*ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా తన మాజీ బాస్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలుసుకున్నారు. ఆయనతో కలిసి విందు సమావేశంలో పాల్గొన్నారు. 2020లో పార్టీ సభ్యత్వం నుంచి ప్రశాంత్ కిషోర్‌ను నితీష్ తొలగించిన తర్వాత ఉభయులూ సమావేశం కావడం ఇదే ప్రథమం. ఢిల్లీలోని నితీష్ అధికారిక నివాసంలో ఇరువురూ సుమారు 2 గంటల సేపు సమావేశమయ్యారు. అతి పెద్ద గోబర్-ధన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీఢిల్లీలో ఇద్దరూ విందు సమావేశంలో పాల్గొన్న విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ నితీష్‌కుమార్ ధ్రువీకరించారు. ప్రశాంత్ కిషోర్‌తో తనకు పాత అనుబంధం ఉందని, తమ సమావేశం వెనుక ఏవో ఉద్దేశాలు ఊహించుకోవద్దని నవ్వుతూ చెప్పారు. పీకే (ప్రశాంత్ కిషోర్) సైతం తాము మర్యాదపూర్వకంగానే కలుసుకున్నట్టు తెలిపారు. నితీష్ కుమార్ ఒమైక్రాన్ ఇన్‌ఫెక్షన్‌తో ఉన్నప్పుడు ఫోనులో ఆయన ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నానని, ఇద్దరం ఒకసారి కలుసుకుందామని నితీష్ తనతో అన్నారని, ఈరోజు కలుసుకోగలిగామని చెప్పారు.బీహార్‌లో నితీష్‌కుమార్ జనతాదళ్ యునైటెడ్ విజయం కోసం గతంలో వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత ఆ పార్టీలో చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, నితీశ్, పీకే మధ్య సంబంధాలు క్షీణించడంతో ఆయనను ఆ పదవి నుంచి నితీష్ తొలగించారు. దాంతో ఆ పార్టీకి పీకే దూరమయ్యారు. ఇటీవల పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ సారథ్యంలోని టీఎంసీ తిరిగి ఘనవిజయం సాధించడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన బలంగా పనిచేసింది. కాగా, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సైతం నితీష్‌తో తనకున్న సంబంధాల గురించి పీకే మాట్లాడుతూ, తాను తిరిగి కలిసి పనిచేయాలనుకుంటున్న కొద్దిమంది నేతల్లో ఆయన కూడా ఒకరని పేర్కొన్నారు.
* కాకినాడకు పట్టిన అవినీతి చీడపురుగు ద్వారంపూడి: పట్టాభి
ఎమ్మెల్యే ద్వారంపూడ చంద్రశేఖర్‌రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. ‘‘కాకినాడకి పట్టిన అవినీతి చీడపురుగు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. మంత్రితో కలిసి పేదల బియ్యాన్ని ద్వారంపూడి దోచుకుంటున్నారు. నిజాలు బయటపెట్టిన వారిని బూతులు తిడతారా?. కాకినాడని అవినీతికి అడ్డాగా మార్చారు. లెక్కలు తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడే.. ద్వారంపూడి బాగోతాన్నే బయటపెట్టాను. 2018-19లో 18.09 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి అయ్యాయి. 2020-21లో 31.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయి. బియ్యం ఎగుమతులు ఎలా పెరిగాయో ద్వారంపూడి సమాధానం చెప్పాలి?.. టీడీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కట్టుకథలు చెబుతున్నారు. ద్వారంపూడి ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. బియ్యం అక్రమ ఎగుమతులపై సీబీఐ విచారణ జరిపించాలి’’ అని పట్టాభి డిమాండ్ చేశారు
* వివేకా కేసులో ప్రధాన నిందితుడు జగన్: కొల్లు రవీంద్ర
మాజీమంత్రి వివేకా కేసులో ప్రధాన నిందితుడు సీఎం జగన్‌రెడ్డేనని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌తో పాటు అతని కుటుంబసభ్యులను సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఎంపీ అవినాష్‌రెడ్డిని సానుభూతితో గెలిపించుకునేందుకు.. వివేకాను హత్య చేసి సొంత మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. వివేకా కుమార్తె పోరాటంతో నిజాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. సీబీఐ నిష్పక్షపాతంగా విచారించి దోషులను శిక్షించాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
*కేసీఆర్ మాట్లాడేవన్నీ అబద్ధాలే : విజయశాంతి
సీఎం కేసీఆర్ మాట్లాడేవన్ని అబద్ధాలేనని బీజేపీ నేత విజయశాంతి పేర్కొన్నారు. భాష మార్చుకోవాలని కేసీఆర్‌కు పలుమార్లు చెప్పానన్నారు. ఎవరినైనా కొంటా.. ఏదైనా చేస్తా.. అనే అహంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. జవాన్లను కూడా కించ పరిచేలా కేసీఆర్ మాట్లాడారన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రధాని మోదీని తిట్టే హక్కు కేసీఆర్‌కు లేదని విజయశాంతి పేర్కొన్నారు.
