Devotional

స్వాముల చేతుల్లో కర్రలేందుకో తెలుసా! TNI ఆధ్యాత్మికం – 13/02/2022

స్వాముల చేతుల్లో కర్రలేందుకో తెలుసా!  TNI ఆధ్యాత్మికం – 13/02/2022

ఏకదండి, ద్విదండి, త్రిదండి…స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా…ఆది శంకరాచార్యుల నుంచి నేటి అందరు స్వాముల వరకూ చేతిలో కర్ర ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. స్వామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే.. దాని వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా… ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజచార్యులు, జీయర్ స్వాములు మరికొందరు..వీళ్లందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది గమనించారా. ఏ సమయంలో చూసినా వాళ్ల చేతిలో ఉంటాయి. అదేమైనా ఊతకోసమా అంటే కానేకాదు. మరి ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉంటారెందుకు అంటారా.. అవి వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తు. ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు. ఈ కర్రల్లో మూడు రకాలున్నాయి అవే ఏకదండి, ద్విదండి, త్రిదండి.
*****ఏకదండి…..
ఒక కర్రను (ఏకదండి ) ధరించేవారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. అందుకు ఉదాహరణ ఆదిశంకరాచార్యులు. అద్వైతం అంటే జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి సేకరించిన కర్ర ఉంటుంది.
*****ద్విదండి…
రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు. ఇందుకు ఉదాహరణ మధ్వాచార్యులు. వీరిని ‘ద్విదండి స్వాములు’అంటారు. దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ, పరమాత్మ వేరువేరన్నది వీరి ఉద్దేశం. జీయర్ లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు.
*****త్రిదండి….
మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. వీరిది రామానుజాచార్యుల పరంపర. శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు. ఇది ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే వాటి గురించిన వివరణ, స్వస్తి.

*****************************
1.శోభాయమానంగా అంతర్వేది రథయాత్ర
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి రథయాత్ర శనివారం అత్యంత శోభాయమానంగా సాగింది. సుమారు లక్ష మందికి పైగా భక్తులు రథ యాత్రలో పాల్గొన్నట్లు అంచనా. శుక్రవారం రాత్రి స్వామి వారి కల్యాణం జరిగిన నేపథ్యంలో అనంతరం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో భక్తులు సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మధ్యాహ్నం 3 గంటలకు రథ యాత్ర ప్రారంభం కాగా, భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కలిదిండి గోపాలరాజు బహద్దూర్‌ కొబ్బరి కాయ కొట్టి రథ యాత్ర ప్రారంభించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు.

2.ఆ ఆలయంలో మొక్కు‍లు ప్రత్యేకం.. అరటిగెలలు.
కోరిన కోర్కెలు నెరవేర్చే దైవానికి వస్తు రూపేణ, ధన రూపేణ భక్తులు మొక్కులు చెల్లించటం మామూలే. అయితే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రలో వెలసిన లక్ష్మీనరసింహస్వామికి భక్తులు మొక్కులు చెల్లించే విధానం కాస్త ప్రత్యేకం. స్వామివారికి ప్రతి ఏటా అరటిగెలల ఉత్సవం నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో అరటిగెలలు వేలాడదీసి మొక్కులు చెల్లించటం ఇక్కడ ఆనవాయితీ.శనివారం జరిగిన ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు గెలలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. సమారు 5 వేలకుపైగా గెలలతో ఆలయ ప్రాంగణం అంతా అరటిమయం అయ్యింది. ఆలయంలో అరటి గెల కట్టిన భక్తులకు రశీదు అందజేస్తారు. రెండు రోజుల తర్వాత తిరిగి ఎవరి గెలను వారికి ఇచ్చేస్తారు. ఆ గెలను ఇంటిల్లిపాదీ ప్రసాదంగా స్వీకరిస్తారు. కొందరు పానకంగా తయారు చేసి పంపిణీ చేస్తారని స్థానికులు తెలిపారు.

3. 16న వరసిద్ధుడి స్వర్ణ రథం ప్రారంభం.. CM YS Jagan విచ్చేసే అవకాశం!
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామికి నూతనంగా తయారు చేయించిన స్వర్ణ రథాన్ని ఈనెల 16వ తేదీన ప్రారంభించనున్నట్లు చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. స్వర్ణ రథ నిర్మాణాన్ని టీటీడీ వారు చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం ఆలయాధికారులు రూ.6కోట్లను వెచ్చించారు. ప్రారంభోత్సవలో భాగంగా.. ఈనెల 14న సాయంత్రం నాలుగు గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, అనుజ్ఞ, పుణ్యాహవచనం, వాస్తు శాంతి, ప్రవేశ బలి, కలశ స్థాపన, మొదటి కాల పూజ, హోమం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. 15న ఉదయం తొమ్మిది గంటలకు కలశ పూజ, రెండో కాల పూజ, నయనోన్మిలనం, హోమం, పూర్ణాహుతి, సాయంత్రం నాలుగు గంటలకు కలశ పూజ, మూడో కాల పూజ, హోమం, పూర్ణాహుతి ఉంటాయి. 16న ఉదయం తొమ్మిది గంటలకు కలశ పూజ, నాల్గవ కాల పూజ, హోమం, మహా పూర్ణాహుతి, నూతన స్వర్ణ రథానికి మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవర్లను కాణిపాకం మాడ వీధుల్లో ఊరేగిస్తారు. స్వర్ణ రథ ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

