Politics

ఆ మంత్రికి అందిన ముడుపులు ఎంత? -TNI నేటి రాజకీయ వార్తలు 17/02/2022

ఆ మంత్రికి అందిన ముడుపులు ఎంత? -TNI నేటి రాజకీయ వార్తలు 17/02/2022

*ఆ మంత్రికి అందిన ముడుపులు ఎంత?: చింతా మోహన్
వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణపట్నంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలన ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ కేంద్రం అమ్మకంలో విద్యుత్ శాఖ మంత్రికి అందిన ముడుపులు ఎంత అని ఆయన నిలదీశారు. ఏపీలో జిల్లా కలెక్టర్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. బకాయిలు పెరిగి కలెక్టర్ల కార్లకు పెట్రోల్ కూడా కొట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ.. దళిత వ్యతిరేక ప్రభుత్వమని ఆయన అన్నారు. ప్రభుత్వం దళితుల స్కాలర్‌షిప్‌లను పక్కదారి పట్టించిందని ఆయన ఆరోపించారు.

*కేసీఆర్ బర్త్ డే: రేవంత్ రెడ్డి వెరైటీ ట్వీట్ వైరల్
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సిఎం కెసిఆర్‌ కు తనదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు కెసిఆర్‌ జన్మదినం సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా రేవంత్‌ రెడ్డి ఊసరవెల్లి ఫోటో షేర్‌ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.దీనిపై నెటిజన్లు సైతం పెద్ద మొత్తంలో స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. కాగా పుట్టినరోజు జరుపునేందుకు అరెస్టులను చేస్తున్నారంటూ రేవంత్‌ మరో ట్వీట్‌లో మండిపడ్డారు ‘కెసిఆర్‌ తన నీడకు కూడా భయపడుతున్నారు. సిఎం పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వీలుగా వరుసగా రెండో రోజు పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. ఒకపక్క నిరుద్యోగ యువత ప్రాణాలు విడుస్తుంటే ఇది సంబరాలు చేసుకునే సమయమా?!” అంటూ ట్విట్టర్‌ లో పేర్కొన్నారు.

* సోము వీర్రాజు కాదు.. పిచ్చి వీర్రాజు: శిల్పా చక్రపాణిరెడ్డి
బీజేపీ నేత సోము వీర్రాజుపై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోము వీర్రాజు కాదు.. పిచ్చి వీర్రాజు అని ధ్వజమెత్తారు. మతిభ్రమించి సోము వీర్రాజు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి ఓ రౌడీ అని, పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానందిలో అర్చకులపై బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి దుర్భాషలాడాడని, ఇదేనా బీజేపీ సంస్కృతి అని ప్రశ్నించారు. శ్రీశైలంలో జరిగిన అన్ని అవకతవకలపై చేతనైతే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నసమయంలో ముస్లింలు దుకాణాలు నిర్వహించుకున్నారని గుర్తుచేశారు. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని శిల్పా చక్రపాణిరెడ్డి నిలదీశారు.

*మొదటిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ములాయం
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ ములాయం సింగ్ యాదవ్ మొట్టమొదటి సారి ఎన్నికల మైదానంలోకి అడుగు పెట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున అఖిలేష్ యాదవ్ అన్నీ తానై ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీలతో పొత్తులు, సీట్ల పంపకాలు, ప్రచారానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు అఖిలేషే నిర్వర్తిస్తున్నారు. అయితే ములాయం సింగ్ ప్రచారానికి వస్తున్నారా అని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటికే రెండు దశల ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో ఇక ఆయన రారని, మొత్తంగా అఖిలేషే ఉంటారని అనుకున్నారు. ఇంతలోనే ట్విస్ట్ ఇస్తూ గురువారం ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్‌లో జరిగిన ప్రచార సభకు ములాయం హాజరయ్యారు.

