ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటుకు తొలినుంచి సీఎం కేసీఆర్ పూర్తి సహకారం అందించారు. వసతుల కల్పనతలో పాటు ఇతర సదుపాయాలలో ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చినజీయర్ స్వామి తీరుతో కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ముచ్చింతల్ వైపు కన్నెత్తి కూడా చూడకూడదని నిర్ణయించుకున్నారు. అక్కడ జరిగే పరాయణాన్ని ఆలకించేందుకు కేసీఆర్, సతీమణి ప్రతిరోజు వెళ్లేవారు. అయితే ఆరు రోజులుగా ఆమె కూడా వెళ్లడం లేదు. చినజీయర్‌తో పాటు ఈ మొత్తం కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియగా నిలిచిన మైం హోమ్ రామేశ్వరరావు తీరుపై కూడా కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. యాదాద్రి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ చిన్నజీయర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు జీయర్‌పై ఆయన గుర్రుగా ఉండడం వల్ల యాదాద్రి ప్రారంభోత్సవంలో ప్రాధాన్యత లభిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. ఇక జీయర్ స్వామి, రామేశ్వరరావు విషయంలో కేసీఆర్ తీరు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.
ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహావిష్కరణ, ఇక్రిశాట్ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మోదీ పర్యటనకు కూడా కేసీఆర్ దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో ఏవైనా ప్రతిష్ఠాత్మక సంస్థలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెళ్లి స్వాగతించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ పర్యటనలో అలా జరగలేదు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్వాగతం పలికారు.