4.వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ.
తడ మండల పరిధిలోని అక్కంపేట వద్ద నూతనంగా నిర్మించిన కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ అర్చకులు అనంతకుమార్‌ తెలిపిన వివరాల మేరకు శుక్రవారం రాత్రి సమయంలో యధావిధిగా ఆలయానికి తాళాలు వేసి పూజారి వెళ్లిపోయారు. శనివారం ఉదయం ఆలయానికి వచ్చి చూడగా ఆలయ ప్రధాన గేటుకు ఉన్న తాళాలు పగులగొట్టి ఉండటం గుర్తించారు. దానికి దగ్గరలో గర్భగుడి లోపల ఉండే హుండీని పారవేసి ఉండటం గమనించి ఆలయంలోకి వెళ్లి చూడగా దొంగలు చోరీ చేసినట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఆలయాన్ని పరిశీలించారు. ఈ మేరకు ఆలయంలో దేవతామూర్తులకు అలంకరించి ఉన్న సుమారు ఒక కిలో బరువు ఉన్న మూడు వెండి కిరీటాలు, అమ్మణ్ణి తాళిబొట్లు, ఆలయంలో ఉన్న 120 కలి శాల చెంబులు, ఐదు బిందెలు, ఒక సుదర్శన చక్రం, మైక్‌ సెట్‌తోపాటు తొమ్మిది నెలలుగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు సుమారు రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

5.మేడారంలో స్విస్‌ టెంట్లు.. తొలిసారిగా ఏర్పాట్లు
మేడారం జాతరలో స్విస్‌ టెంట్లు తొలిసారిగా అందుబాటులోకి వచ్చాయి. హరిత హోటల్‌ వద్ద లల్లూజీ అండ్‌ సన్‌ కంపెనీకి చెందిన ఈ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్విస్‌ గుడారంలో డబుల్‌ బెడ్‌రూంలతో పాటు ఏసీ సౌకర్యం ఉంటుంది. అలాగే రెండు బాల్కనీలు, హాల్‌, రెండు టాయిలెట్లు కూడా ఉంటాయి. అయితే వీటికి రోజుకు రూ.20 వేల చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దర్బారీ టైప్‌ టెంటుకు రోజుకు రూ.30 వేలుగా నిర్ణయించారు. ఆదివారం నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు తెలిపారు.

6. విల్లాల దాతలకు నంబర్ల కేటాయింపు
యాదాద్రి ఆలయ విస్తరణలో భాగంగా ప్రతిష్ఠాత్మకమైన ప్రెసిడెన్షియల్‌ సూట్‌తో పాటు మరో 14 విల్లాల దాతలు ఆయా విల్లాల వద్ద సంప్రదాయరీతిలో పూజల్లో పాల్గొన్నారు. బాలాలయ మండపంలో 14 విల్లాల నంబర్ల లాటరీ తీశారు. ఏ దాతకు ఏ విల్లాను కేటాయించారో వివరాలను వైటీడీఏ అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రెసిడెన్షియల్‌ సూట్‌లోని విల్లాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి కార్పొరేషన్‌ లిమిటెడ్‌, నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌, యశోదా హెల్త్‌కేర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేటు లిమిటెడ్‌, మెసర్స్‌ నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌, మెసర్స్‌ హెటిరో ల్యాబ్స్‌ లిమిటెడ్‌, ద సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌, మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌, ప్రతిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌, గ్రీన్‌ కో కంపెనీ, ఎమ్మెఎ్‌సఎన్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ సంస్థలు ఉన్నాయి.