*ఏపీలో సర్పంచుల వ్యవస్థ నిర్వీర్యం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజ్యాంగ సవరణలకు తూట్లు పొడిచి జీవో నం. 2ను తీసుకొచ్చి సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ఎన్టీఆర్ భవన్లో టీడీపీ సర్పంచులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సర్పంచుల వ్యవస్థను తొలగించేందుకు వాలంటీర్లను అందలం ఎక్కించిందని, సర్పంచులకు అధికారం లేకుండా చేసిందని విమర్శించారు . హక్కుల కోసం సర్పంచులు చేసే పోరాటానికి మద్దతు ఉంటుందని వివరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీల అభివృద్ధికి విశేషంగా కృషి చేశామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సంఘం, ఉపాధి హామీ నిధులను చట్టవిరుద్ధంగా దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. ఏపీలో ఉగ్రవాదులను మించిన పాలన వైసీపీ చేస్తుందని అన్నారు

* షర్మిల పార్టీ పెట్టకూడదా?: హోం మంత్రి సుచరిత
హోం మంత్రి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళగా వైఎస్ షర్మిల పార్టీ పెట్టకూడదా అని ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ పెడితే రాష్ట్రానికి రాకుండా తరిమేశామంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళ సొంతంగా పార్టీ పెట్టుకుంటే తప్పుగా ఎందుకు కనపడుతుందని ఆమె నిలదీశారు. టీడీపీ పాలనలో మహిళా సాధికారత సాధించినట్లైతే ఎందుకు 23 స్థానాలకే పరిమితమయ్యారని ఆమె ప్రశ్నించారు.

* కాంగ్రెస్‌లో కుటుంబతత్వం లేదు: సీనియర్ నేత ఖర్గే
కుటుంబ పార్టీయని కాంగ్రెస్‌పై విమర్శలు ఈరోజు కొత్త కాదు. విపక్షాలు వీలైనన్ని ఎక్కువసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని చూస్తుంటాయి. తాజాగా ఎన్నికలు జరగుతుండడంతో బీజేపీ సహా అనేక పార్టీలు కాంగ్రెస్‌ను కుటుంబతత్వ పార్టీయని విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే అదంతా గతమని, ఇప్పుడు కాంగ్రెస్‌లో వారసత్వ రాజకీయాలు ఏమీ నడవడం లేదని, రాజ్యసభ కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు.

* కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గాలి నింపుతున్నారు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ గాలి నింపుతున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ పణంగా పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణను ఏపీలో కలుపుతోందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుకోవచ్చని చెప్పి కేసీఆర్ తెలంగాణ రైతులను ముంచుతున్నారని ఆయన ఆరో్పించారు. తెలంగాణపై కేసీఆర్ తీరు అనేక అనుమానాలకు దారి తీస్తుందన్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారన్నారు.

* తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవి?: రేవంత్‌రెడ్డి
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవి? అని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్షా 90 వేల ఖాళీలున్నా భర్తీ చేయడం లేదని తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర సంపదను సీఎం కేసీఆర్ కొల్లగొట్టారని దుయ్యబట్టారు. ఓయూ విద్యార్థులు నిరుద్యోగ దినోత్సవం చేస్తే.. టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని తెలిపారు. డీజీపీ ఫోన్ ఎత్తడం లేదని, ఇంత బలుపు ఎందుకు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

* నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష
నెల్లూరుజిల్లాలోనే రాపూరు, కలువాయిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుడూ పునర్విభజన వల్ల జరిగే నష్టాన్ని తెలిపేందుకే దీక్ష చేస్తున్నానన్నారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపడం వల్ల తీవ్రనష్టం జరుగుతుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో స్వార్థరాజకీయం కోసం.. కాంగ్రెస్‌లోని ఓ పెద్దమనిషి రాపూరు, కలువాయి వాసులకు ద్రోహం చేశారని విమర్శించారు. సోమశిల, కండలేరు జలాల కేటాయింపులే ఇంత వరకు జరగలేదన్నారు. నాగార్జున సాగర్ లాంటి దుస్థితి సోమశిల ప్రాజెక్ట్‌కు వచ్చే పరిస్థితి ఉందని ఆనం రాంనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

