ఆలయాల నుంచి నదుల్లో చేరి కాలుష్యానికి కారణమవుతున్న పూలు… ఫ్యాషన్ పరిశ్రమ అవసరాలు తీర్చడానికి ప్రాణాలు కోల్పోతున్న మూగ జీవాలు…ఈ రెండు సమస్యలకూ ‘ఫూల్.కో’ కనుగొన్న ఒకే పరిష్కారం ‘ఫ్లెదర్’. బాలీవుడ్ తార అలియాభట్ పెట్టుబడి పెట్టడంతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ సంస్థలో పని చేసేవారంతా మహిళలే కావడం విశేషం.
ఆలయాలకు వెళ్తాం. పూలతో ఇష్ట దైవాలకు పూజలు చేస్తాం. మాలలు సమర్పిస్తాం. పవిత్రమైన ఆరాధనలకు వినియోగిస్తున్న ఆ పూలు చివరికి ఏమవుతున్నాయి? ప్రతి సంవత్సరం దేశంలో తయారవుతున్న పూల వ్యర్థాల పరిమాణం ఎంతో తెలుసా? ఎనిమిది లక్షల టన్నులు! దీనిలో చాలా భాగం నదుల్లో, నీటి వనరుల్లో కలుస్తోంది. కాలుష్యానికి కారణం అవుతోంది. ప్రధానంగా… పూలు బాగా పెరగడం కోసం వాడుతున్న రసాయనాలు, పురుగు మందులు ఆ నీటిని వినియోగించేవారికి, జలచరాలకు ముప్పుగా మారుతున్నాయి. ‘‘పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు… భక్తులు పూజకు వాడే పువ్వులు వాడిపోయి… హానికరంగా మారడం ఏమిటి?’’ అనిపించింది గంగానది జలాల్లో తేలుతూ, కదిలిపోతున్న పూలను చూసిన అంకిత్ అగర్వాల్‌కు. ఆ ఆలోచనల్లోంచి ‘ఫూల్.కో’ అనే సంస్థకు 2017లో బీజం పడింది. ఆలయాల్లో పూజల అనంతరం నిర్మాల్యాన్ని అంటే తొలగించిన పూలనూ, దండలనూ ఆ సంస్థ ప్రతినిధులు సేకరించడం ప్రారంభించారు. దీనికోసం వివిధ ఆలయ వర్గాలను ఒప్పించారు. పూలను సేకరించడం ఒక ఎత్తయితే… వాటిని శుద్ధి చేయడం మరో ఎత్తు. ఎందుకంటే ఆలయాల బయట, నదుల్లో పడేసిన పూలు దుమ్ముతో, ఇతర మలినాలతో, చిన్న పురుగులతో ఉంటాయి. ఆ పూలను ‘ఫూల్.కో’ యూనిట్‌కు తీసుకొస్తారు. ఏ రకానికి ఆ రకం పూలను వేరు చేస్తారు. రసాయన అవశేషాలను తొలగించడానికి ఒక ఆర్గానిక్ మిశ్రమాన్ని చల్లి, కొన్ని గంటలు ఉంచుతారు. తరువాత పూలను కడిగి, ఎండబెడతారు. వాటిని ముద్దగా చేసి, ఇతర పదార్థాలు కలిపి… అగరుబత్తులు, ధూప్ స్టిక్స్ తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ సంస్థ అనేక రకాల అగరుబత్తుల్ని తయారు చేస్తోంది. వాటిలో వాడగా మిగిలిన పదార్థంతో వర్మీకంపోస్ట్ రూపొందిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో పని చేసేది మహిళలే. దాదాపు 1,200 గ్రామీణ కుటుంబాలకు ఈ సంస్థ ఆర్థికమైన ఆసరా కల్పిస్తోంది.