7. మేడారం జాతర నిర్వహణకు కేంద్రం రూ.2.5 కోట్ల నిధుల కేటాయింపు:కిషన్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ,పర్యా టక మంత్రిత్వ శాఖల ద్వారా రు.2.5 కోట్లు నిధులను విడుదల చేయడానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్రసాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రకటించారు.ఈ నెల 16న ప్రారంభం అయ్యే సమ్మక్క సారలమ్మ జాతర అతిపెద్ద గిరిజన జాతర. తెలంగాణలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో నివసించే ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో, ఫిబ్రవరి16 నుంచి 19వ తేదీ వరకు ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగనుంది. గిరిజన సాంస్కృతిక, వారసత్వాన్ని ప్రోత్సహించడంలో కేంద్రప్రభుత్వ పాత్రపై కేంద్ర మంత్రి చెబుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రజల ప్రత్యే కసంస్కృతి, వారసత్వాన్ని ఎంతో గౌరవిస్తుందని మంత్రి తెలిపారు. జాతరను నిర్వహణకు కేంద్రగిరిజన మంత్రిత్వశాఖ ద్వరా నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు.ఈ నిధులను మేడారంలోని చిలకల గుట్ట చుట్టూ సంప్రదాయ రీతిలో 500 మీటర్ల కాంపౌండ్ గోడను నిర్మించటానికి, దానికి అనుసంధానంగా 900 మీటర్ల మెష్ ను ఏర్పా టు చేయటానికి, గోడల మీద గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా అధ్భుతమైన చిత్రాలను వేయటానికి, గిరిజన మ్యూజియంలో డిజిటల్ సమాచార కేంద్రాలు ఏర్పా టు, గిరిజన మ్యూజియం పరిసరాలలో కోయ గ్రామాన్ని ప్రతిబింబించేలా నిర్మాణాలుచేపట్టడానికి వినియోగిస్తామన్నారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఐలాపూర్ సమ్మక్క జాతర, చిరుమల్ల సమ్మక్క జాతర, సాదలమ్మ తిరుణాల వంటి అనేక పండుగలు,వాటి విశిష్టత మీద పరిశోధనలు చేయడానికి, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, పెయింటింగ్ వంటి పోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటానికి, కోయ డ్యా న్స ట్రూప్స, కొమ్ము కోయ, రేలా డ్యా న్స ట్రూప్స, పెయింటింగ్ వంటివాటిని చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తించి వాటికి ఆర్థిక సహాయం అందించటానికి ఉపయోగిస్తామన్నారు.అలాగే “స్వదేశ్ దర్శన్ పథకం క్రింద, పర్యా టక మంత్రిత్వ శాఖ గిరిజన సర్క్యూట్ల అభివృద్ధిలో భాగంగా 2016-17 లోనే దాదాపు 80 కోట్లరూపాయలతోములుగు – లక్నవరం -మేడవరం -తాడ్వా యి- దామరవి – మల్లూర్ – బోగత జలపాతాలలో సమగ్ర అభివృద్ధిని చేపట్టడం జరిగిందని అన్నా రు. అందులోభాగంగా మేడారంలో అతిథి గృహాన్ని, ఓపెన్ ఆడిటోరియం, పర్యా టకుల కోసం విడిది గృహాలు, త్రాగునీరు వంటి వివిధ సౌకర్యా లు, సోలార్ లైట్లు వంటి వాటిని ఏర్పా టు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ పండుగ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది గిరిజన భక్తులు హాజరు కానున్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

8. TTD సలహా మండలి సభ్యుడిగా ఆనందకుమార్ రెడ్డి ప్రమాణం
టీటీడీ చెన్నై సమాచారకేంద్ర సలహామండలి సభ్యుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కె.ఆనందకుమార్రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. టి.నగర్ వెంకటనారాయణ రోడ్డులో వున్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరిం చారు. ఆయనతో పాటు మరో సభ్యుడు స్వతంత్రన్ కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పీవీఆర్ కృష్ణారావు, మోహన్రావ్, మాజీ ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. సలహా మండలిలో అధ్యక్షుడిగా ఏజే శేఖర్ గత ఏడాదే బాధ్యతలు స్వీకరించగా, ముగ్గురు ఉపాధ్యక్షులు, 19మంది సభ్యులు ఈ నెల 6వ తేదీన ప్రమాణం చేశారు. అనివార్య కారణాలతో ఆ రోజు హాజరుకాలేకపోయిన ఇద్దరు సభ్యులు కూడా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు

9. 11వ రోజుకు చేరిన సమతామూర్తి సహస్రాబ్ధి ఉత్సవాలు..
ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో సమతామూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం గంటపాటు అష్టాక్షరీ మహామంత్ర జపం జరిగింది. అనంతరం యాగశాలలో లక్ష్మీనారాయణ మహాయాగం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి పరమేష్టి ఇష్టి, వైభవేష్టి ఇష్టి హోమాలు నిర్వహించనున్నారు.

