NRI-NRT

ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు

ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు

విదేశాలకు వెళ్లాలంటే ఎవరైనా విమానంలోనే వెళ్తారు. కొన్ని దేశాలకు సముద్ర మార్గంలో క్రూయిజ్ షిప్‌లలో చేరుకోవచ్చు.కానీ బస్సుల్లో కూడా విదేశాలకు వెళ్లవచ్చని మీకు తెలుసా? అది కూడా ఏదో పక్కనే ఉన్న నేపాల్‌కు, మయన్మార్‌కు కాదు.. ఏకంగా లండన్‌కు..! అవును… ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సులో వెళ్లవచ్చు. అడ్వెంచర్స్ ఓవర్‌లాండ్ అనే సంస్థ ఈ బస్సు సర్వీసు ప్రారంభించనుంది. రూట్ ఖరారైన తర్వాత సెప్టెంబరులోనే ట్రిప్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లాలంటే.. 18 దేశాల మీదుగా వెళ్సాల్సి ఉంటుంది. ఈ యాత్ర 70 రోజుల పాటు ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ బస్సు దాదాపు 20వేల కి.మీ. ప్రయాణిస్తుంది.

గత 46 ఏళ్లలో ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు సర్వీసును ప్రజలు ఆస్వాదించే అవకాశం లభించడం ఇది రెండోసారి. వాస్తవానికి 1957లో ఢిల్లీ మీదుగా కోల్‌కతా-లండన్ మధ్య ఒక బ్రిటిష్ కంపెనీ బస్సు సర్వీసును ప్రారంభించింది. కొన్నేళ్ల పాటు అది నడించింది. ఐతే ఆ తర్వాత బస్సు ప్రమాదానికి గురవడంతో అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆల్బర్ట్ టూర్స్ అనే కంపెనీ డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తెచ్చింది. సిడ్నీ-ఇండియా-లండన్ మీదుగా బస్సును ప్రారంభించారు. అది 1976 వరకు కొనసాగింది. అనతరం ఇరాన్‌లో అంతర్యుద్ధం, భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా బస్సు సర్వీసును నిలిపివేశారు. మళ్లీ ఇన్నేళ్లకు బస్సు సర్వీసు ప్రారంభంకానుంది. రోడ్డుమార్గంలో విదేశీ యాత్రను చేయాలనుకునే వారికి ఇది మంచి కిక్ ఇస్తుంది.

భార్-మయన్మార్ సరిహద్దులో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మయన్మార్ మీదుగా ఈ సర్వీసు నడవనుంది. గతంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా లండన్ వెళ్లేవారు. కానీ ఇప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రూట్ మార్చారు. కొత్త మార్గంలో లండన్‌కు బస్సును నడపనున్నారు. ఢిల్లీ నుంచి మయన్మార్‌ మీదుగా లండన్‌కు బస్సును నడుపుతారు. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన లగ్జరీ బస్సులు ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరనున్నాయి.

ఢిల్లీ నుంచి కోల్‌కతా బస్సులో మయన్మార్ చేరుకుంటారు. అక్కడి నుంచి థాయ్‌లాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్‌, లండన్‌కు వెళ్తుంది. ఈ ట్రిప్‌లో కేవలం బస్సు మాత్రమే కాదు నౌకలో కూడా ప్రయాణింవచ్చుు. ఫ్రాన్స్‌ నుంచి సముద్రమార్గంలో క్రూయిజ్ షిప్‌లో ఇంగ్లీష్ ఛానెల్ దాటుతారు. ఫ్రాన్స్, లండన్ మధ్య ఫెర్రీ సర్వీస్ ద్వారా ఫ్రాన్స్‌లోని కాల్ నుంచి యూకేలోని డోవర్‌కు బస్సును తీసుకెళ్తారు. దానిని దాటడానికి రెండు గంటల సమయం పడుతుంది. ఇంగ్లీష్ ఛానెల్ దాటిన తర్వాత.. మళ్లీ బస్సులో ప్రయాణికులను లండన్‌కు తరలిస్తారు. ఈ బస్సు చాలా ప్రత్యేకమైనది. మొత్తం 20 సీట్లు ఉంటాయి. ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక క్యాబిన్ ఉంటుంది. తినడం, తాగడం నుంచి పడుకునే వారకు సకల సౌకర్యాలు ఉన్నాయి. 18 దేశాల మీదుగా 20 వేల కి.మీ.ల మేర ఈ బస్సు యాత్ర సాగుతుంది. దాదాపు 70 రోజులు ఉంటుంది. మరి ఇందులో ప్రయాణించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా.? రూ.15 లక్షలు. వివిధ దేశాలలో టిక్కెట్లు, వీసా, వసతి వంటి అన్ని సేవలను ఇందులోనే పొందుతారు. మీరూ ఈ ట్రిప్‌ను ఆస్వాదించాలనుకుంటే.. వీసా సహా అవసరమైన అన్ని పత్రాలతో కంపెనీని సంప్రదించవచ్చు. వివిధ దేశాలు మీదుగా రోడ్డుమార్గంలో సాగే ఈ అద్భుతమైన యాత్ర కోసం ఇప్పటి నుంచే ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.