Devotional

మేడారం జాతరలో ఆ నాలుగు ఊళ్ళదే హవా!

మేడారం జాతరలో ఆ నాలుగు ఊళ్ళదే హవా!

ఆ నాలుగు గ్రామాల అవినాభావ సంబంధమేంటి .. అటవీ ప్రాంతంలో పదులు , వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామాల నుంచి సమ్మక్క , సారలమ్మ , పగిడిద్దరాజు , గోవిందరాజు మేడారానికి చేరుకోవడమేమిటి ? వాగుకు జంపన్న అని పేరు పెట్టడమేమిటీ .. మేడారంలోనే జాతర పూజలు నిర్వహించడానికి కారణాలేమిటి .. ఈ ప్రశ్నలన్నింటి వెనుక ఎన్నో ఆసక్తికర పరిణామాలున్నాయి .
*చిలుకలగుట్ట
తాడ్వాయి మండలం మేడారంలోని కరవుకాటకాలతో నాడు కప్పం కట్టలేని పరిస్థితిలో ఉన్న గిరిజన పల్లెలపై కాకతీయ రాజులు దాడికి దిగిన ఘటనలో సమ్మక్క సారక్క , గోవిందరాజు , పగిడిద్దరాజు , జంపన్న వీరమరణం పొందారు. తొలుత వీరంతా అటవీ ప్రాంతంలో శిబిరం ఏర్పాటు చేసుకొని రాజులపై పోరు సాగించారు . ఈక్రమంలో చెల్లాచెదురైన వీరు తలా ఓ దిక్కుకు వెళ్లి వీరమరణం పొందారు అలా వీరు వీరమరణం పొందిన గ్రామాలే ఆ నాలుగు . ఆ గ్రామాల్లోనే వీరికి గుడులు కట్టించారు . వీరంతా యుద్ధ సమయంలో బసచేసిన ప్రాంతం మేడారం కావడంతో అందరినీ ఇక్కడ గద్దెలపైకి చేర్చి వారిని కొలుస్తారు. ఇదే మేడారం మహాజాతర ఇంతకీ ఆ గ్రామాలేమిటో తెలుసుకుందామా .. నాలుగూళ్లు కలిసి జాతరై మెరిసి సారలమ్మ మందిరం సమ్మక్క అదృశ్యమైనట్లు ప్రతీతి. అక్కడే ఆమెకు గుడి కట్టించారు . ఇక్కడి నుంచి రెండో రోజున సమ్మక్కను పూజారులు మేడారం తీసుకొచ్చి . గద్దెపై ప్రతిష్ఠిస్తారు . ముందుగా వీరమరణం పొందారన్న భావనతో సారలమ్మ , గోవిందరాజు , పగిడిద్దరాజును మొదట గద్దెపై చేరుస్తారు. తరువాత వీరమరణం పొందిన సమ్మక్కను రెండో రోజున గద్దెపైకి తీసుకొస్తారు .
* కన్నెపల్లి
తాడ్వాయి మండలం కన్నెపల్లి గ్రామంలో సారలమ్మ వీరమరణం పొందారని భక్తుల నమ్మకం . అందుకే ఇక్కడ గిరిజనులు ఆమెకు గుడి కట్టించి కొలుస్తున్నారు . జాతర ప్రారంభం రోజున ఈ ఆలయం నుంచి అమ్మవారిని తీసుకుని కాలినడకన బయలుదేరే పూజారులు మేడారం తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు . జాతర ప్రారంభం రోజున భక్తుల అందరి చూపు కన్నెపల్లిపైనే ఉంటుంది .
*కొండాయి
ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలోని గోవిందరాజు తనువు చాలించారని విశ్వసిస్తుంటారు .. ఇక్కడ ఆయనకు కట్టించిన ఆలయం నుంచి మేడారానికి కాలినడకన పూజారులు తరలిస్తారు . సుమారు 18 కిలోమీటర్ల దూరంలోని అటవీ మార్గం నుంచి మేడారానికి వెళ్లారు. సారలమ్మ , పగిడిద్దరాజు మేడారంలోని గద్దెలపైకి సమయానికి గోవిందరాజును చేర్చుతారు.
* పూనుగొండ్ల
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు వీరమరణం పొందడంతో ఇక్కడే ఆయనకు దేవాలయం కట్టించారు . ఇక్కడి నుంచి పగిడిద్దరాజును తీసుకుని . మేడారానికి కాలినడకన బయలు దేరుతారు పూనుగొండ మేడారానికి 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది . అదే అటవీ మార్గంలో 66 కిలోమీటర్ల దూరం ఉండడంతో పూర్వం నుంచి పూజారులు ఈ మార్గంలో జాతర ప్రారంభానికి ఒక రోజు ముందు బయలుదేరుతారు. జంపన్న మేడారం సంపెంగ వాగులో ఆత్మబలిదానం చేసుకున్నందున దానికి జంపన్న వాగుగా పేరు నామకరణం చేశారు అలా ఈ వాగులో స్నానాలు ఆచరించిన అనంతరం వనదేవతల పూజలకు బయలుదేరుతారు .