* యూపీలో ప్రచారంతో హోరెత్తిస్తున్న ప్రియాంక
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ తన పట్టును నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అన్నీ తానై ఒంటరి పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.అందుకే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు.ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఆమె రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.రెండు రోజుల పాటు యూపీలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొంటారు ప్రియాంక గాంధీ. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు లాల్ గంజ్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు.
* వివేకా కేసు నిందితులే సీబీఐని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: బోండా ఉమ
వివేకా హత్య కేసు నిందితులే సీబీఐని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ పేర్కొన్నారు. వివేకా హత్య.. అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చేసిందేనని.. సీబీఐ స్పష్టంగా కోర్టుకు తెలిపిందన్నారు. వివేకా హత్యను గుండెపోటు అన్నామని వైసీపీ ఒప్పుకుంటోందన్నారు. హత్యను గుండెపోటు అని ఎలా అంటారని బోండా ఉమ ప్రశ్నించారు. సాక్ష్యాలను తారుమారు చేశామని వైసీపీనే చెబుతోందన్నారు. సీఎం జగన్ మార్చి 19, 2019న సీబీఐ విచారణ కావాలని హైకోర్టుకు వెళ్లారన్నారు. సీఎం అవ్వగానే ఫిబ్రవరి 6, 2020న కేసు వెనక్కి తీసుకున్నారన్నారు. కేసు వెనక్కి తీసుకున్నది అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు కాదా? అని బోండా ఉమ ప్రశ్నించారు
* ఛత్రపతి శివాజీ తరతరాలకు స్ఫూర్తి ప్రదాత : మోదీ
మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ తరతరాలకు స్ఫూర్తి ప్రదాత అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన అసాధారణ నాయకత్వం, సాంఘిక సంక్షేమం పట్ల ఆయన వైఖరి అనేక తరాల ప్రజలకు ప్రేరణనిస్తాయన్నారు. ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాల సందర్భంగా మోదీ శనివారం ట్విటర్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ దార్శనికతను, స్వప్నాన్ని సాకారం చేయడం కోసం తన ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సత్యం, న్యాయం విలువల కోసం ఆయన దృఢ వైఖరితో నిలిచారని కొనియాడారు. ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కూడా ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు నివాళులర్పించారు. మరాఠా యోధుడు, సుప్రసిద్ధ మహారాజు ఛత్రపతి శివాజీకి ఆయన జయంత్యుత్సవాల సందర్భంగా నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన సాటిలేని ధైర్యసాహసాలకు ప్రతీక అని, అసాధారణ యుద్ధ వ్యూహాలకు ప్రసిద్ధి చెందినవారని కొనియాడారు. ఆయన ఆధునిక భావాలుగల పరిపాలకుడని పేర్కొన్నారు. మాతృభూమి పట్ల ఆయన ప్రదర్శించిన ప్రేమాభిమానాలు ప్రతి భారతీయునికి ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు
* ఉత్తరాంధ్ర, సీమ ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తాం: సోమువీర్రాజు
రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు విమర్శించారు. ఉత్తరాంధ్ర, సీమ ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తామన్నారు. రైతులను, ప్రభుత్వాన్ని సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ మోసం చేస్తుందన్నారు. దళారులు, మిల్లర్లే కొంటున్నారన్నారు. సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌ను రద్దు చేయాలని సోమువీర్రాజు విమర్శించారు
* పల్నాడు జిల్లాకు గురజాలను హెడ్ క్వార్టర్ చేయాలి: యరపతినేని