*పూలే చర్మంగా…
తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో… ఫ్యాషన్ రంగం రూపు రేఖలను మార్చే మరో ప్రయోగానికి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది. అదే వెజిటేరియన్ లెదర్… ఫ్లవర్ లెదర్. దాన్ని ‘ఫ్లెదర్’ పేరిట… ‘ఫూల్.కో’ ఆర్ అండ్ డి విభాగం అభివృద్ధి చేసింది. శాస్త్రీయ పద్ధతుల్లో పూలను చర్మంగా మార్చే ఈ విధానం ద్వారా… ఫ్యాషన్ వస్తువుల కోసం జంతు చర్మం వినియోగాన్ని తగ్గించవచ్చనీ, మూగ జీవాల వధను నిరోధించవచ్చనీ ఈ సంస్థ చెబుతోంది. ఎండబెట్టిన పూల రేకులను దళసరి నార చాప రూపంలోకి తీసుకువస్తారు. ‘ప్లాస్టిసైజేషన్’ అనే పద్ధతిలో దాన్ని ‘ఫ్లెదర్’గా తయారు చేస్తారు. అనేక పొరల ఫ్లెదర్ షీట్ తయారు కావడానికి దాదాపు నాలుగు నెలల సమయం పడుతుంది. ఒక చదరపు మీటర్ పొడవైన ఫ్లెదర్ షీట్‌కు సుమారు 73 వేల కిలోల పూలు అవసరమవుతాయి. ప్రస్తుతం మూడు రంగుల్లో దీన్ని రూపొందిస్తున్నారు.
*ఎంతో గర్వంగా ఉంది…
పర్యావరణానికి మేలు చేసే ఈ ఆవిష్కరణలు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తున్న బాలీవుడ్ నటి అలియాభట్‌ను ఆకర్షించాయి. అందుకే ఆమె ‘ఫూల్.కో’లో పెట్టుబడులు పెట్టారు. దీంతో ఆ సంస్థ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం వచ్చింది. పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి, జంతువుల పట్ల ప్రేమ ఉన్న అలియా ‘పెటా పర్సన్ ఆఫ్ ది ఇయర్’, ‘పెటా ఇండియా ఫ్యాషన్ అవార్డ్’ కూడా అందుకున్నారు. ‘‘రీసైకిల్ చేసిన పూలతో అగరుబత్తులు, బయో లెదర్ తయారు చేయాలనే ఆలోచన నచ్చింది. దీనివల్ల మన నదులు శుభ్రంగా ఉంటాయి. జంతు చర్మానికి ప్రత్యామ్నాయం దొరుకుతుంది. ఎంతోమంది మహిళలకు ఉపాధి కలుగుతుంది. ఇలాంటి ప్రయోగాలకు మన దేశం కేంద్రం కావడం ఎంతో గర్వంగా ఉంది. అందుకే నేను దీనిలో భాగస్వామి కావాలనుకున్నాను’’ అని చెప్పారు అలియా. ఆమే కాదు, ఎంతోమంది పెట్టుబడిదారులను కూడా ‘ఫూల్.కో’ ఆకర్షిస్తోంది. రోజూ దాదాపు ఎనిమిదిన్నర టన్నుల పూల వ్యర్థాలను ఈ సంస్థ సేకరిస్తోంది. ఇప్పుడు వీగన్ ఫ్యాషన్ ఉత్పత్తుల ద్వారా పర్యావరణ రక్షణకు మరింత దోహదపడే పరిశోధనలు, ప్రయోగాలు చేస్తోంది. తద్వారా మన భూమిని కాలుష్యరహితంగా మార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తామని చెబుతోంది.
‘‘రీసైకిల్ చేసిన పూలతో అగరుబత్తులు, బయో లెదర్ తయారు చేయాలనే ఆలోచన నాకెంతో నచ్చింది. దీనివల్ల మన నదులు శుభ్రంగా ఉంటాయి. జంతు చర్మానికి ప్రత్యామ్నాయం దొరుకుతుంది. ఎంతోమంది మహిళలకు ఉపాధి కలుగుతుంది. ఇలాంటి ప్రయోగాలకు మన దేశం కేంద్రం కావడం ఎంతో గర్వంగా ఉంది. అందుకే నేను దీనిలో భాగస్వామి కావాలనుకున్నాను.’’ – అలియా భట్