Devotional

TNI ఆధ్యాత్మిక వార్తా తరంగిణి – 08/02/2022

TNI ఆధ్యాత్మిక వార్తా తరంగిణి –  08/02/2022

1. మంత్రాలయంలో రథసప్తమి వేడుకలు
ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారి మూల బృందానికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మఠం ప్రాకారంలో స్వామి వారి మూల విరాట్‌ను పంచ రథోత్సవంపై ఊరేగించారు. స్వామి దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.

2. బ్రహ్మోత్సవ జాతర 4వ వారం కొమురవెల్లిలో భక్తజన సందోహం
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల 4వ వారాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆలయానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. భక్తిప్రపత్తులతో మల్లన్నకు బోనం నివేదించారు. స్వామివారికి చెలుక, నజరు, ముఖ మండపపట్నాలు వేయడంతో పాటు గంగరేగుచెట్టుకు ముడుపులు కట్టి కష్టాలు తీర్చాలని వేడుకున్నారు. మల్లన్న సహోదరి ఎల్లమ్మకు కల్లు శాకపోసి, బోనాలు నివేదించి ఒడిబియ్యం సమర్పించి చల్లగా కాపాడాలని వేడుకున్నారు. శివసత్తులు, పోతరాజులు భక్తిపారవశ్యంతో సిగాలు ఊగారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఈవో బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి, ధర్మకర్తలు బొంగు నాగిరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్‌, కొంగరి గిరిధర్‌, చింతల పర్శరాములు, కొమురెల్లి తదితరులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామిని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి దర్శించుకుని అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఎల్లమ్మకు బోనం నివేదించారు.

3.చరిత్రలో తొలిసారి.. ఒక్కరోజు బ్రహ్మోత్సవం.. ఏకాంతమే!
ప్రతి ఏడాదీ సూర్యజయంతి రోజున నిర్వహించే రథసప్తమి వేడుకలను ఈ సారి కోవిడ్‌ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 8న ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. కరోనా కారణంగా స్వామివారి ఉత్సవాలను రెండేళ్లుగా భక్తుల సమక్షంలో కాకుండా శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది బ్రహ్మోత్సవాలతోపాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకలను మాత్రం భక్తుల సమక్షంలో నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఒమిక్రాన్‌ విజృభణతో రథసప్తమి వేడుకలను కూడా ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. చరిత్రలో తొలిసారి రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనుండడం గమనార్హం.
*ఒకే రోజు సప్తవాహనాలపై..
రథసప్తమి వేడుకలను శ్రీవారి ఆలయంలో ఒక్కరోజు బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు తొమ్మిది రోజుల్లో 16 వాహనాలపై కొలువుదీరి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. రథసప్తమి పర్వదినంనాడు మాత్రం శ్రీవారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. వేకువజాము నుంచే వాహన సేవలు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది అన్ని వాహన సేవలు ఆలయానికే పరిమితం కానున్నాయి.

4. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఆదిదేవుడు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు. తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. వేలాది మంది భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. దేవస్తానం అనుబంధ ఆలయాల్లో దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజకార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రమాదేవి నేతృత్వంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

5.ఆలయాల్లో అన్నదానానికి గ్రీన్‌సిగ్నల్‌!
కొవిడ్‌ నేపథ్యంలో ఆపేసిన అన్నదాన కార్యక్రమాలను దేవదాయశాఖ మళ్లీ పునరుద్ధరిస్తోంది. కేసులు పెరుగుతున్నాయనే కారణంతో దేవదాయశాఖ ఆదేశాలతో జనవరి మొదటి నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూర్తిగా అన్నదానాలు నిలిపివేశారు. తాజాగా ప్రకాశం జిల్లా మాలకొండలోని మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అన్నదానానికి అనుమతివ్వాలని ఈవో కోరగా దేవదాయశాఖ అనుమతిచ్చింది. ఆలయం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల పరిధిలో భోజన వసతి లేనందున భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఈవో చేసిన విజ్ఞప్తిని అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. ఇక శ్రీకాళహస్తి ఆలయంలోనూ అన్నదానాన్ని ప్యాకెట్ల రూపంలో పునఃప్రారంభించారు.

