Health

కరోనాకు కొత్త మందు – TNI తాజా వార్తలు 09/02/2022

కరోనాకు కొత్త మందు – TNI  తాజా వార్తలు 09/02/2022

*కోవిడ్ 19 (Covid 19)బారినపడ్డ పెద్దలకు చికిత్స చేసేందుకు ‘గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్’(Glenmark Pharmaceuticals) దాని భాగస్వామి కెనడియన్ బయోటెక్ కంపెనీ ‘ సనోటైజ్ రీసెర్చ్’ బుధవారం మార్కెట్లో నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (Nitric Oxide nasal Spray)(ముక్కు ద్వారా వ్యాక్సిన్) విడుదల చేసింది. ఈ స్ప్రే వ్యాధి సోకితే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్న పెద్దల కోసం ఉద్దేశించినదిగా పేర్కొన్నారు. భారత్‌లో ‘ఫ్యాబిస్ప్రే’ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే తయారీ, అమ్మకానికి సంబంధించి ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ అనే కంపెనీ గతంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం పొందింది .ఫ్యాబిస్ప్రే అనేది కోవిడ్ 19 వైరస్‌ను ముక్కు లోపల ఉండేలా నాశనం చేసేందుకు రూపొందించడం జరిగింది. అయితే, అది ఊపిరితిత్తులకు చేరదు. డ్రగ్ రెగ్యులేటర్ అయిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుండి నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే యాక్సిలరేటెడ్ అప్రూవల్ ప్రాసెస్ తయారీ మార్కెటింగ్ కోసం వేగవంతమైన ఆమోదం పొందింది.కంపెనీ అధికారిక ప్రకటనలో, “నాసల్ స్ప్రే భారతదేశంలో దశ III ట్రయల్స్ కీలక ముగింపు పాయింట్లను పూర్తి చేసింది. 24 గంటల్లో వైరల్ లోడ్‌లో 94 శాతం, 48 గంటల్లో 99 శాతం తగ్గింపును విజయవంతంగా పూర్తి చేసుకుంది.” నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (NONS) ట్రయల్స్ సమయంలో COVID 19 రోగులలో సురక్షితంగా బాగా తట్టుకోగలదని నిపుణులు చెబుతున్నారు. గ్లెన్‌మార్క్ సంస్థ దీనిని ఫాబిస్ప్రే బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తుంది.నైట్రిక్ ఆక్సైడ్ నాసల్‌ను నాసికా శ్లేష్మంపై స్ప్రే చేసినప్పుడు, అది వైరస్‌కు వ్యతిరేకంగా భౌతిక, రసాయన అవరోధంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రకటనలో, ‘FabiSpray ను రూపొందించడం జరిగింది. ఇది COVID 19 వైరస్‌ను చంపగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇది SARS CoV 2పై ప్రత్యక్ష యాంటీవైరల్ ప్రభావంతో యాంటీ మైక్రోబయల్ లక్షణాలను నిరూపితం అయ్యినట్లు పేర్కొన్నారు.నాసికా శ్లేష్మం మీద స్ప్రే చేసినప్పుడు, NONS వైరస్‌కు వ్యతిరేకంగా భౌతిక, రసాయన అవరోధంగా పనిచేస్తుంది. అది ఊపిరితిత్తులకు వ్యాపించకుండా నిరోధిస్తుంది.’ నాసల్ స్ప్రే COVID 19కి సమర్థవంతమైన, సురక్షితమైన చికిత్సగా పరిగణించవచ్చని నిపుణులు చెబుతున్నారు. యాంటీవైరల్ చికిత్సను వివరిస్తూ, రాబర్ట్ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ క్రోకార్ట్ మాట్లాడుతూ, “ఇది రోగులకు చాలా అవసరమైన సకాలంలో వైద్య ఎంపికను అందిస్తుందని మేము విశ్వసిస్తున్నాము.” అని తెలిపారు. ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 71,365 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, నిన్న ఒక్కరోజే 1,72,211 మంది కోలుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడి 1,217 మంది మరణించారు.

* మార్చ్ 1 నుంచి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించనున్నారు. గత ఏడాది నవంబర్ 21న స్థానిక సంస్థలు, కరోనా నిబంధనల కారణంగా పాదయాత్రకు బ్రేక్ పడింది. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి షర్మిల పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. ఎన్నికల వరకూ 4 వేల కిలోమేటర్ల మేర యాత్ర చేయాలని షర్మిల నిర్ణయించారు.

*పార్లమెంట్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా గన్‌పార్క్ దగ్గర టీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. నల్ల జెండాలతో నిరసన తెలిపింది. మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. వివిధ నియోజకవర్గాల నుంచి గన్‌పార్క్ వరకూ టీఆర్ఎస్ బైక్ ర్యాలీ నిర్వహించింది. మంత్రి తలసాని, ఎమ్మేల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. గన్‌పార్క్ దగ్గర టీఆర్‌ఎస్‌ నేతలు మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేశారు.

