Politics

ఆళ్లగడ్డలో ప్రత్యర్ధులకు సవాల్ విసురుతున్న అఖిల ప్రియ

ఆళ్లగడ్డలో ప్రత్యర్ధులకు సవాళ్ళు విసురుతున్న అఖిల ప్రియ

ఆళ్లగడ్డ.. ఈ పేరు చెప్పగానే భూమా, గంగుల ఫ్యామిలీలు గుర్తొస్తాయి. 1967 నుంచి ఆళ్లగడ్డలో గంగుల, భూమా, సోముల (ఎస్వీ సుబ్బారెడ్డి) కుటుంబాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇక్కడ మొదట్లో గంగుల ప్రభాకర్ రెడ్డి తండ్రి తిమ్మారెడ్డి, భూమా నాగిరెడ్డి తండ్రి బాలిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడిచేది. బాలి రెడ్డి హత్య తర్వాత ఆయన కుమారులు శేఖర్, నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు.

గంగుల తిమ్మారెడ్డి చనిపోయాక ఆయన కుమారులు ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి ఆయన వారసత్వాన్ని అందుకున్నారు. తరాలు మారిన ఇరు కుటుంబాల మధ్య వైరం మాత్రం తగ్గలేదు. తాజాగా ఈ రెండు కుటుంబాల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల నేతలు పరస్పరం రాజీనామా సవాళ్లు విసురుకున్నారు. ఆ వివాదం ఏంటి.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు..

రోడ్డు విస్తరణ కార్యక్రమాలు ఆళ్లగడ్డలో మరోసారి రాజకీయ విబేధాలను రాజేశాయి. రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా అధికారులు.. ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కూడలి వద్ద బస్ షెల్టర్‌ను తొలగించడం వివాదానికి కారణమైంది. తన తండ్రి భూమా నాగిరెడ్డి ప్రజల కోసం కట్టించిన బస్ షెల్టర్‌ను ఎలా తొలగిస్తారంటూ భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగి కూల్చివేతను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో దీనిపై భూమా అఖిలప్రియ స్పందించారు. ఆళ్ళగడ్డలో రోడ్ల విస్తరణ పేరుతో అధికార పార్టీ నేతలు ప్రజలను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి రోడ్డు విస్తరణ పనుల్లో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు నిరూపించకపోతే రాజకీయలకు రాజీనామా చేసే ధైర్యం తనకు ఉందన్నారు అఖిలప్రియ. నిజం నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేసే దమ్ము ఉందా అంటూ భూమా అఖిల.. ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డికి సవాల్ విసిరారు.

మరోవైపు భూమా అఖిలప్రియ సవాల్‌పై ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి స్పందించారు. అవినీతి జరిగిందని ఆరోపణలను అఖిలప్రియ నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని కౌంటర్ ఇచ్చారు. అలా చేయలేని పక్షంలో అఖిల ప్రియ రాజీనామా చేయాలని ప్రతి సవాల్‌ విసిరారు. ఈ సవాళ్లపై ప్రస్తుతం ఆళ్లగడ్డలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఈ వ్యహారంలో భూమా అఖిలప్రియ బ్రిజేంద్రరెడ్డి మీద మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు. పార్టీపై, ముఖ్యమంత్రిపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. ఈ క్రమంలో అఖిలప్రియ వైసీపీకి దగ్గరయ్యేందుకే ఇలాంటి సవాళ్లు విసురుతున్నారని.. బ్రిజేంద్రరెడ్డికి చెక్‌ పెట్టి వైసీపీలోకి వెళ్లొచ్చని భావిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఈ ఎపిసోడ్‌ కు ఎలాంటి ముగింపు లభించనుందో చూడాలి అని కామెంట్‌ చేస్తున్నారు స్థానిక ప్రజలు.