టీడీపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. పార్టీకి దూరంగా ఉన్న నేతలపై ఆయన ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ కావాలని అనుకున్నారు. అనుకున్నట్లే నేతలకు కబురు కూడా పెట్టారు. అధినేత పిలుపుతో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల ఇన్‌చార్జ్‌లతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గాల్లోని పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశానికి డుమ్మా కొట్టారు. గంటా సమావేశానికి కచ్చితంగా వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రాలేదు. ముందుగానే సమావేశానికి రాలేనని గంటా సమాచారం ఇచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
కొంతకాలంగా గంటా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో క్రియాశీలకంగా లేరు. అయితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2019లో భీమిలి నియోజకవర్గాన్ని వీడి విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏడాది అయింది. ఏడాది తర్వాత చంద్రబాబు నుంచి గంటాకు పిలుపువచ్చింది.