పల్నాడు జిల్లాకు గురజాలను హెడ్ క్వార్టర్ చేయాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. నరసరావుపేటను హెడ్ క్వార్టర్‌గా ప్రకటిస్తే అనేక సమస్యలు వస్తాయన్నారు. పల్నాడుకు 900 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీకి పలు డిమాండ్లు వినిపించామన్నారు. కేంద్రంతోనే పల్నాడు అభివృద్ధి సాధ్యమన్నారు. తమ డిమాండ్లు పట్టించుకోకపోతే భవిష్యత్తులో న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు. పల్నాడు దెబ్బను తాడేపల్లి ప్యాలెస్‌కు కూడా చూపిస్తామన్నారు
* Viveka హత్య కేసు.. : నిజనిజాల వెలికితీతలో తగ్గేదే లేదు : మంత్రి బొత్స
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలన విషయాలన్నీ బయటికొస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే తాజాగా సీబీఐ వివేకానంద రెడ్డి ‘గుండెపోటుతో మరణించారు’ అని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డే తొలుత ప్రచారం చేశారని సీబీఐ తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దీంతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వైసీపీపై విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ కౌంటరిచ్చారు. ‘వివేకా కేసులో సమగ్ర విచారణ జరపాలని మేమే కోరాం. నిజనిజాల వెలికితీతలో తగ్గేదే లేదు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నారు. విద్యుత్ సమస్యపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయి. ఇళ్ల నిర్మాణం లెక్కల్లో టీడీపీ బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా..?. ఇళ్ల నిర్మాణంలో అవకతవకలను అచ్చెన్నాయుడు నిరూపించాలని నేను సవాల్ చేస్తున్నా. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. భోగాపురం విమానాశ్రయ భూముల కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలు బహిర్గతం చేస్తాం’ అని బొత్స చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
*సత్తెనపల్లిలో కోడెల శివరాం అరెస్ట్
టీడీపీ నేత కోడెల శివరాం పాదయాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సత్తునపల్లెలో పాదయాత్రకు సిద్ధమైన కోడెలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్రను అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేత రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కోడెల శివరాంను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరేచర్ల – కొండమోడు రోడ్డు విస్తరణ పనుల చేపట్టాలని డిమాండ్ చేస్తూ చంద్రన్న ఆశయ సాధన పేరుతో కోడెల శివరాం పాదయాత్రకు పూనుకున్న విషయం తెలిసిందే.
*లోకేశ్ ఓ డాష్ గాడు: ఎమ్మెల్యే ద్వారంపూడి
‘‘నన్ను ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనీ, టీడీపీ అధ్యక్షుడిని నారా చంద్రబాబు నాయుడు అని అంటారు.. అయితే నారా లోకేశ్‌ని నాయుడు అనాలో ఏమనాలో నాకైతే తెలియడం లేదు. అందుకే లోకేశ్… ఓ డాష్ గాడని సంబోధిస్తా’’ అని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అన్నారు. శుక్రవారం కాకినాడలోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘టీడీపీ తొత్తు, చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేసే పట్టాభి… కాకినాడ రైస్ ఎక్స్‌పోర్ట్‌లో అక్రమాలు జరుగుతున్నాయని పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్ వారి తొత్తులకు చెప్పాలి… జగన్మోహన్‌రెడ్డి గురించి కానీ, వైసీపీ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలి. లేనిపోని ప్రగల్భాలు పలకడం, తోక పత్రిక, తోక చానల్‌లో వేసుకోవడం చేస్తున్నారు. పట్టాభి అనే వాడు పోయినసారి కాకినాడ వస్తే బడితపూజ చేయాలని కొందరు మత్స్యకార నాయకులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు’’ అని ద్వారంపూడి వ్యాఖ్యానించారు.
