సోషల్‌మీడియా వేదికల్లో అగ్ర కథానాయిక సమంత వెలిబుచ్చే అభిప్రాయాల్లో చక్కటి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఆశావాహదృక్పథాన్ని వీడొద్దనే భరోసా ఉంటుంది. ఓ వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా ఆమె పోస్టింగ్స్ లో పాజిటివిటీ గోచరిస్తుంది. సాధారణ మధ్య తరగతి అమ్మాయి నుంచి అగ్ర కథానాయికగా ఎదిగి వచ్చిన వైనమే తనలో ఆత్మవిశ్వాసానికి కారణమని చెప్పింది సమంత. ఆమె మాట్లాడుతూ ‘చిత్రసీమలో పుష్కర ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నా. వృత్తిపరమైన ప్రతిభకు మెరుగులు దిద్దుకోవడంతో పాటు వ్యక్తిగతంగా చక్కటి పరిణితి సాధించా. నేను కలలు కన్న జీవితాన్ని ఆస్వాదిస్తున్నందుకు ఆనందంగా ఉంది. విడాకుల తాలూకు సంక్షోభం, మానసిక వ్యథ నుంచి కూడా త్వరలోనే కోలుకున్నా. ఈ ప్రయాణంలో నేను ఎంత బలవంతురాలిననే విషయం అవగతమైంది. లక్ష్యం పట్ల స్పష్టత ఉంటే ప్రపంచంలో ఏ శక్తి మనల్ని అడ్డుకోలేదు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నాయి.