భారత్ లో మూడు టి20లు, రెండు టెస్టులు ఆడేందుకు శ్రీలంక జట్టు వస్తోంది. ఈ పర్యటనలో మార్పు చేసినట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నేడు వెల్లడించింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్ ను ప్రకటించింది. శ్రీలంక జట్టు భారత్ లో తొలుత 3 మ్యాచ్ ల టి20 సిరీస్ లో పాల్గొంటుందని, ఆ తర్వాత ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ జరుగుతుందని వివరించింది. ఈ క్రమంలో లక్నో తొలి టి20 మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తుందని, మిగిలిన రెండు టి20 మ్యాచ్ లు ధర్మశాలలో జరుగుతాయని బోర్డు పేర్కొంది. ఇక ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మొహాలీలో మార్చి 4 నుంచి 8వరకు జరుగుతుందని, రెండో టెస్టు మార్చి 12 నుంచి 16 వరకు బెంగళూరు వేదికగా జరుగుతుందని వివరించింది.