* బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు కపట నాటకాలు కట్టిపెట్టాలి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. కేంద్ర త్రిసభ్య కమిటీ అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించటంలో జివిఎల్ కిలక పాత్ర పోషించారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీల గురించి చర్చించడానికి ఒక ప్రత్యేక కమిటీని కోరుతూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాశానంటున్నారు. బిజెపి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదనటానికి ఇవే నిదర్శనాలు. జీవీఎల్ రెండు నాల్కల ధోరణి తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రం ఏపీకి పదేపదే చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 20న విజయవాడలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
* ఆ విషయంలో కేసీఆర్‌ను మెచ్చుకున్న జగ్గారెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించారు. కల్యాణలక్ష్మి చాలా మంచి పథకమన్నారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు రూ.లక్షకు పైగా ఇవ్వడం, అందరూ అభినందించాల్సిన విషయమన్నారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ చెబుతున్నాని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కల్యాణలక్ష్మిని రూ.2 లక్షలు చేయిస్తానని స్పష్టం చేశారు..
* టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు షర్మిల నిరసస దీక్ష
తెలంగాణలో నిరుద్యోగులకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు మెరుపు దీక్షకు దిగారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. దీంతో పోలీసులు వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే షర్మిలను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు దాటుతున్నా.. ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని షర్మిల ఆరోపించారు. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
* పచ్చకామెర్ల వాళ్లకి అలాగే కనిపిస్తుంది: అమిత్‌షా
ఉత్తరప్రదేశ్‌ను బీజేపీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిప్పికొట్టారు. పసుపుపచ్చ కళ్లదాలతో చూసే వాళ్లకి ప్రతీదీ ఆ రంగులోనే కనిపిస్తుందని ఛలోక్తులు విసిరారు. ఉత్తరప్రదేశ్‌లోని దిబియాపూర్‌లో మంగళవార జరిగిన ఎన్నికల ప్రచారసభలో అమిత్‌షా మాట్లాడుతూ, అఖిలేష్ ప్రభుత్వం తుపాకులు, తూటాలు తయారుచేసేదని అన్నారు. ఇప్పుడు తూటాలకు (గోలీ) బదులు లక్ష్యం (గోల్) సిద్ధం చేసుకున్నామని, పాక్‌కు కాల్పులతోనే దీటుగా సమాధానమిస్తున్నామని చెప్పారు.
* పేదలకు చేరాల్సిన నిధులను మింగేస్తున్నారు: చంద్రబాబు
రాష్ట్రంలో ఉపాధి నిదులు రూ. 261 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రకటించడం రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పేదలకు చేరాల్సిన నిధులను అధికార పార్టీకి చెందిన నేతలు మింగేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు ఆస్తులు లాక్కోడానికే ఆటోనగర్‌లోని స్థలాలపై ప్రభుత్వం జీవో జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ స్థలాలను కబ్జా చేయడానికి జగన్ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. విశాఖ ఉక్కు, కృష్ణపట్నం థర్మల్ స్టేషన్లు అమ్మడానికి.. ఆపడానికి జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు. ఉపాధి చూపకపోగా, ఉపాధి మార్గాలను కూడా మూసివేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారులకు నష్టం చేసే 217 జీవోను వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు
* భారీ పోలింగ్ మా విజయానికి సంకేతం: కాంగ్రెస్
గోవాలో భారీ పోలింగ్ శాతం నమోదు కావడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. తాము పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడానికి ఇది గట్టి సంకేతమని పేర్కొంది. 40 అసెంబ్లీ నియోకవర్గాలకు ఒకే విడతలో సోమవారం జరిగిన గోవా ఎన్నికల్లో 78.94 శాతం పోలింగ్ నమోదైంది. సాంక్వెలిమ్ నియోజకవర్గంలో గరిష్టంగా 89.61 శాతం, బెనౌలిమ్ నియోజకవర్గంలో కనిష్టంగా 70.2 శాతం పోలింగ్ నమోదైంది. నార్త్‌గోవాలో 79 శాతం, సౌత్ గోవాలో 78 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం పోలింగ్ శాతాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన పార్టీలన్నీ ఎవరి అంచనాల్లో అవి ఉన్నాయి.
