నాయకులు ఆదివారం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు.
*యూపీ ఎన్నికల తర్వాత మళ్లీ బాదుడే!
కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిజస్వరూపం మళ్లీ బహిర్గతం కానుందని, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను మరో పది రూపాయలు పెంచడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ‘బట్టే బాజ్.. ఝూటే బాజ్ పార్టీ బీజేపీ’అని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.