01

2.సమ్మక్క చరిత్ర తెలియాలంటే.. దీన్ని డీకోడ్‌ చేయాల్సిందే
సమ్మక్క, సారలమ్మ జాతర గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. సమ్మక్క కారణజన్మురాలని.. పుట్టుకతోనే మహిమలు చూపేదని కోయపురాణం చెబుతుంది. కాకతీయులతో పోరాడి సమ్మక్క వీరమరణం పొందింది అని చరిత్రకారుల అభిప్రాయం. సమ్మక్క దైవాంశ సంభూతురాలని భక్తుల విశ్వాసం. ఇంతకీ సమ్మక్క చరిత్రకు సంబంధించిన వివరాలు ఎక్కవడున్నాయి?జాతర సందర్భంగా గోవిందరాజులు, పగిడిద్దరాజులను మేడారం తీసుకువచ్చే పూజారులు ప్రత్యేకంగా తయారు చేసిన జెండాలను మోసుకుంటూ వస్తారు. గోవిందరాజులు, పగిడిద్దరాజులకు వేర్వేరుగా ఈ జెండాలు ఉన్నాయి. ఇలాంటి జెండాలే సమ్మక్క, సారలమ్మలకు ఉన్నాయి. ఆ జెండాలు వందల ఏళ్ల నాటి విషయాలను తమలో దాచుకున్నాయి.సమ్మక్క చరిత్ర పూర్తిగా లిఖితంగా ఎక్కడా లభించలేదు . అయితే సమ్మక్కతో పాటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల చరిత్ర మరో రూపంలో నిక్షిప్తమై ఉంది. ఈ చరిత్రను పటం రూపంలో నిక్షిప్తమయ్యిందని ఆదివాసీలు చెబుతుంటారు. అనాదిగా కోయలు, ఆదివాసీలకు వేర్వేరు భాషలు ఉన్నాయి. అయితే చాలా కోయ భాషలకు లిపి లేదు. దీంతో పురాతన పద్దతి అనుసరించి బొమ్మల రూపంలో చరిత్రను నిక్షిప్తం చేశారు.బొమ్మల రూపంలో చరిత్రను.. ఆనాటి పరిస్థితులను నిక్షిప్తం చేయడం ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పద్దతి. ప్రాచీన ఈజిప్టులు ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. ఈజిప్టు చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు ఈ బొమ్మల లిపిలోనే మనకు లభ్యమయ్యాయి. వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బెట్కా దగ్గర ఈ తరహా బొమ్మల లిపి రూపంలో చరిత్ర అందుబాటులో ఉంది. ఇంచుమించు ఇదే పద్దతిలో ఆదివాసీ దేవతల చరిత్ర లిఖించబడింది.ఎర‍్రగా త్రిభుజాకారంలో తయారు చేసిన ఈ జెండాలనే వనదేవతల చరిత్ర ఉంది. సమక్క, సారలమ్మల పూర్వీకులు, ప్రకృతితో వారికి ఉన్న సంబంధం అంతా ఇక్కడ బొమ్మల రూపంలో వివరించి ఉంటుంది. ఒక్కో ఆదివాసీ దేవతకు ఒక్కో రూపంలో ఈ జెండాలు ఉన్నాయి. ఈ జెండాలో ఉన్న బొమ్మల ఆధారంగా డోలీలు సమ్మక్క కథను మౌఖికంగా చెబుతారు.సమక్క, సారలమ్మలతో పాటు ఇతర ఆదివాసీ దేవతలకు సంబంధించి జెండాల గురించి చాలినంత పరిశోధన జరగలేదు. వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ జెండాలోని బొమ్మల లిపిపై చరిత్రకారులు పరిశోధనలు చేయాల్సి ఉంది. ఈ జెండాలోని అంశాలు, వాటి ఆధారంగా చెబుతున్న మౌఖిక కథలను డీకోడ్‌ చేస్తే ఆదివాసీ దేవతలకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి

