Politics

త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. : జ‌గ్గారెడ్డి

త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. : జ‌గ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవ‌మానానికి గుర‌వుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి శ‌నివారం ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీకి మూడు పేజీల లేఖ రాశారు. తాను త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాన‌ని లేఖ‌లో జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు. ఈ లేఖ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి తాను కాంగ్రెస్ గుంపులో ఉండ‌న‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీని వీడిన గాంధీ కుటుంబంపై గౌర‌వంతో ఉంటాన‌ని జ‌గ్గారెడ్డి త‌న లేఖ‌లో పేర్కొన్నారు. త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మిక‌ సభ్యత్వానికి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆక‌స్మికంగా వచ్చి లాబీయింగ్ చేసి పీసీసీ కావొచ్చు అని రేవంత్ రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ కోవర్టుగా ముద్రవేస్తున్నారు. ఇది బాధ క‌లిగించే విష‌య‌మ‌ని జ‌గ్గారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్‌లో గతంలో వివాదాలు ఉన్న హుందాగా ఉండేది.. కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదు అని ఆయ‌న పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజలకు స్వతంత్రంగా సేవ చేస్తాన‌ని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు. పార్టీలో ఎవ‌రు కోవర్టులో అధిష్టానం గుర్తించాలి. 2017లో రాహుల్ గాంధీ స‌భ పెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోతే.. కోట్ల రూపాయాలు ఖ‌ర్చు పెట్టి స‌భ నిర్వ‌హించాను అని జ‌గ్గారెడ్డి లేఖ‌లో గుర్తు చేశారు. ఆ సభ నుండి రాష్ట్రంలో పార్టీ బలపడింది.. పార్టీ కోసం కష్టపడిన నేనా కోవర్టుని… సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతలా కోవర్టులు…? అని జ‌గ్గారెడ్డి ప్ర‌శ్నించారు.