* ముంబై నుంచి భుజ్ వెళ్లిన అలియ‌న్స్ ఎయిర్ సంస్థ‌కు చెందిన విమానం .. ఇంజిన్ క‌వ‌ర్ లేకుండానే ప్ర‌యాణించింది. ర‌న్‌వేపై ఇంజిన్ క‌వ‌ర్ కూలిన‌ ఆ విమానంలో 70 మంది ప్ర‌యాణించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల పౌర విమాన‌యాన శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఇవాళ ఉద‌యం అలియ‌న్స్ ఎయిర్ ఏటీఆర్ 72-600 విమానం ముంబై నుంచి గుజ‌రాత్‌లోని భుజ్‌కు బ‌య‌లుదేరి వెళ్లింది. అయితే ఆ విమానం మాత్రం సుర‌క్షితంగానే ల్యాండ్ అయ్యింది. కానీ టేకాఫ్ స‌మ‌యంలో ఆ విమాన ఇంజిన్ క‌వ‌ర్ ఊడిపోయింది. టేకాఫ్‌ను మానిట‌ర్ చేసిన ఏటీసీ వార్నింగ్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఆ క‌వ‌ర్‌ను ర‌న్‌వేపై గుర్తించారు. 70 మంది విమానంలో న‌లుగురు సిబ్బంది, ఓ మెంటేనెన్స్ ఇంజినీర్ ఉన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి అప్పల రాజుపై పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి అనుచరులు ఆందోళనను నిర్వహించారు. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈరోజు శారదాపీఠానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పట్టణంలో భారీగా బందోబస్తు నిర్వహించారు. శారదాపీఠంలోకి వెళ్లేందుకు వచ్చిన మంత్రి అనుచరుల కారును బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో పోలీసులకు, మంత్రి అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న సీఐ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహం చెందిన అనుచరులు సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

* రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని ఆదిభ‌ట్ల మున్సిపాలిటీలో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి కేటీఆర్ ప్రారంభించారు. బొంగుళూరు నుంచి ఆదిభ‌ట్ల‌కు రూ. 18 కోట్ల‌తో నిర్మాణం చేయ‌నున్న‌ మంచినీటి పైపులైన్ ప‌నుల‌ను ప్రారంభించారు.

* నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను ప్ర‌ధాని మోదీ అప‌హాస్యం చేయ‌డంపై టీఆర్ఎస్ శ్రేణులు భ‌గ్గుమ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్య‌స‌భ‌లో నిన్న ప్ర‌ధాని చేసిన‌ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ట్విట్ట‌ర్లో టీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్నారు. ModiEnemyOfTelangana పేరుతో ట్విట్ట‌ర్‌లో హ్యాష్‌టాగ్‌లు పెడుతున్నారు. గంట‌లోపే 25 వేల‌కు పైగా ట్వీట్ల‌ను టీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు ట్వీట్ చేశారు. ట్విట్ట‌ర్ ట్రెండింగ్‌లో టీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారుల ట్వీట్లు మొద‌టి స్థానంలో ఉన్నాయి.

*హైదరాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ విభాగాలు ఏర్పాటు అయ్యాయి. బుధవారం డీజీపీ మహేందర్‌ రెడ్డి, నగర సీపీ సి.వి ఆనంద్ ఈ విభాగాలను ప్రారంభించారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ వైజింగ్ వింగ్ ఏర్పాటు అయ్యాయి. హైదరాబాద్ సీపీ కార్యాలయం కేంద్రంగా ఈ రెండు విభాగాలు పనిచేయనున్నాయి. విడతలవారిగా అన్ని కమిషనరేట్స్, ఆయా జిల్లా కేంద్రాల్లో నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేయాలని పోలీసుశాఖ అధికారులు నిర్ణయించారు.

*భార‌త్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 71,365 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976 కు చేరింది. క‌రోనాతో 1,217 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు క‌రోనాతో మరణించిన వారి సంఖ్య 5,05,279కి పెరిగింది.గడిచిన 24 గంటల్లో 1,72,211 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,10,12,869 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 8,92,828 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క‌రోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉందని చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 170,87,06,705 డోసుల వ్యాక్సిన్లు వినియోగించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

*పార్లమెంట్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధాని వ్యాఖ్యలు యావత్ తెలంగాణా సమాజాన్ని కించ పరిచేలా ఉన్నాయని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజీపీ నాయకులు వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవెర్చాల్సింది పోయి, తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

*రాజ్యసభలో ప్రధాన మంత్రి మోదీ వాఖ్యలను నిరసిస్తూ నగరంలో టీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. నిరసన ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన మోడీ శవయాత్రలో మంత్రి పువ్వాడ అజయ్, జిల్లా అధ్యక్షుడు తాత మధు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్‌లో టీఆర్ఎస్ నాయకులు మానవహారం నిర్వహించారు.