* టీటీడీ పాలకులు వివాదాలు సృష్టించొద్దు: రఘురామ
టీటీడీ పాలకులు వివాదాలు సృష్టించొద్దని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల ఖ్యాతిని కాపాడాలని కోరారు. శ్రీవారి జోలికి వెళ్లొద్దని టీటీడీ చైర్మన్, ఈవోలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని.. తమ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాడు-నేడు స్కూల్స్‌లో చేసింది ఏమీ లేదు.. రంగులు తప్ప? అని ప్రశ్నించారు. జిల్లాల విభజనపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తోందని తెలిపారు. జిల్లాల విషయంలో ఎమ్మెల్యేలను పిలిచి సీఎం జగన్ మాట్లాడారా? అని రఘురామ ప్రశ్నించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనకు వస్తుంటే ఎంపీలందరి పేర్లు వేశారని, తన పేరు ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్‌కు లేఖ రాస్తానని తెలిపారు. రూ.40కోట్లు ఇచ్చి మాజీమంత్రి వివేకాను హత్య చేయించాల్సిన అవసరం ఎవరికి ఉందని, ఆ హత్య వెనుక ఎవరున్నారు? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

* ఏపీలో రూ.21వేల కోట్లతో రహదారుల నిర్మాణం: కిషన్‌రెడ్డి
ఏపీలో రూ.21వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌తో పాటు నిర్మాణం పూర్తయిన పలు జాతీయ రహదారులను ప్రారంభించారు. కొత్తగా నిర్మించే జాతీయ రహదారులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో రూ.60కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కూడా రోడ్లు అత్యంత అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష లేదని వివరించారు. రోడ్, సముద్ర, వాయు కనెక్టివిటీ చాలా ముఖ్యమన్నారు. శ్రీశైలం, సింహాద్రి, అన్నవరం దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ట్రైబల్ డిపార్ట్‌మెంట్ ద్వారా విశాఖలో అల్లూరి మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విశాఖలో అనేక పరిశ్రమలకు కేంద్రం సహకరిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు.

* గడ్కరీ అందించిన సహకారంతో వేగంగా పూర్తి చేశాం: జగన్‌
740 కిలోమీటర్ల పొడవున 30 రహదారుల పనులకు కేంద్రమంత్రి, నితిన్ గడ్కరీ, సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మరో 21 రహదారులను పూర్తిచేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 2019 ఆగస్ట్‌లో బెంజ్‌ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్రాన్ని కోరామని తెలిపారు. గడ్కరీ అందించిన సహకారంతో వేగంగా పూర్తి చేశామని జగన్‌ తెలిపారు. బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌తో పాటు నిర్మాణం పూర్తయిన పలు జాతీయ రహదారులను ప్రారంభించారు. కొత్తగా నిర్మించే జాతీయ రహదారులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో జగన్, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. గతేడాది డిసెంబరులోనే నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వచ్చి పూర్తయిన బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆ పర్యటన రద్దయింది. వాహనదారులకు అసౌకర్యంగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ ఫ్లైఓవర్‌పై వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి సమయం ఇవ్వడంతో ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు.

* రాష్ట్రంలో విద్యుత్ కోతలు: మంత్రి బాలినేని
రాష్ట్రంలో చిన్న,చిన్న విద్యుత్ కోతలున్నాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు దాన్ని పెద్దవి చేసి చూపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం వేల కోట్లు అప్పులు చేసి వెళ్లడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని విభజించాయన్నారు. విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని ఆయన పేర్కొన్నారు. డీజీపీగా సవాంగ్ రెండున్నరేళ్లు పని చేశారని ఆయన తెలిపారు. సవాంగ్‌కు ఇప్పుడు కూడా మంచి పోస్ట్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

