విదేశీ పెట్టుబడిదారులు బ్రిటన్‌లో నివాసం ఉండేందుకు అవకాశం కల్పించే ‘గోల్డెన్‌వీసా’లను బ్రిటన్ ప్రభుత్వం గురువారం రద్దుచేసింది. 2008లో ప్రవేశపెట్టిన ఈ వీసాల ద్వారా విదేశీ సంపన్న పెట్టుబడిదారులు రెండు మిలియన్ పౌండ్స్(రూ.20.26 కోట్లు), అంతకు మించి పెట్టుబడిపెడితే కుటుంబాలతో సహా వారు బ్రిటన్‌లో నివాసం ఉండటానికి అవకాశం కల్పిస్తారు. భద్రతా సమస్యలు, తమ దేశాలలో అవినీతికి పాల్పడినవారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వంటి కారణాల వల్ల బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుంది. యూకేలో అవినీతిపరులు ప్రవేశించడానికి టైర్ 1 ఇన్వెస్టర్ల వీసాలు అవకాశం కల్పించినట్లు హోం శాఖ కార్యాలయం పేర్కొంది. ఈ వీసాల ద్వారా ఎక్కువ మంది రష్యావారు యూకేలోకి ప్రవేశించారని, వారి ద్వారా ఇక్కడ అక్రమ నగదు చలామణీ అవుతున్నట్లు చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. అవినీతి డబ్బును అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హోం సెక్రటరీ ప్రీతి పాటిల్ చెప్పారు.