రంగారెడ్డి ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. అంతకు ముందు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎస్ సోమేశ్‌కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా సమతామూర్తిని తిలకించారు. ఆ తర్వాత సముతామూర్తి కేంద్రానికి చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు చినజీయర్ స్వామి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సమతామూర్తి కేంద్రంలోని 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని రాష్ట్రపతి సందర్శించారు. దివ్యక్షేత్రంలోని 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నారు. ఆ తర్వాత భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువై ఉన్న 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.