* మంత్రి హరీష్రావుకు రఘునందన్ సవాల్
తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ను రగిలించి సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే అనుమానం కలుగుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాష్ట్రంలో అలజడి సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా బీజేపీ తరపున శుభాకాంక్షలు చెప్పిన రఘునందన్ రావు..తెలంగాణకు అనుకున్నదానికంటే అదనంగా నిధులు కేటాయించామన్నారు. ఎయిమ్స్,ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చామన్నారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్ మాటకు కట్టుబడి ఉత్తర భారతదేశానికి చెందిన ఎంపీలు ఓటు వేయడంతో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యిందన్నారు. కుటుంబ సౌలభ్యం కోసం బీజేపీ ఏనాడు కోరుకోలేదని..రాష్ట్రాల అభివృద్ధిని మాత్రమే కోరుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రహదారుల కోసం ఏపీకి 22 వేల కోట్లు కేటాయించిందన్నారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఇండియాలో కలిపేస్తామన్నారు.

* మీ తప్పులు అంగీకరించకుండా.. నెహ్రూను బాధ్యుల్ని చేస్తారా?’
పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. భాజపా లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. భాజపా తన తప్పులను అంగీకరించకుండా ప్రజా సమస్యలకు నెహ్రూనే బాధ్యులను చేస్తోందని ధ్వజమెత్తారు. అన్ని విషయాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.పంజాబ్ ఎన్నికలకు మూడు రోజులే ఉన్న వేళ దేశ మాజీ, ఏకైక సిక్కు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.. ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భాజపాను, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలకు దిగారు. ఏడేళ్లకు పైగా అధికారంలో ఉన్న భాజపా… తన తప్పులను అంగీకరించకుండా ప్రజా సమస్యలకు ఇప్పటికీ నెహ్రూను బాధ్యులను చేస్తోందని మండిపడ్డారు. భాజపా జాతీయవాదం బ్రిటిష్ విభజనవాదంపై ఏర్పాటైందని విమర్శించారు. విదేశాంగ విధానం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల నిరసనలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ భాజపా వైఫల్యాలను మన్మోహన్ ఎండగట్టారు. పంజాబీలో ఆయన మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పార్టీ.. ఆ రాష్ట్రంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రదర్శించింది.

* కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు: మంత్రి Harish rao
కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీష్‌రావు రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ కారణజన్ముడని, ప్రజల ఆకాంక్షలను సీఎం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ గుక్కెడు తాగునీటి కోసం కష్టాలు పడిందని గుర్తుచేశారు. కానీ… నేడు సాగునీరు ఇస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని మంత్రి చెప్పారు.

* మెడ‌ప‌ట్టి గెంటేవ‌ర‌కూ పార్టీలోనే ఉంటా : మ‌నీష్ తివారీ
త‌న‌ను ఎవ‌రైనా బ‌య‌ట‌కు నెట్టివేసేవ‌ర‌కూ తాను కాంగ్ర‌స్ పార్టీని విడిచిపెట్ట‌న‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, జాతీయ ప్ర‌తినిధి మ‌నీష్ తివారీ గురువారం స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్‌లో తాను కిరాయిదారును కాద‌ని, పార్టీలో భాగ‌స్వామిన‌ని గ‌త నాలుగు ద‌శాబ్ధాలుగా పార్టీలో ప‌నిచేస్తున్నాన‌ని అన్నారు.మ‌నీష్ తివారీ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తార‌నే ప్ర‌చారం సాగుతున్న నేపధ్యంలో మ‌నీష్ తివారీ తాజాగా తాను పార్టీని వీడేది లేద‌ని ట్వీట్ చేశారు. తాను బాహాటంగా నోరుమెదిపితే తిరుగుబాటుగా ప‌రిగ‌ణిస్తున్నార‌ని..మౌనం దాల్చితే తాను నిస్స‌హాయిడిగా మిగిలిపోతాన‌ని ఇటీవ‌ల ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపాయి. ఇక పార్టీలో సంస్ధాగ‌త సంస్క‌ర‌ణ‌ల‌కు జీ-23 నేత‌ల్లో ఒక‌రైన మ‌నీష్ తివారీ అంత‌కుముందు డిమాండ్ చేశారు.