6. మేడారంలో సకల సదుపాయాలు: సత్యవతి
క్షిణాది కుంభళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పించనున్నామని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగే జాతరలో భక్తులు సులభంగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 నుంచి 20 వరకు జాతర మార్గాల్లో భారీ వాహనాల రాకపోకలను నిషేధించనున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత, ప్యాసింజర్‌ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

7. బాసరలో పదో శతాబ్ది శాసనం
సరస్వతీ దేవి కొలువుదీరిన బాసరలో కొత్త శాసనం వెలుగు చూసింది. ఇది 10వ శతాబ్దికి చెందినదని భావిస్తున్నారు. ఒక విశ్రాంతి వసతి, ఇళ్ల నిర్మాణం చేపట్టిన కార్యక్రమానికి చెందిన శాసనంగా పరిశోధకులు గుర్తించారు. బాసర గ్రామ సమీపంలోని దస్తగిరి గుట్ట మీద పెద్ద గుండుపై ఈ శాసనం చెక్కి ఉంది. స్థానిక యువకులు రమేశ్, యోగేశ్, ఆనంద్‌ తదితరుల ద్వారా సమాచారం అందుకున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బలగం రామ్మోహన్‌ దాన్ని పరిశీలించారు.కల్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడైన రెండో తైలపుని కుమారుడు సత్యాశ్రయుని పేరు ఇందులో కనిపిస్తోందని, సత్యాశ్రయునికి ఇరవ బెడంగ, సట్టి, సట్టిగ అనే పేర్లు కూడా ఉన్నాయని శాసనాన్ని పరిష్కరించిన శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. బసది, నివాసాల కోసం ఈ శాసనాన్ని వేయించినట్టు తెలుస్తోందని తెలిపారు. అందులో రామస్వామి అన్న పేరు కనిపిస్తోందని, అప్పట్లో ఆయన న్యాయాధికారి అయ్యుంటాడని భావిస్తున్నట్టు వెల్లడించారు. దిగువన త్రిశూలం గుర్తు ఉన్నందున, ఆ రాజు శైవ ఆరాధకుడై ఉంటాడని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

8. మేడారంలో భక్తజన సందడి
ములుగు జిల్లా మేడారం జాతరకు ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వాహనాల ద్వారా చేరుకుని.. జంపన్న వాగులో స్నానాలు చేసి.. గద్దెల వద్ద సమ్మక్క–సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. ముడుపులు కట్టారు. సుమారు 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. వాహనాలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై రాకపోకలను పునరుద్ధరించారు.

9. తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
తిరుమ‌ల‌లో ర‌థ‌స‌ప్తమి వేడుక‌లు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై శ్రీమ‌న్నారాయ‌ణుడు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నారు. సూర్య జయంతిని పురస్కరించుకొని నేడు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించనున్నారు.
ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.
*సూర్య ప్ర‌భ వాహ‌నం..
రథసప్తమి వాహనసేవల్లో అత్యంత ప్రధానమైనది సూర్యప్రభవాహనం. ఈ ఏడాది శ్రీ‌వారి ఆల‌యంలోని ధ్వ‌జ మండ‌పం ముందు శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని సూర్య‌ప్ర‌భ‌వాహ‌నంపై వేంచేపు చేశారు. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.43 గంట‌ల‌కు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు.
*ఆయురారోగ్య‌ప్రాప్తి..
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

10. ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం
08-02-22 మంగళవారం నిన్న 07-02-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తల సంఖ్య 35,516 మంది…
స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 13,797 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.53 కోట్లు .