*కేసీఆర్‌ను ఎప్పుడూ నమ్మవద్దు: రేవంత్
“మొసలి కన్నీరు” కార్చడమనేది ఒక ఆర్ట్.. అందులో మీ నేత మాస్టర్ డిగ్రీ చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా విమర్శించారు. కానీ ప్రధాని మోదీ ‘తెలంగాణ తల్లి’ని, మన అమరవీరుల త్యాగాలను అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారన్నారు. ఈ ట్వీట్‌కు ‘కేసీఆర్‌ను ఎప్పుడూ నమ్మవద్దు’ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు
*ఇది ప్రజా విజయం: మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ మునిస్పిల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేసిన ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజా విజయంగా అభివర్ణించారు. ప్రజాసేవే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూనే ఉంటుందని అన్నారు. ఈనెల 12వ తేదీన నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగగా, ఆ నాలుగింటినీ టీఎంసీ గెలుచుకుని క్లీన్స్వీప్ చేసింది.పశ్చిమబెంగాల్లోని సిలిగురి, అసాన్ సోల్, బిధాన్నగర్, చందన్ నగర్ మున్సిపాలిటీల్లో లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. బిదాన్నగర్లోని 41 సీట్లలో 39 సీట్లను టీఎంసీ గెలుచుకుంది. విపక్ష బీజేపీ, సీపీఐ ఖాతా కూడా తెరవలేదు. కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకోగా, ఒక వార్డులో సీపీఎం అభ్యర్థి గెలిచారు. చందన్ నగర్లో టీఎంసీ 32 సీట్లకు 31 గెలుచుకుంది. సీపీఎం ఒక వార్డు గెలుచుకుంది. సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ)లో 47 స్థానాల్లో 37 స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది. బీజేపీ 5 సీట్లు గెలుచుకోగా, లెఫ్ట్ పార్టీ కేవలం నాలుగు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఒక సీటు దక్కించుకుంది. అసాన్సోల్లో 106 స్థానాలకు 66 స్థానాల్లో టీఎంసీ గెలుపొందగా, బీజేపీ 5 సీట్లు దక్కించుకుంది, సీపీఎం, కాంగ్రెస్ చెరో రెండు వార్డుల్లో గెలిచాయి.
*ఆ రెండు మాటలు మోదీ నోట రావేం?: రాహుల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఘాటు విమర్శలు సంధించారు. ప్రధాని తన ఎన్నికల ప్రసంగాల్లో నిరుద్యోగిత, నల్లధనం గురించి ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. పంజాబ్లోని హోషియార్పూర్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ, దేశంలో నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరిగిపోతోందని, దానిపై కానీ, నల్లధనం వంటి అంశాలపై కానీ మోదీ ఎక్కడా ప్రస్తావించడం లేదని అన్నారు. పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పైనా రాహుల్ విమర్శలు చేస్తూ, వీటి వల్ల కేవలం ఇద్దరు, ముగ్గురు బిలయనీర్లు మాత్రమే లబ్ధి పొందారని అన్నారు.
*Y కేటగిరి భద్రత కోరిన తేజ్ ప్రతాప్
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తాజాగా తనకు ‘వై’ కేటగిరి భద్రత కల్పించాలని పోలీసు శాఖను కోరారు. తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయంటూ డీజీపీకి సోమవారంనాడు ఆయన ఒక లేఖ రాశారు. తనకు భద్రత అసరమైనందున, వై కేటగిరి భద్రత వెంటనే కల్పించాలని ఆ లేఖలో డీజీపిని కోరారు. ఆదివారంనాడు కొందరు వ్యక్తులు తేజ్ ప్రతాప్ నివాసం ముందు గలభా సృష్టించారని, దీంతో ఆయన తనకు తగినంత భద్రత అవసరమని భావించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
*కాంగ్రెస్ నాశనానికి రాహుల్, ప్రియాంక చాలు : యోగి ఆదిత్యనాథ్
కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలునని, వేరొకరెవరూ అక్కర్లేదని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘బేకార్’ కాంగ్రెస్కు ఓటు వేయవద్దని ఉత్తరాఖండ్ ప్రజలను తాను కోరానని చెప్పారు. ఆయన సోమవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ వాద్రా పంజాబ్లో మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో తనకు విభేదాలున్నట్లు యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను రాహుల్ గాంధీ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానని, అదేవిధంగా ఆయన కూడా తన కోసం అదేవిధంగా త్యాగం చేస్తారని చెప్పారు. తమ మధ్య విభేదాలేవీ లేవన్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో సోమవారం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి అన్నాచెల్లెళ్ళు చాలునని, వేరొకరు ఎవరూ అక్కర్లేదని చెప్పారు. ‘బేకార్’ కాంగ్రెస్కు ఓటు వేయవద్దని, ఆ పార్టీకి వేసిన ఓట్లు వృథా అవుతాయని ఉత్తరాఖండ్ ప్రజలకు చెప్పానన్నారు.
*ఉపాధి హామీ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి: Lanka dinakar
రాష్ట్రంలో ఉపాధి హామీ ఉపాధి నిధుల దుర్వినియోగంపై బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు. ఉపాధా హామీ నిధుల దుర్వినియోగంలో దేశం మొత్తం మీద 4.21 లక్షల కేసులు నమోదు కాగా… ఒక్క ఆంధ్రప్రదేశ్లో 1.20 లక్షలు ఉండడం దౌర్భాగ్యమన్నారు. మొత్తం ఉపాధి హామీ నిధులలో 26.80% అంటే రూ.261 కోట్ల దుర్వినియోగం అయిన డబ్బు ఏవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. పార్లమెంటు స్థాయి సంఘం నివేదిక ప్రకారం, దేశ వ్యాప్తంగా చేసిన సామాజిక తనిఖీలో అత్యధిక నిధుల దుర్వినియోగం ఏపీలో అయ్యాయని బయటపడిందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉపాధి నిధుల దుర్వినియోగం అంచనాలు తీసుకుని 2021-22తో పోల్చితే 2022-23కి 25% తగ్గుదలకి కారణం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లీకేజీ ఎక్కువ ఉండడమే అని లంకా దినకర్ వ్యాఖ్యలు చేశారు.