* వైసీపీది రాక్షసులు, ఉగ్రవాదులకు మించిన పాలన: Chandrababu
రాక్షసులు, ఉగ్రవాదులకు మించిన పాలన వైసీపీది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సర్పంచ్‌ల అవగాహన సదస్సులో బాబు మాట్లడుతూ… సర్పంచ్‌లకు రాజ్యాంగం హక్కులు కల్పించిందన్నారు. సర్పంచ్‌ అధికారాలను తీసుకోవడానికి జగన్‌ ఎవరని ప్రశ్నించారు. సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా వైసీపీ మార్చిందని మండిపడ్డారు. రాజ్యాంగ హక్కులను జగన్‌ హరిస్తున్నారన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా అరాచకాలు జరిగాయని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయోద్దని వైసీపీ హుకం జారీ చేసిందని, ఎన్నికల్లో ప్రచారం కూడా చేయనివ్వలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* రేవంత్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం: మాణిక్కమ్ ఠాగూర్
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ అన్నారు. టీపీసీసీ చీఫ్ అరెస్ట్‌పై ట్వీట్టర్ వేదికగా స్పందించిన ఠాగూర్… నిరుద్యోగుల పక్షాన రేవంత్ మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారు. తెలంగాణ సాధనలో ప్రధాన ఎజెండాగా ఉన్న నిరుద్యోగ సమస్యను కేసీఆర్ తన ఎజెండాలో లేదని మరోసారి నిరూపించుకున్నారని మాణిక్కమ్ ఠాగూర్ ట్వీట్ చేశారు

* మన ప్రతిపక్షాలది, పాకిస్థాన్‌దీ ఒకే ఎజెండా : మోదీ
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్థాన్‌ది ఒకే విధమైన ఎజెండా అని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ సోదరులను పంజాబ్‌కు రానివ్వొద్దని ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ చెప్పడాన్ని కూడా మోదీ ఖండించారు.

* ఉత్త‌ర హైద‌రాబాద్‌కు ఈ ఐటీ పార్కు ఆరంభం మాత్ర‌మే : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫ‌లితంగానే ఇవాళ కండ్ల‌కోయ‌లో ఐటీ పార్కును నిర్మించుకుంటున్నామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉత్త‌ర హైద‌రాబాద్‌కు ఈ ఐటీ పార్కు ఆరంభం, ప్రారంభం మాత్ర‌మే అని మంత్రి తేల్చిచెప్పారు. కండ్ల‌కోయ‌లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే ఐటీ పార్కుకు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు.

* టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా శంభీపూర్ రాజు ప్ర‌మాణ‌స్వీకారం
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా శంభీపూర్ రాజు గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. శంభీపూర్ రాజు చేత శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్ అమీనుల్ హ‌స‌న్ జాఫ్రీ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థ‌ల నుంచి శంభీపూర్ రాజు ఎమ్మెల్సీగా ఎన్నికైన విష‌యం తెలిసిందే. శంభీపూర్ రాజు ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మంలో మంత్రులు కేటీఆర్, మ‌హ‌ముద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, ప‌లువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.

* నన్ను బయటికి తోసేస్తే తప్ప నేను కాంగ్రెస్‌ను వీడను : మనీశ్ తివారీ
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళబోనని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ గురువారం చెప్పారు. ఎవరైనా తనను బయటికి తోసేస్తే మినహా, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. పార్టీలో తాను కౌలుదారును కాదని, భాగస్వామినని చెప్పారు. తాను 40 ఏళ్ళపాటు పార్టీ కోసం కృషి చేశానని చెప్పారు. ఈ దేశ ఐకమత్యం కోసం తన కుటుంబం రక్తం చిందించిందన్నారు. తనను ఎవరైనా బయటకు పంపించేయాలనుకుంటే, అది విభిన్నమైన విషయమని చెప్పారు. మనీశ్ తివారీ కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోతున్నారనే ఊహాగానాల నడుమ ఆయన గురువారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్‌లో నేను కౌలుదారును కాదు, నేను భాగస్వామిని. నేను పార్టీకి 40 ఏళ్ళు ఇచ్చాను. ఈ దేశ ఐకమత్యం కోసం మా కుటుంబం రక్తం చిందించింది. కానీ ఎవరైనా నన్ను బయటకు తోసేయాలనుకుంటే, అది విభిన్నమైన విషయం’’ అన్నారు. మనీశ్ తివారీ పంజాబ్‌లోని శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఈ నెల 20న జరుగుతాయి. బుధవారం ఆయన ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘నేను మాట్లాడితే తిరుగుబాటుగా భావిస్తారు. నేను మౌనంగా ఉంటే, నిస్సహాయుడినయ్యానంటారు’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో మనీశ్ తివారీ కూడా ఉన్నారు.

