Politics

కేసీఆర్ కు… పెట్టుబడి దారులు వీరే!

కేసీఆర్  కు…  పెట్టుబడి దారులు వీరే!

తెలంగాణ రాష్ట్ర సమితికి 2020-21లో హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌ మెట్రో ఇన్‌ఫ్రాటెక్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సాహితీ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థలు అత్యధిక మొత్తంలో చందాలు ఇచ్చాయి. పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విషయాన్ని తెలియజేసింది. జూబ్లీహిల్స్‌ లోని అపురూప టర్బో చిరునామాతో ఉన్న గ్రీన్‌ మెట్రో ఇన్‌ఫ్రాటెక్‌ రూ.కోటి చొప్పున రెండుసార్లు విరాళం ఇచ్చింది. ఇదే చిరునామాలో ఉన్న బొడ్డు నాగ వెంకట ఆదిత్య రూ.36 లక్షలు, అశోక్‌ రూ.34 లక్షలు, బొడ్డు బేబిరాణి రూ.15 లక్షలు అందించారు. ఈ విరాళాలన్నీ 2020 నవంబరు 27న వచ్చినట్లు తెరాస ఎన్నికల సంఘానికి తెలిపింది. జూబ్లీహిల్స్‌లోనిసాహితీ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఒకసారి రూ.1 కోటి ఆర్‌టీజీఎస్‌ ద్వారా, 7 సార్లు రూ.2 లక్షలు, ఒకసారి రూ.లక్ష ఐఎంపీఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసింది. రూ.కోటి విరాళం 2020 నవంబరు 27న, మిగిలిన రూ.15 లక్షలు అదే నెల 28న ఇచ్చినట్లు తెలిపింది. 2020-21లో తెరాసకు రూ.20 వేలకుపైగా విరాళాలు 22 లావాదేవీల ద్వారా రాగా, అందులో రూ.4 కోట్లు నవంబరు 27, 28 తేదీల్లో పైన పేర్కొన్న రెండు చిరునామాల నుంచి వచ్చాయి. మిగిలిన రూ.15,02,379 విరాళాల చందాదారుల పేర్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల్లో లేవు. 2020-21లో రూ.37.65 కోట్ల ఆదాయం వచ్చింది. ఫీజులు, చందాల రూపంలో రూ.17.26 కోట్లు; స్వచ్ఛంద విరాళాల ద్వారా రూ.4.18 కోట్లు; ఇతర మార్గాల నుంచి రూ.16.21 కోట్ల ఆదాయం వచ్చింది.