02

3.మేడారానికి హెలికాప్టర్‌ సర్వీసులు.. ప్రధాన నగరాల నుంచి ధరలివే!
తెలంగాణ కుంభమేళా.. వనదేవతల జాతర భక్తజనంతో పోటెత్తుతోంది. ఈ నెల 16న ప్రారంభమైన జాతర 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తుంటారు. అయితే మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ ప్రధాన నగరాల నుంచి హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హనుమకొండ నుంచి హెలికాప్టర్‌ సౌకర్యం కల్పించారు. కాజీపేటలోని సేయింట్‌ గాబ్రియల్‌ స్కూల్‌ గ్రౌండ్‌ నుంచి మేడారం వరకు సేవలందిస్తోంది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్‌ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది.
*చార్జీలు ఇలా..
హన్మకొండ నుంచి మేడారం షటిల్‌ సర్వీస్‌ ఒక్కో ప్రయాణికుడికి (అప్‌ అండ్‌ డౌన్‌) రూ.19,999
జాతరలో 7,8 నిమిషాల ఏరియల్‌ వ్యూ రైడ్‌ ఒక్కొక్కరికి రూ.3,700
*బుకింగ్‌ ఇలా..
హెలికాప్టర్‌ టికెట్‌ బుకింగ్, ఇతర వివరాల కోసం
94003 99999, 98805 05905 సెల్‌నంబర్లలో లేదా info@helitaxi.com ద్వారా చేసుకోవచ్చు.
*హైదరాబాద్‌ నుంచి
మేడారం జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం బేగంపేట ఎయిర్‌పోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించారు. జాయ్‌ రైడ్‌, షటిల్‌ సర్వీస్‌, చార్టర్‌ సర్వీస్‌ అనే మూడు రకాల సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సేవలు బుధవారం నుంచి ఆదివారం వరకు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు. హెలికాప్టర్‌ చార్టర్‌ సర్వీస్‌ అయితే కరీంనగర్‌ నుంచి మేడారానికి రూ. 75,000గా నిర్ణయించారు. హైదరాబాద్‌ నుంచి మేడారానికి రూ. 75,000, మహబూబ్‌నగర్‌ నుంచి మేడారానికి రూ. 1,00,000 టికెట్‌ ధరను నిర్ణయించారు. ఇందులో 5 సీట్లు ఉంటాయి. వీఐపీ దర్శనం కల్పిస్తారు.
*విశేష స్పందన
డారంలో హెలీకాప్టర్‌ రైడ్‌కు విశేష స్పందన లభిస్తోంది. హెలికాప్టర్ ఎక్కి సమ్మక్క సారలమ్మ వార్ల గద్దెలు జంపన్న వాగు గుట్టలు పై నుంచి మేడారం అందాలు చూసేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.. 2014 నుంచి వరంగల్ మామునూరు బేగంపేట విమానాశ్రయాల నుంచి మేడారానికి భక్తులను తీసుకెళ్లే హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం మేడారంలో భక్తులను ఎక్కించుకొని తిప్పి చూపించే స్థాయికి హేలీ సర్వీసులు చేరుకున్నాయి.