* సంచలన వ్యాఖ్యలు: మార్చి 10 తరువాత ప్రభుత్వంలో పెనుమార్పులు
మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలో త్వరలో ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయని మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు నానా పటోలే సంకేతాలిచ్చారు. ఆకస్మాత్తుగా పటోలే చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృíష్టించాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో దశలవారీగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలు వెలువడగానే మార్చి పదో తేదీ తరువాత పెనుమార్పులు జరుగుతాయని భండార జిల్లాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో నానా పటోలే వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీలతో చర్చలు జరిగాయన్నారు.

*అధికారం కోసం జగన్ ఎవరినైనా ‎మోసం చేస్తారు: అనిత
అధికారం కోసం జగన్ ఎవరినైనా ‎మోసం చేస్తారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. మహిళలపై దాడులు జరుగుతున్న సీఎం స్పందించటం లేదన్నారు. షర్మిలకు మంత్రి పదవి ఇవ్వకుండా ‎ద్రోహం చేశారని మండిపడ్డారు. షర్మిల పక్క రాష్ట్రాల్లో తలదాచుకునే పరిస్థితి కల్పించారన్నారు. జగన్ అనుమతి లేనిదే విజయమ్మ ఏపీకి రాలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వివేకా ‍హత్య కేసులో గతంలో సీబీఐ ఎంక్వైరీ కావాలన్న జగన్… నేడు సునీతను ఎలా మోసం చేస్తున్నారో చూస్తున్నామని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

*ప్రత్యేక హోదా ఇచ్చది కాంగ్రెస్ మాత్రమే: మస్తాన్ వలీ
ప్రత్యేక హోదా ఇచ్చది కాంగ్రెస్ మాత్రమే అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… తెలుగు ప్రజల పట్ల ప్రధాని మోదీ కపట నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని మోదీ అమలు పరచాలని డిమాండ్ చేశారు. మెడలు వంచుతానన్న జగన్నతన మెడ మోదీ వద్ద వంచారని వ్యాఖ్యానించారు. లక్షల కోట్లు అప్పలు చేసి జగన్ రెడ్డి పాలన చేస్తున్నారన్నారు. రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలిపారు. మోడీ మెడలు వంచి ఏపికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని మస్తాన్ వలీ స్పష్టం చేశారు.

*ఎవరు అడ్డం వస్తే వాళ్లను చంపేస్తున్నారు… వైఎస్‌ను కూడా ఏం చేసేవారో?: Narayana
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భయంకరమైన వాతావరణం ఏర్పడుతోందని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ…కోల్డ్ మర్డర్ వ్యవస్థ ఏపీలో ఉందని.. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశమన్నారు. వైఎస్ వివేకా హత్యపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని తెలిపారు. ఏకంగా సీబీఐపైనే సుప్రీంకోర్టుకు వెళ్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అంటున్నారన్నారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారన్నది కోర్టులో వివాదం నడుస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తున్నారని… వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డం ఉంటే ఆయనను కూడా ఏం చేసేవారో అని వ్యాఖ్యలు చేశారు. అంత అనుమానంతో కూడిన రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో వచ్చాయన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే సీబీఐను సపోర్ట్ చేస్తారు లేకుంటే వ్యతిరేకిస్తారని నారాయణ అన్నారు.

*వాడుకుని వదిలేయడంలో జగన్‌రెడ్డి టాప్‌
‘అవసరానికి వాడుకుని, అది తీరాక నిలువునా వంచించి వదిలేయడంలో సీఎం జగన్‌రెడ్డి టాప్‌ ర్యాంకర్‌. గౌతం సవాంగ్‌ను అడ్డగోలుగా వాడుకుని అవమానకర రీతిలో గెంటేశారు. డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్‌ ఇవ్వకుండా ఘోరాతి ఘోరంగా అవమానించారు’ అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సీఎం నైజాన్ని ఉద్యోగులు, పోలీసులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. జగన్‌రెడ్డి దుబారా, లూటీతో రాష్ట్రం దివాళా తీసిందని యనమల విమర్శించారు. కాగా, రాష్ట్రంలో గంజాయి మాఫియా, జూద క్రీడలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాలను నివారించి రాష్ట్ర యువత భవిష్యత్‌ను కాపాడాలంటూ ముఖ్యమంత్రికి ఆయన బహిరంగ లేఖ రాశారు

*వివేకా హత్య కేసులో సీఎం సన్నిహితులే దోషులు: అమరనాథరెడ్డి
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీఎం జగన్‌ సన్నిహితులే దోషులని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆరోపించారు. భవిష్యత్తులో వివేకా వల్ల రాజకీయ ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతోనే ఆయనను హత్య చేశారన్నారు. హత్య ను గుండెపోటుగా చిత్రీకరించడం వెనుక పెద్దకుట్ర ఉందన్నారు. కడప సెంట్రల్‌ జైల్లో ఉన్న వివేకా హత్యకేసు ముద్దాయిలను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాగా, వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ చార్జ్‌షీట్‌ ఆధారంగా సీఎం జగన్‌ను విచారించాలని టీడీపీ నేత బీకే పార్థసారథి డిమాండ్‌ చేశారు.

*వారిని వేరే జైలుకు మార్చండి: వర్ల లేఖ
వైఎస్‌ వివేకా హత్యకేసులో నిందితులుగా ఉన్నవారికి ప్రాణహాని ఉందని, వారిని తక్షణం కడప నుంచి వేరే జైలుకు మార్చాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన జైళ్ళ శాఖ డీజీకి బుధవారం లేఖ రాశారు. నిందితులను తక్షణం కడప నుంచి రాజమండ్రి జైలుకు బదిలీ చేయాలని కోరారు.

*యూపీ, బిహారీలను పంజాబ్‌కు రానివ్వం – ప్రియాంక సమక్షంలోనే సీఎం చన్నీ వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ సోదరులను పంజాబ్‌లో అడుగు పెట్టనివ్వబోమంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం కాంగ్రెస్‌ నిర్వహించిన రోడ్‌షోలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ప్రియాంక చిరునవ్వు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. దీనిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ తీవ్రంగా మండిపడ్డాయి. చన్నీ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రియాంక తనకు తాను యూపీ కూతురిగా చెప్పుకొంటారని, మరోవైపు చన్నీ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఖలిస్థాన్‌కు ప్రధానమంత్రి కావాలనుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఆప్‌ వ్యవస్థాపక సభ్యుడు, ఆ పార్టీ మాజీ నేత కుమార్‌ విశ్వాస్‌ చెప్పినట్లు పేర్కొంటూ ఓ వీడియోను బీజేపీ నేత అమిత్‌ మాలవీయ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు

*ఉత్తర ప్రదేశ్ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తోంది : అనురాగ్ ఠాకూర్
ఉత్తర ప్రదేశ్, బిహార్ సోదరులను పంజాబ్‌లో ప్రవేశించనివ్వొద్దని పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ పిలుపునివ్వడంపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ ఉత్తర ప్రదేశ్ ప్రజలను అవమానించారని, ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా నవ్వుతున్నారని, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఉత్తర ప్రదేశ్ ప్రజలను పబ్లిక్ గూండాలని అన్నారని, అఖిలేశ్ యాదవ్ ఆమెకు పెద్ద పెద్ద పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌ను అవమానించే పనిని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ చేపట్టాయా? అని ప్రశ్నించారు