*జమ్మూ-కశ్మీరులో ఎన్నికలు ఇక అక్టోబరులోనే?
జమ్మూ-కశ్మీరు శాసన సభ ఎన్నికలు అక్టోబరు-నవంబరుల్లో జరిగే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడానికి గడువును మరో మూడు నెలలపాటు పొడిగించబోతున్నట్లు తెలుస్తోంది. శాసన సభ, లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్వ్యవస్థీకరించేందుకు 2020లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. నిర్ణీత గడువు మార్చిలోగా ఈ ప్రకియ పూర్తయ్యేలా కనిపించడం లేదు.డీలిమిటేషన్ కమిషన్ తన రెండో ముసాయిదా నివేదికను ఫిబ్రవరి 5న ఐదుగురు సహచర జమ్మూ-కశ్మీరు సభ్యులకు అందజేసింది. వీరు తమ అభ్యంతరాలను సమర్పించారు. ఇక ఈ ముసాయిదాను ప్రజల ముందు ఉంచుతారు. ప్రజలు తమ సూచనలు, అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఈ కసరత్తును పూర్తి చేయడానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉంది. ఈ కసరత్తు మార్చినాటికి పూర్తయితే శాసన సభ ఎన్నికలు జూన్, జూలై నెలల్లో జరిగి ఉండేవి. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డీలిమిటేషన్ కమిషన్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తే, ఎన్నికలు కూడా వాయిదా పడతాయి. బహుశా అక్టోబరు లేదా నవంబరు నెలల్లో ఎన్నికలు జరగవచ్చు.
*కళ్లు మూసుకుని జిల్లాల విభజన: సోమిరెడ్డి
సీఎం జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలో కూర్చొని కళ్లు మూసుకొని జిల్లాలను విభజిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మేం జిల్లాల విభజనకు వ్యతిరేకం కాదు. అయితే పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపాదికన కాదు. రాష్ట్రంలో ఎనిమిది పెద్ద జిల్లాలు ఉన్నాయి. అవసరమైతే వాటిని విభజించాలే తప్ప ఒకే ప్రాంతంగా ఉన్న ఐదు చిన్న జిల్లాలను విభజించడం సహేతుకం కాదు’’ అని అన్నారు
*వైసీపీ హయాంలోనే ఆదాయం ఎక్కువ- 1,25,995 లక్షల కోట్లు అధికంగా వచ్చాయి: యనమల
‘‘తెలుగుదేశం ప్రభుత్వ తొలి మూడేళ్ల ఆదాయంతో పోలిస్తే వైసీపీ హయాంలో తొలి మూడేళ్ల ఆదాయం రూ.1,25,995 లక్షల కోట్లు ఎక్కువ. మా హయాంలో తొలి మూడేళ్లలో రూ.1,65,507 కోట్లు వస్తే… వైసీపీ మూడేళ్లలో రూ.2,52,369 కోట్లు వచ్చింది. కేంద్ర నిధులు కూడా కలిపితే మా హయాంలో తొలి మూడేళ్లలో రూ.3,18,716 కోట్లు వస్తే… వైసీపీ మూడేళ్లలో రూ.4,44,711 కోట్లు వచ్చింది. అంటే కొవిడ్ ప్రభావం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందనేది అర్థమవుతూనే ఉంది. అయినా అభివృద్ధిలో, వివిధ శాఖల పురోగతిలోను మాత్రం అట్టడుగున ఉంది’’ అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఆయన శుక్రవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు
*కాంగ్రెస్కు జగ్గారెడ్డి గుడ్బై?