10. యాదాద్రిని కేసీఆర్ అద్భుతంగా నిర్మిస్తున్నారు: Roja
యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే రోజా కొనియాడారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రోజా దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ కాలంలో ఏవరికి దక్కని అవకాశం కేసీఆర్‌కు దక్కిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇక్కడికి తీసుకువచ్చిన రాయి గుంటూరు నుంచి తీసుకు వచ్చారని, ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్ళు, అక్కచెల్లెలుగా కలిసి ఉంటారని రోజా స్పష్టం చేశారు.

11. అంతర్వేదిలో వైభవంగా లక్ష్మీనారసింహుడి కల్యాణం
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకించారు. భక్తుల కోసం ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రథోత్సవం సాఫీగా సాగేందుకు పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించారు.అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి వివాహాన్ని వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 12.35 గంటల నుంచి అర్చకులు వివాహానికి సంబంధించిన క్రతువులను నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహాన్ని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ధ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున సరిగ్గా 12.35 గంటలకు వృచిక లగ్నం, వేదమంత్రాలు, మేళా తాళం, సంప్రదాయ వాద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పట్టువస్త్రాలతో అలంకరించి కల్యాణం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు, రాజోల్ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ సమ్మిట్ కుమార్, ఆర్డీఓ ఎన్ఎస్వీబీ వసంతరాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి వై భద్రాజీ, అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చే భక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక బస్ షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రారంభమయ్యే రథోత్సవానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రథోత్సవం సజావుగా సాగేందుకు 1,560 మంది పోలీసులను మోహరించారు.

12. రామానుజుల వారి దృక్పథమే ప్రపంచానికి ఏకైక దారి: మంత్రి ఎర్రబెల్లి
ముచ్చింతల్ లోని జీయర్ ట్రస్ట్ లో 1035 హోమగుండాల శ్రీలక్ష్మీ నారాయణ మహా క్రతువు, గోపాలోపాయన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సమాన అవకాశాలు కలిగి, అందరిలోనూ సమ భావన కలిగి ఉన్నప్పుడే సమాజంలో ప్రజలకు సుఖ శాంతులు,సంతోషాలు కలుగుతాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా100 ఏళ్ల క్రితమే ప్రపంచానికి సమత ను చాటిన రామానుజుల వారి భారీ విగ్రహాన్ని మూచ్చింతల్ లో ప్రతిష్ఠించి, లోకానికి అంతా సమానం అనే విషయాన్ని చాటుతున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, అందుకు తోడుగా నిలిచిన మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు గార్లు చరిత్రలో నిలిచి పోతారని మంత్రి అన్నారు.

13. బసవా అని పిలిస్తే రథం దానంతటదే కదిలి వస్తుంది
దేవదుర్గ తాలూకా గబ్బూరులో కొలువైన బూదిబసవేశ్వర స్వామి మహిమాన్వితుడిగా భక్తులనుంచి పూజలందుకుంటున్నారు. స్వామివారిని తలుచుకుంటే చాలు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు, పెళ్లి కానివారు ఈ ఆలయంలో నిద్రచేస్తుంటారు. నవాబ్, నిజామ్‌ల కాలం నుంచే స్వామివారు మహిమలు చూపేవారని భక్తులు చెబుతారు. రథోత్సవం రోజున లేచిరా బసవా అని ఐదుసార్లు పిలిస్తే రథం దానంతటకదే పది అడుగుల దూరం మేర కదిలి వస్తుంది. బూది బసవేశ్వర జాతర పదిరోజులపాటు జరుగుతుంది. భక్తులంతా ఈ పది రోజులూ మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. 13న జరిగే రథోత్సవానికి ఏర్పాట్లు చేశారు.

14. చినవెంకన్నను దర్శించుకున్న జస్టిస్ సుజాత
ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు దేవస్థానం అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆ తరువాత ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు వారికి వేద ఆశీర్వచనాన్ని పలికారు. అధికారులు ప్రసాదాలను అందజేశారు.
14. కొమురెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకొని, పట్నాలు వేసి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందించి వారిని సత్కరించారు.

15. మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి ఎర్రబెల్లి
ములుగు జిల్లాలోని మేడారంలో ఈ నెల 16 నుండి 19 వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తీ చేసిందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.ఆదివారం మేడారం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తూ మార్గమధ్యంలో ములుగు సమీపంలో ఉన్న శ్రీ గట్టమ్మ తల్లి దేవాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని అయన తెలిపారు.మేడారం జాతరను సందర్శించే ముందు మార్గమధ్యంలో ఉన్న గట్టమ్మ తల్లిని ముందుగా సందర్శించడం ఆనవాయితీ అని మంత్రి తెలిపారు. గట్టమ్మ తల్లి దేవాలయ దర్శనంకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యలు కల్పించామని అయన తెలిపారు. అంతకుముందు పూజారులు ఆలయ అధికారులు మంత్రి దయాకర్ రావుకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు