భారత సంతతికి చెందిన వ్యక్తికి సింగపూర్‌లో అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ కంపెనీకి సీఈఓ నియామకం అయ్యారు. ఏప్రిల్ 5న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన బిజినెస్ లీడర్ విపుల్ చావ్లా.. సింగపూర్ కంపెనీ ఫెయిర్‌ప్రైస్ గ్రూప్ సీఈఓగా నియామయం అయ్యారు. ఫెయిర్‌ప్రైస్ గ్రూప్ సీఈఓగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న సీ కియాన్ పెంగ్.. ఏప్రిల్‌లో ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 5న చావ్లా.. సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని ఫెయిర్‌ప్రైస్ గ్రూప్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిజికల్ స్టోర్‌లు, ఆన్‌లైన్ రిటైల్ వృద్ధిని వేగవంతం చేయడంలో పెంగ్ వ్యూహాలను చావ్లా కొనసాగిస్తారని ఫెయిర్‌ప్రైస్ తన ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా.. దేశ వ్యాప్తంగా సూపర్ మార్కెట్ ఫుడ్ చైన్ ఆపరేటర్‌గా సింగపూర్‌లో ఫెయిర్‌ప్రైస్ గ్రూపు కీలక భూమిక పోషిస్తోంది. ఫెయిర్‌ప్రైస్ గ్రూప్ సంవత్సరం రెవెన్యూ 3 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం.