Devotional

70 కోట్లతో ఇస్కాన్ క్షేత్రం – TNI ఆధ్యాత్మిక వార్తలు

70 కోట్లతో ఇస్కాన్ క్షేత్రం – TNI ఆధ్యాత్మిక వార్తలు

తాడేపల్లి మండలం కొలనుకొండలో రూ. 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హరికృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ నిర్వహించారు. ఇక్కడ ఇస్కాన్‌ శ్రీవెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాల నిర్మాణం చేపట్టింది. సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు.. యువత కోసం శిక్షణ కేంద్రం, యోగ ధ్యాన కేంద్రాల నిర్మాణం చేపట్టనుంది. ఇస్కాన్‌ తరపున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు.

1. వెంకన్న లడ్డూకు‘అనంత’ పప్పుశనగ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ప్రతిఒక్కరూ పరమపవిత్రంగా భావిస్తారు. అంతటి మహిమాన్వితమైన లడ్డూ తయారీకి అవసరమైన పదార్ధాల్లో చక్కెర, నెయ్యితో పాటు శనగపిండి కూడా ముఖ్యమైనది. ఇప్పుడా శనగపిండికి అవసరమైన పప్పుశనగను అనంతపురం జిల్లా నుంచి పంపిస్తున్నారు. అంటే లడ్డూ తయారీలో అక్కడి రైతులు పండిస్తున్న పప్పుశనగకు భాగస్వామ్యం దక్కుతోంది. పూర్తిగా ప్రకృతి సిద్ధంగా సాగుచేసిన పంటను సేకరించడానికి టీటీడీ సైతం చర్యలు చేపట్టింది. ప్రకృతి వ్యవసాయ విభాగం (జెడ్బీఎన్ఎఫ్) డీపీఎం లక్ష్మానాయక్ సహకారంతో ఈనెలాఖరున అవసరమైన పప్పుశనగను వెంకన్న సన్నిధికి చేర్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.
*1,396 క్వింటాళ్లకు టీటీడీ ఆర్డర్
జెడ్బీఎన్ఎఫ్ విభాగం ఆధ్వర్యంలో తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామంలో 57 మంది రైతులు సహజ పద్ధతుల్లో సాగుచేసిన 185 ఎకరాల్లోని దిగుబడి ఆధారంగా 1,396 క్వింటాళ్ల పప్పుశనగకు ఇటీవల టీటీడీ నుంచి ఆర్డర్ వచ్చినట్లు డీపీఎం లక్ష్మానాయక్ ‘సాక్షి’కి తెలిపారు. ఇక్కడి రైతులు ఎకరాకు 400 కిలోలు ఘన జీవామృతం, బీజామృతంతో విత్తనశుద్ధి, ప్రతి 20 రోజులకోసారి జీవామృతాన్ని పిచికారీ చేసి పప్పుశనగ పండిస్తున్నారని తెలిపారు. ఎక్కడా రసాయనాలు, పురుగు మందులు లేకుండా పూర్తిగా ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి లాంటి వాటితో తయారుచేసిన ప్రకృతి సిద్ధమైన సేంద్రియ పోషకాలు వాడుతున్నారన్నారు.
పప్పుశనగలో అంతర పంటలుగా సజ్జ, అనుము, అలసందతో పాటు ఆవాలు కూడా వేశారన్నారు. అందువల్లే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు నాణ్యమైన పప్పుశనగ దిగుబడులు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఈనెలాఖరున పంట తొలగించి నూర్పిడి చేసిన తర్వాత 1,396 క్వింటాళ్లు టీటీడీకి పంపించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కన్నా 20 శాతం అధికంగా రైతులకు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. క్వింటా ఎంతలేదన్నా రూ.7 వేలకు తక్కువ కాకుండా పలికే అవకాశం ఉందన్నారు. తిరుమల వెంకన్న ప్రసాదం తయారీకి తాము పండించిన పప్పుశనగ వినియోగించనుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారని డీపీఎం లక్ష్మానాయక్ వెల్లడించారు.

2.టీటీడీకి రూ.9.20కోట్ల భూరి విరాళం
టీటీడీకి గురువారం రూ.9.20 కోట్ల భూరి విరాళం అందింది. చెన్నై నగరం మైలాపూర్కు చెందిన డాక్టర్ పర్వతం పేరుపై బ్యాంక్లో రూ.3.20 కోట్ల డిపాజిట్లు, రూ.6 కోట్ల విలువైన రెండిళ్లు ఉన్నాయి. ఆమె కన్నుమూయడంతో పర్వతం జ్ఞాపకార్థం ఆమె సోదరి రేవతీ విశ్వనాథం ఈ ఆస్తిని టీటీడీకి విరాళంగా ఇచ్చారు. ఆస్తి పత్రాలను టీటీడీ చైర్మన్కు గురువారం అందజేశారు.

3. తిరుమలలో హోటళ్లు బంద్
తిరుమలలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగించి ముఖ్య కూడళ్లలో ఉచితంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయిం చింది. అత్యున్నత స్థాయి నుంచి సామాన్య భక్తుడి వరకు ఒకే రకమైన ఆహారం అందించాలని తీర్మానించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3,096.40 కోట్ల్ల అంచనాలతో టీటీడీ వార్షిక బడ్జెట్ను ఆమోదించినట్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఆదాయంలో ప్రధానంగా హుండీ ద్వారా రూ. వెయ్యి కోట్లు, పెట్టుబడుల ద్వారా వడ్డీ రూ. 668.51 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.365 కోట్లు, దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.242 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా రూ.126 కోట్లు, ఆర్జితసేవలతో రూ.120 కోట్లు, అద్దె గదులు, కల్యాణ మండపాల ద్వారా రూ.95 కోట్లు, కాటేజీ డోనర్ స్కీం కింద రూ.90 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు.కొవిడ్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో త్వరలో శ్రీవారి ఆర్జిత సేవలను పునరిద్ధరిస్తామన్నారు. వీటితో పాటు సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచాలని నిర్ణయించామన్నారు. సిఫారసు లేఖలపై ఆర్జితసేవా టికెట్ల పెంపుపై చర్చించామని, కొవిడ్ నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడుతున్న క్రమంలో అలాంటి ఆలోచన సరికాదనుకున్నామని తెలిపారు. శ్రీవారి ఆలయ మహాద్వారానికి, బంగారువాకిలికి, ఆనందనిలయానికి బంగారు తాపడం చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

4. Tirumala: అలిపిరి వద్ద ఉద్రిక్తత
తిరుమలలోని అలిపిరి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి అలిపిరి వద్ద రథయాత్ర చేపట్టారు. కాగా రథయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అడ్డుకున్నారు. దీనిపై గోవిందానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు

5. మేడారం బాట పట్టిన బీజేపీ నేతలు
బీజేపీ నేతలంతా మేడారం బాట పట్టారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్‌తో కలిసి హెలికాప్టర్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మేడారానికి వచ్చారు. బీజేపీ కార్యాలయం నుంచి గిరిజన మోర్చా జాతీయ అధ్యక్షుడు సమీర్ ఒరన్‌తో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం జాతరకు రానున్నారు. బండి సంజయ్‌ వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మేడారం వెళ్లనున్నారు.

6. శ్రీవారి సేవలో ఎమ్మెల్సీ కవిత
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిమరుల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించారు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న అలిపిరి కాలినడక మార్గం గుండా కవిత తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ.. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, తిరుపతి నగర శివార్లలోని మంగళంలోని ఓ వృద్ధాశ్రమంలో కవిత తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే.

7. హరికృష్ణ గోకుల క్షేత్రానికి భూమి పూజ చేసిన సీఎం జగన్‌
తాడేపల్లి మండలం కొలనుకొండలో రూ. 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హరికృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ నిర్వహించారు. ఇక్కడ ఇస్కాన్‌ శ్రీవెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాల నిర్మాణం చేపట్టింది. సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు.. యువత కోసం శిక్షణ కేంద్రం, యోగ ధ్యాన కేంద్రాల నిర్మాణం చేపట్టనుంది. ఇస్కాన్‌ తరపున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు.