*అమరీందర్ సర్కారును..మోదీ ప్రభుత్వం నడిపింది
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో వారం రోజులు మాత్రమే ఉన్న పంజాబ్లో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ అద్మీ (ఆప్) కీలక నాయకులు ఆదివారం రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొని ప్రత్యర్థులపై విమర్శలకు దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా లూధియానాలో, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫరీద్కోట్లో, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అమృత్సర్లో ర్యాలీల్లో ప్రసంగించారు. కాగా, గతేడాది అమరీందర్ సింగ్ను సీఎంగా తప్పించడంపై ప్రియాంక స్పం దించారు. ఈ పరిణామంపై పార్టీ గాంధీ కుటుం బం నుంచి ఒకరు మాట్లాడడం ఇదే తొలిసారి. అమరీందర్ సర్కారును కేంద్రంలోని మోదీ ప్రభు త్వం నడిపిస్తున్నట్లు తమకు తెలిసిందని అందుకే నాయకత్వాన్ని మార్చామని ప్రియాంక చెప్పారు. వారి రహస్య అవగాహన.. ఎన్నికల పొత్తు రూపంలో ఇప్పుడు బయటపడిందన్నారు. మరోవైపు ఆప్.. ఆర్ఎ్సఎస్ నుంచి పుట్టిందని విమర్శించారు. గుజరాత్ మోడల్ తెస్తామంటూ 2014లో బీజేపీ మోసం చేసిన వైనాన్ని మర్చిపోవద్దని ప్రజలను హెచ్చరించారు. సోదరుడు రాహుల్ గాంధీతో విభేదాలున్నట్లు యూపీ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలను ప్రియాంక తోసిపుచ్చారు. గొడవలన్నీ ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి మధ్యనే ఉన్నాయన్నారు.
*మీ పాలనలో రూ.5.35 లక్షల కోట్ల మోసాలు!
దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో రూ.5.35 లక్షల కోట్ల మేర బ్యాంకు మోసాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. గతంలో ఇలాంటి మోసాలు జరగలేదని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిత్రులకే అచ్చెదిన్ వచ్చాయని ధ్వజమెత్తారు. దేశ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు.బ్యాంకుల కన్సార్టియంను రూ.22,842 కోట్ల మేర మోసగించిన ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఐదేళ్లు ఎందుకు పట్టిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆదివారం ప్రశ్నించారు. బ్యాంకు మోసగాళ్ల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘దోచుకో, పారిపో’ అనే పథకాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా, జతిన్ మెహతా, చేతన్, నితిన్ సందేశర తదితరులు ఇండియాలో బ్యాంకులను దోచుకొని, విదేశాలకు పారిపోయారని గుర్తుచేశారు. ఈ జాబితాలో తాజాగా ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్ మాజీ చైర్మన్, ఎండీ రిషి కమలేష్ అగర్వాల్తోపాటు ఇతరులు కూడా చేరుతున్నారని చెప్పారు. వారంతా ‘కొత్త రత్నాలు’ అన్నారు.
*టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే
కాంగ్రెస్, టీఆర్ఎస్ చీకటి ఒప్పందం శనివారం బయట పడిందని, ఆ రెండు పార్టీలూ ఒకటే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ఆయన మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. టీఆర్ఎస్తో పొత్తుకు కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా ఉందని చెప్పారు. టీఆర్ఎస్తో పొత్తు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు ఇష్టం లేదని, అయితే ఇందుకోసం ఆంధ్రప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత మధ్యవర్తిత్వం వహిస్తున్నారని తెలిపారు.కేసీఆర్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ హైకమాండ్తో టచ్లో ఉన్నారని, అందుకే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత ఈ మధ్య టీఆర్ఎస్కు పార్లమెంటులో మద్దతు ఇచ్చారని చెప్పారు. తాజాగా కేసీఆర్ స్వయంగా కాంగ్రెస్ను పొగిడారని, చీకటి ఒప్పందాన్ని నిన్న బయట పెట్టారని పేర్కొన్నారు. గతంలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయని, ఈసారీ కలిసి పోటీ చేయనున్నాయని చెప్పారు. కాంగ్రెస్కు ఓటేస్తే టీఆర్ఎస్కు వేసినట్లేనని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని గుర్తుచేశారు. కేసీఆర్ పులి అని చెప్పుకుంటుంటే పులులు బాధపడుతున్నాయని ఎద్దేవా చేశారు.