NRI-NRT

కువైత్ కీలక నిర్ణయం.. భారతీయ ప్రవాసులకు భారీ ఉపశమనం

కువైత్ కీలక నిర్ణయం.. భారతీయ ప్రవాసులకు భారీ ఉపశమనం

కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో విదేశీయుల ఎంట్రీ విషయమై కువైత్ కేబినెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పూర్తైన వారితో పాటు అసలు టీకా తీసుకోని వారు కూడా కువైత్ రావొచ్చని ప్రకటించింది. దీనికోసం ప్రయాణికులను మూడు కేటగిరీలుగా విభజించింది. 1. వ్యాక్సినేషన్ పూర్తైన వారు, 2. వ్యాక్సినేషన్ పూర్తి కానివారు, 3. టీకా తీసుకోని వారు. వచ్చేవారం నుంచి విదేశీయుల ఎంట్రీకి కేబినెట్ అనుమతి ఇచ్చింది. కాగా, ఫిబ్రవరి 20 నుంచి విదేశీయులకు కువైత్‌లో ప్రవేశానికి అవకాశం ఉండొచ్చని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎం. తారిఖ్ అల్ ముజ్రం తెలిపారు.

1. వ్యాక్సినేషన్ పూర్తైన వారు:
కువైత్‌లో ఆమోదం పొందిన వ్యాక్సిన్లను రెండు డోసులు తీసుకోవడంతో పాటు బూస్టర్ డోసు కూడా వేసుకున్నవారు. అలాగే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని తొమ్మిది నెలలు పూర్తైన వారు. వీరితో పాటు మూడు నెలల ముందు కరోనా నుంచి కోలుకున్నారు కూడా వ్యాక్సినేషన్ పూర్తైన వారిగా గుర్తించడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ కేటగిరీకి చెందిన వారికి ఎంట్రీ సమయంలో పీసీఆర్ టెస్టు అవసరం లేదు. అలాగే హోం క్వారంటైన్ కూడా అక్కర్లేదు.

2. వ్యాక్సినేషన్ పూర్తి కానివారు:
రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యి తొమ్మిది నెలలు గడుస్తున్న బూస్టర్ డోసు తీసుకోని వారిని వ్యాక్సినేషన్ పూర్తి కానివారిగా పరిగణించడం జరుగుతుంది. ఎంట్రీ సమయంలో వీరికి పీసీఆర్ టెస్టు అవసరం లేదు. అయితే, ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. పీసీఆర్ టెస్టు రిపోర్టుతో త్వరగా క్వారంటైన్ ముగించే అవకాశం ఉంది.

3. టీకా తీసుకోని వారు:
కువైత్‌ ఆమోదించిన వ్యాక్సిన్లను తీసుకోని వారితో పాటు సింగిల్ డోసు టీకా తీసుకున్న వారిని అసలు వ్యాక్సినేషన్ పూర్తి కానివారిగా గుర్తించడం జరిగింది. ఈ కేటగిరీకి చెందిన వారు కువైత్‌లో ప్రవేశించాలంటే మాత్రం ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. అలాగే 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఏడో రోజున పీసీఆర్ టెస్టు అనంతరం క్వారంటైన్‌ను ముగించవచ్చు.

ఇక కువైత్ తీసుకున్న తాజా నిర్ణయంతో చాలా కాలంగా స్వదేశంలో చిక్కుకుపోయిన భారతీయులకు భారీ ఉపశమనం లభించింది. చాలా మంది భారత ప్రవాసులు కోవాగ్జిన్ తీసుకున్నారు. వీరికి కువైత్‌లో ప్రవేశానికి అనుమతి లేదు. ఎందుకంటే ఆ దేశం ఆమోదించిన కరోనా టీకాల జాబితాలో కోవాగ్జిన్ లేదు. ఇప్పుడు కువైత్ కేబినేట్ తీసుకున్న నిర్ణయంతో మనోళ్లకు బిగ్ రిలీఫ్ దొరికినట్లైంది.