అసోం తేయాకుకు ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి తేయాకు పంటల నుంచే అత్యంత అరుదైన టీ పొడి లభిస్తుంది. ఇలా ఓ వెరైటీ టీ పొడికి వేలంలో రికార్డు ధర పలికింది. ఆ విశేషాలు మీకోసం..
అసోంలోని గువాహటి టీ ఆక్షన్ సెంటర్లో ఓ టీ పొడికి రికార్డు ధర పలికింది. ‘గోల్డెన్ పెరల్’ అనే టీ రకాన్ని కేజీ రూ.99,999కు అసోం టీ ట్రేడర్స్ కొనుగోలు చేసింది. eదిబ్రూగఢ్ జిల్లాలోని నహోర్చోక్, నుద్వా, దికోమ్, ఎకోరాటోలి ప్రాంతాల్లో ఈ తేయాకును పండించారు. నహోర్చుక్బరి బాట్ లీఫ్ ఫ్యాక్టరీ ఈ తేయాకును వేలానికి తీసుకొచ్చింది. ఈ ఆకులను చిరు రైతుల నుంచి సేకరించినట్లు గువాహటి తేయాకు కొనుగోలు వ్యాపారుల సంఘం కార్యదర్శి దినేశ్ బిహానీ తెలిపారు. ‘ఈ ఆకర్షణీయమైన ధరల వల్ల తేయాకు పెంపకం దారులకు ప్రోత్సాహం లభిస్తుంది. వారికి మంచి ధరలు లభిస్తాయి. గతంలోనూ ఇక్కడ రికార్డు ధరలకు తేయాకు అమ్ముడైంది’ అని బిహానీ వెల్లడించారు. గత డిసెంబర్లో మనోహరి గోల్డ్ టీ సైతం కేజీ రూ.లక్ష పలికింది. అసోంలో టీ వ్యాపారం నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఇంత భారీ మొత్తానికి టీ పొడి అమ్ముడుపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.