Devotional

సూర్యప్రభ వాహనం పై ఊరేగిన శ్రీవేంకటేశ్వరుడు

సూర్యప్రభ వాహనం పై  ఊరేగిన శ్రీవేంకటేశ్వరుడు

సూర్య జయంతిని పురస్కరించుకొని మంగ‌ళ‌వారంనాడు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించనున్నారు.ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం.రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.

*సూర్యప్రభ వాహనం – (ఉదయం 6 నుండి 8 గం||ల వరకు)
రథసప్తమి వాహనసేవల్లో అత్యంత ప్రధానమైనది సూర్యప్రభవాహనం. ఈ ఏడాది శ్రీ‌వారి ఆల‌యంలోని ధ్వ‌జ మండ‌పం ముందు శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని సూర్య‌ప్ర‌భ‌వాహ‌నంపై వేంచేపు చేశారు. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.43 గంట‌ల‌కు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు.

*ఆయురారోగ్య‌ప్రాప్తి
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ విశ్వ‌నాథ్‌, శ్రీ మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, శ్రీ మారుతి ప్ర‌సాద్, శ్రీ రాములు, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంప‌తులు, ఇత‌ర టీటీడీ అధికారులు ఈ వాహ‌న సేవ‌లో పాల్గొన్నారు.