11. సాగరతీరంలో రథసప్తమి పర్వదిన శోభ
రథసప్తమి పర్వదినం సందర్భంగా విశాఖ సాగరతీరంలో ఓం యోగా సెంటర్ ఆధ్వర్యంలో సమూహిక సూర్యనమస్కారాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. సాధకులు 108 సార్లు సూర్యనమస్కారములు నిర్వహించారు. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి నామస్మరణతో అరసవల్లి పులకించిపోయింది. మాఘ శుద్ధ సప్తమి సందర్భంగా సోమవారం అర్ధరాత్రి 12.15 గంటలకు సుప్రభాత సేవ, ఉష:కాలార్చనతో దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ సంప్రదాయం ప్రకారం విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామిజీ స్వామి వారికి తొలిపూజ చేశారు. స్వామివారికి క్షీరాభిషేకం చేసి వేడుకలను ప్రారంభించారు. దేవదాయ శాఖ తరఫున చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కొవిడ్‌ మూడో దశ నేపథ్యంలో కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అధికారులు ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల తరువాతే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుందని ముందుగా ప్రకటించారు. కానీ జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం రాత్రికే శ్రీకాకుళం నగరానికి చేరుకున్నారు. రాత్రి 10 గంటల నుంచే ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లో బారులు తీరారు. మరోవైపు ఇంద్రపుష్కరిణి వద్ద భక్తులు ఎవరూ దిగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.

12. శ్రీశైలంలో వైభవంగా సూర్యారాధన వేడుకలు
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంభమల్లికార్జున స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్యారాధన వేడుకలు నిర్వహించారు. వైదికాచార్యులచే ఆయా బీజమంత్రాలు, ప్రత్యేక ముద్రలతో సూర్యనమస్కారాలు చేశారు. సూర్యభగవానుడికి ఉత్తరపూజనము, నివేదన, మంత్రపుష్పమును అర్చకులు నిర్వహించారు.

13. అరసవెళ్లి సూర్యానారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు
ప్రముఖు పుణ్యక్షేత్రం అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేనిడిప్యూటీ సీఎం కృష్ణదాసు స్వామివారిని దర్శించారు. ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. కాగా అధికారులు మాత్రం వీఐపీల సేవలలో తరిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు దేవాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులను ఆలయం నుంచి బయటకు నెట్టేశారు. దీంతో జర్నలిస్టులు ఆలయం బయట నిరసనకు దిగారు.

14. 8న “నరసింహుడు” సప్త వాహనాలపై భక్తులకు దర్శనం…
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో ఈనెల 8వ తేదీన రధసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 6.45 ని లకు సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభం అయ్యి శేషవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, రాజరాజది వాహనము, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు జరుగుతాయి. కోవిడ్ నిబంధనలు ప్రకారం ఆలయ మాఢ వీధుల యందు మాత్రమే గ్రామోత్సవం జరుగును. కావున భక్తులు వాహన సేవలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

15. చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 08న
సంఘటనలు
1862: ఈస్ట్ ఇండియన్ రైల్వే భారతదేశంలో మొదటి పూర్తి స్థాయి రైల్వే వర్క్‌షాప్ సౌకర్యాన్ని జమాల్‌పూర్‌లో ఏర్పాటు చేసింది.
1936: పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ తర్వాత ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1943: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీలోని కెల్ నుండి పడవ ద్వారా జపాన్‌కు బయలుదేరారు.
1986: ఢిల్లీ విమానాశ్రయంలో మొదటిసారిగా ప్రీపెయిడ్ టాక్సీ సేవలు ప్రారంభమయ్యాయి.
2007: రాజస్థాన్‌లో ఆకాశం నుండి ఒక వస్తువు పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. వస్తువు ఒక ఉల్క అని నమ్ముతారు.
జననాలు
1897: జాకీర్ హుస్సేన్, భారతదేశానికి మూడవ రాష్ట్రపతి
1902: ఆండ్ర శేషగిరిరావు, సుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు. (మ.1965)
1934: పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు.
1938: దేశ్ బధు గుప్తా, భారతీయ వ్యాపారవేత్త
1941: జగ్జిత్ సింగ్, భారతీయ గజల్ గాయకుడు మరియు సంగీతకారుడు. అతన్ని ‘గజల్ కింగ్’ అని కూడా పిలుస్తారు.
1951: అశోక్ చక్రధర్, భారతీయ రచయిత
963: మహ్మద్ అజారుద్దీన్, భారత క్రికెట్ క్రీడాకారుడు మరియు రాజకీయ నాయకుడు
1964: సంతోష్ శివన్, భారతీయ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, నిర్మాత మరియు నటుడు
1988: రుచా హసబ్నిస్, భారతీయ నటి
1990: ఇషితా రాజ్ శర్మ, భారతీయ నటి
1997: అనార్కలి మరికర్, భారతీయ సినిమా నటి
మరణాలు
1971: కె.ఎం.మున్షీ, నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశాడు (జ.1887).
1995: మంచికంటి రాంకిషన్‌ రావు, వీరతెలంగాణా విప్లవ పోరాట యోధుడు.
2016: నిదా ఫజ్లీ, భారతీయ కవయిత్రి మరియు పాటల రచయిత

16. మేడారానికి 3,845 ప్రత్యేక బస్సులు
మేడారం మహాజాతరకు ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ హైదరాబాద్‌, కరీంనగర్‌ జోన్ల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మునిశేఖర్‌ తెలిపారు. సోమవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతరకు ప్రత్యేకంగా 3,845 బస్సులను కేటాయించినట్టు పేర్కొన్నారు. వరంగల్‌ రీజియన్‌ నుంచి 2,250 బస్సులు ఈ నెల 13 నుంచి 20 వరకు నడిపించనున్నట్లు చెప్పారు. కరీంనగర్‌ నుంచి 530, ఆదిలాబాద్‌ నుంచి 320, ఖమ్మం నుంచి 345, రంగారెడ్డి నుంచి 150, సికింద్రాబాద్‌ (వరంగల్‌ రీజియన్‌ ఏడు పాయింట్లు) 200, మెదక్‌ (హుస్నాబాద్‌) నుంచి 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులు అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లవచ్చని తెలిపారు.వేములవాడ క్షేత్రం సోమవారం జనసంద్రంగా మారింది. మేడారం జాతర నేపథ్యంలో శ్రీరాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా భక్తులు నిర్వహించే ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. 70 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని, రూ.24 లక్షల ఆదాయం వచ్చినట్టు ఈవో వెల్లడించారు.

17. ముచ్చింత‌ల్‌లో ఏడో రోజు స‌హ‌స్రాబ్ది వేడుక‌లు.. ర‌థ‌స‌ప్త‌మి సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు
ముచ్చింత‌ల్‌లో ఏడో రోజు స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. నేడు ర‌థ‌స‌ప్త‌మి సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించచారు. దుష్టగ్ర‌హ బాధ‌ల నివార‌ణ కోసం యాగ‌శాల‌లో శ్రీ నార‌సింహ ఇష్టి కార్య‌క్ర‌మం నిర్వ‌హించినట్లు నిర్వాహ‌కులు తెలిపారు. స‌ర్వ‌విధ పాప నివార‌ణ కోసం శ్రీమ‌న్నారాయ‌ణ ఇష్టి, ల‌క్ష్మీనారాయ‌ణ మ‌హాక్ర‌తువు, చ‌తుర్వేద పారాయ‌ణం చేప‌ట్టారు. ప్ర‌వ‌చ‌న మండ‌పంలో శ్రీనార‌సింహ అష్టోత్త‌ర శ‌త‌నామావ‌ళి పూజ‌తో పాటు సామూహిక ఆదిత్య పారాయ‌ణం స‌హా ప‌లు కార్‌.క్ర‌మాలు నిర్వ‌హించారు.