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఆ పార్టీకి గుడ్బై చెప్పనున్నట్లు సమాచారం. తాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరం అవుతున్నదీ వివరిస్తూ.. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉంది. తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి సొంతంగా పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా.. కాంగ్రె్సను వీడాక తాను ఏ పార్టీలోనూ చేరేది లేదని, స్వతంత్రంగానే వ్యవహరిస్తాననీ తన సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియాగాంధీ కుటుంబంపైన మొదటి నుంచీ తన విధేయతను ప్రకటిస్తూ వస్తున్న జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్రెడ్డి నియామకం పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
*అభిషేక్ బెనర్జీకి మళ్లీ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని మళ్లీ నిలబెట్టుకున్నారు. మమతా బెనర్జీ నివాసంలో టీఎంసీ నేషనల్ వర్కింగ్ కమిటీ శుక్రవారంనాడు సమావేశమైంది. మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సమారు గంటసేపు జరిగింది. జాతీయ రాజకీయలను దృష్టిలో ఉంచుకుని పార్టీ పదవులను ఈ సమావేశంలో కేటాయించారు
* పేదల బియ్యాన్నీ మింగేస్తున్నారు: పట్టాభి
‘‘పేదల రూపాయి బియ్యం బొక్కేసిన వైసీపీ పెద్దలు రూ.5 వేల కోట్ల లూటీకి పాల్పడ్డారు. దొంగ బియ్యం డాన్గా పేరొందిన కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి, బూతుల మంత్రి కొడాలి నానిని వ్యాపార భాగస్వామిగా చేర్చుకుని, పేదల బియ్యాన్ని పందికొక్కుల కంటే దారుణంగా మింగేస్తున్నారు’’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. పేదలకు దక్కాల్సిన రూపాయి బియ్యాన్ని వైసీపీ నేతలు దారిమళ్లించి విదేశాలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు కేంద్రంగా ఈ దందా నడుస్తోందన్నారు. వైసీపీ రేషన్ డాన్లు, అంతర్జాతీయ రైస్ స్మగ్లర్లుగా మారారని విమర్శించారు. ఏపీలో రేషన్ బియ్యం స్కామ్ దేశంలోనే అతి పెద్దదన్నారు
* సునీతకు టికెట్ ఇచ్చి.. వైఎస్ కుటుంబాన్ని చీల్చే వ్యూహం: సజ్జల
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన చార్జిషీటులో సీబీఐ పచ్చి అబద్ధాలను వండివార్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దానిని తీసుకుని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి శిక్ష వేయాలని తీర్మానం చేసేరకంగా చంద్రబాబు మాట్లాడారని దుయ్యబట్టారు. ‘సునీతమ్మను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలి.. వైఎస్ కుటుంబాన్ని ఎలాగోలా చీల్చాలి.. నేరాన్ని కుటుంబం మీదే తోసేయాలి. ఇదీ చంద్రబాబు వ్యూహం. ఈ నిజాలన్నీ బయటకు రావాలి. వీటన్నిటినీ విస్మరించి అవినాశ్ను ఎందుకు ఇరికించాలని అనుకుంటున్నారో అందరికీ అర్థమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుది కుట్రల స్వభావమని.. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని.. లోకేశ్ కూడా పనికి రాకుండా తయారయ్యారని విరుచుకుపడ్డారు
* కాంగ్రెస్, ఆప్ కలిసి 25 సీట్లు గెలవలేవు: సుఖ్బీర్ సింగ్ బాదల్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి 25 సీట్లు కూడా గెలవలేవని శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ అన్నారు. ఇక ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా పెద్ద ఎత్తున చేయడమే కాకుండా దళిత-బలహీన వర్గాలను కాంగ్రెస్ పీడించిందని ఆరోపించిన ఆయన.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పది సీట్లు కూడా గెలవలేదని జోస్యం చెప్పారు. పంజాబీలు తనను వ్యతిరేకిస్తున్నట్లు కేజ్రీవాల్ గ్రహించారని, అయితే దాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైరి పార్టీలపై నిందలు మోపుతున్నారని సుఖ్బీర్ సింగ్ బాదల్ అన్నారు.