03

4. సమ్మక్కను తీసుకొచ్చేది తనే.. కోటికొక్కడు
మేడారం జాతరలో ప్రధాన ఘట్టం చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడం. ఈ ఘట్టంలో అత్యంత ఉద్విగ్న భరిత క్షణాలు చిలకలగుట్ట కిందికి సమ్మక్క దిగిరావడం ఆ సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఎదురేగి వెళ్లి తుపాకులతో గాలిలోకి కాల్పులు జరపడం. ఈ క్షణాల్లో అందరి కళ్లు భరణి రూపంలో ఉన్న సమ్మక్కపైనే ఆ తర్వాతి స్థానం ఆ భరణి తీసుకువచ్చే ప్రధాన వడ్డే కొక్కెర కృష్ణయ్యపైనే ఉంటాయి. వేలది మంది ప్రత్యక్షంగా లక్షలాది మంది ప్రసార మాధ్యమాల్లో కోట్లాది మంది పరోక్షంగా ఉత్కంఠను అనుభవిస్తారు. అంతటి ఉత్కంఠ, ఉద్విగ్నభరిత క్షణాలను తన భూజాలపై మోసే కొక్కర కృష్ణయ్య మనోగతం పాఠకులకు ప్రత్యేకం.
*ఆరోసారి
2022 ఫిబ్రవరి 17వ తేదిన చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను కొక్కెర కృష్ణయ్య తీసుకురానున్నారు. అంతకు ముందు ఆయన మొదటిసారిగా 2012 జాతరలో ఈ అదృష్టాన్ని దక్కించుకున్నారు. అంతకు ముందు జాతరలో కొక్కెర కృష్ణయ్యకు∙బాబాయ్‌ అయిన కొక్కెర వెంకన్న ఈ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత ఆయన కొడుకు సాంబశివరావు చేశారు. వారిద్దరి తర్వాత కృష్ణయ్యకు ఈ భాగ్యం దక్కింది. కొక్కెర కృష్ణయ్య మేడారంలోనే నివాసం ఉంటారు. సాధరణ సమయంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. భార్య వినోద, ఎనిమిదో తరగతి చదివే కొడుకు, డిగ్రీ, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
*ఆ వారం రోజులు నిష్టతో ఉంటాను
గుడిమెలిగె పండుగతో సమ్మక్క–సారలమ్మ జాతరకు తొలి అడుగు పడుతుంది. అయితే జాతర మొదలయ్యేది మండెమెలిగే పండుగతోనే. మండెమెలిగే పండుగ నాడు మేడారంలో ఉన్న సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ రోజు నుంచి చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లిని గద్దెలపైకి చేర్చే వరకు నియమనిష్టలతో ఉంటాం. పగటి వేళ కేవలం పాలు, అరటిపళ్లు ఆహారంగా తీసుకుంటారు. రాత్రి పొద్దుపోయాక పూజ చేసిన అనంతరం అన్నం తింటారు.
*ఆ రోజున
దేవాదాయశాఖ ఇచ్చిన కొత్త బట్టలు ధరిస్తాం మేడారం సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ తర్వాత రహాస్యం అయిన పూజా సామగ్రిని తీసుకుని నాతో పాటు వడ్డెల బృందం చిలకలగుట్టకు బయల్దేరుతుంది. సమ్మక్క వడ్డేలైన దోబేపగడయ్య దూపం వేస్తుండగా మల్యాల ముత్తయ్య జలకంపట్టి వేస్తూ ముందుకు కదులుతాం. జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). భజంత్రీలు మాదిరి పుల్లయ్య, మాదిరి నారయణలు మమ్మల్ని అనుసరిస్తారు. అయితే చిలకలగుట్ట సగం వరకే వీరికి ప్రవేశం. ఆ తర్వాత సమ్మక్క తల్లి కొలువై ఉండే రహాస్య ప్రదేశానికి నేనొక్కడినే వెళ్తాను. అక్కడ పూజాలు నిర్వహించిన తర్వాత సమ్మక్క తల్లి భరిణి రూపంలో కిందకు తీసుకువస్తాను. నేను రావడం కనిపించగానే జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). భజంత్రీలు మాదిరి పుల్లయ్యలు తమ వాయిద్యాలతో శబ్ధం చేస్తారు. అలా గుట్టమధ్య నుంచి సమ్మక్క తల్లి చిలకలగుట్ట పాదల వద్దకు చేరుకోగానే చేరుకోగానే ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్, ఎస్పీలు గాల్లోకి కాల్పులు జరిగి ఆ తల్లికి ఘనస్వాగతం పలుకుతారు.
*మేము మద్యం సేవించం – కొక్కెర కృష్ణయ్య
సమ్మక్క, సారలమ్మ పూజారులు తాగుతారనే అపోహా అందరిలో ఉంది. తాగితేనే దేవత పూనుతుందని అనుకుంటారు. తాగడం అనేది పూజా విధానంలో ఓ భాగంగా అంతా భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. తాగడం అనేది వడ్డెల వ్యక్తిగత విషయం. జాతర సంబరాల్లో భాగంగా మద్యం తీసుకునే అలవాటు ఉన్న వడ్డేలు తాగువారు. మద్యం సేవించడం పూజా విధానంలో భాగం కాదు. నా వరకు నేను మండెమెలిగె పండగ నాటి నుంచే నిష్టతో ఒక్క పొద్దు ఉంటాను. గద్దెలకు చేర్చేవరకు మద్యం సేవించను. నాతో పాటు ఉండే వడ్డేలు వారి వ్యక్తిగత అలవాట్లను బట్టి మద్యం తీసుకుంటారు. అలా మద్యం సేవించడం తప్పు కాదు. అదేవిధంగా సేవించడం తప్పనిసరి కాదు. గతంలో సాయంత్రం 4 గంటలకు కల్లా గద్దెల మీదికి సమ్మక్క తల్లిని తీసుకువచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు జాతరకు జనం పెరగడం వల్ల సాయంత్రం 5 అవుతోంది. అయితే ఏడుగంటలల్లోపు ఎప్పుడు వచ్చినా మంచిదే.
*అందరిలానే నేను
ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని, తమ కష్టాలు తొలగిపోవాలని ఆ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పనిని తల్లి చేసిపెడుతుంది. అందుకే ఏ ఏడుకి ఆ ఏడు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆ తల్లిని స్వయంగా తీసుకువచ్చే నాకు మరింత మేలు జరుగుతుంది అని అనుకుంటారు. అందరిలానే నేను. తీసుకురావడం అనేది బాధ్యత అంతే. అందరికీ మేలు చేసే తల్లి నా కుటుంబానికి మేలు చేస్తుంది.
04