8. మేడారం జాతరకు ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది: ఎర్రబెల్లి
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ప్రభుత్వం 75కోట్ల రూపాయలు కేటాయించిందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జాతర ఏర్పాట్లు ఘనంగా జరిగాయన్నారు. విజయవంతంగా నిర్వహించ బడుతున్న సమ్మక్క సారలమ్మ జాతర జాతర ప్రారంభమైప్పటినుండి దాదాపు ఒక కోటి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారుని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత 8 ఎండ్ల కాలంలో 4 దఫాలుగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడానికి 381 కోట్ల రూపాయలు వ్యయం చేశామని తెలిపారు, అందులో భాగంగా ఈ సంవత్సరం జాతర నిర్వహణకు 75 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. సమైఖ్య రాష్ట్రంలో వివక్షత వల్ల జాతరలో భక్తుల కోసం ఏర్పాట్లు సరిగా ఉండేవి కావని ఆయన అన్నారు.

9. రేపు సాయంత్రం ముచ్చింతల్‌‌లో 108 క్షేత్రాల భగవన్మూర్తుల ప్రథమ కల్యాణ మహోత్సవం..
ముచ్చింతల్‌(Muchintal) దివ్యక్షేత్రం శ్రీరామనగరం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. భగవద్ రామానుజ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 క్షేత్రాల భగవన్మూర్తుల ప్రథమ కల్యాణ మహోత్సవాన్ని చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 108 దివ్య దేశాలతో అలరారుతున్న దివ్యసాకేత క్షేత్రంలో మొట్టమొదటిసారిగా ఈ మహోత్సవం.. నిర్వహించనున్నారు. ఈ కళ్యాణం రేపు (ఫిబ్రవరి 19వ తేదీ) సాయంత్రం 5 గంటల నుంచి 8వరకూ భగవద్ రామానుజ వారిని చేరే దివ్య సోపాన మార్గంలో జరగనుంది. ఈ శాంతి కల్యాణ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం అందించామని చినజీయర్‌ స్వామి చెప్పారు. నెల 20 నుంచి సువర్ణమూర్తి విగ్రహాన్ని దర్శనానికి అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.శ్రీ రామానుజ సువర్ణ మూర్తి దర్శనం తో పాటు 108 దివ్యదేశాలలో నియర్ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్, 3డి టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు తద్వారా సందర్శకులకు మరింత సౌలభ్యం లభిస్తుందని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి చెప్పారు. ప్రధానమంత్రి మోడీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా వారి ఆదేశాల పాటించాలని సీఎం కేసీఆర్ చెప్పారని అంతేకానీ సీఎం కేసీఆర్ తో తనకు కు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. శిలాఫలకం ఏర్పాటు విషయంలో ఈ విభేదాలు అన్ని మీడియా సృష్టేనని… సీఎం కేసీఆర్ కు తన మధ్య ఎలాంటి విభేదాలు లేవని చిన్న జీయర్ స్వామి తెలిపారు . ముచ్చింతల్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తానే మొదటి వాలింటర్ నని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పిన విషయాన్ని చిన జీయర్ స్వామి మీడియాకు గుర్తు చేశారు. ఎంట్రీ ఫీజు విషయంలో త్వరలోనే సరైన నిర్ణయం తీసుకొని అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేస్తామని చిన్న జీయర్ స్వామి తెలిపారు. సమతా మూర్తి స్పూర్తిని అందరూ పాటించాలని సమాజాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ తొలగిపోవాలని ఆయన అన్నారు. కరోనా తగ్గుముఖం పట్టడం మహా అద్భుతం అని ఇది యాగ ఫలమే అని చిన్న జీయర్ స్వామి తెలిపారు.శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంలో మీడియా సహకారం అందించిందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజీ అన్నారు.చరిత్రలో ప్రప్రథంగా జరిగే ఈ అద్భుత మహోత్సవాన్ని దర్శించడానికి శ్రద్ధాళువులందరికీ హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నారు. కల్యాణ మూర్తుల దివ్యదేశాల నుంచి కల్యాణ ప్రాంగణానికి చేరడం వలన మూల స్థానాలు మూసి ఉంటాయని తెలిపారు. ఈ ఐతిహాసిక మహాద్భుత కార్యక్రమాన్ని కనులారా వీక్షించి, సేవించి తరించే సౌభాగ్యాన్ని అందరూ వినియోగించుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.