ఒకవైపు.. మహిళలు, గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. మరోవైపు.. అడవినిండా ఇప్పచెట్లే. విరగకాసే ఆ పూలకు రక్తహీనతను నివారించే ఔషధ గుణాలున్నాయి. సమస్య అడవిలో ఉంది. పరిష్కారమూ అడవిలోనే ఉంది. ఆదివాసీ మహిళా సంఘాలతో ఇప్పపూల లడ్డూలు చేయించి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్నవారికి పంచుతున్నారు అధికారులు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులను చాలా కాలం నుంచీ రక్తహీనత వేధిస్తున్నది. సాధారణంగా రక్తంలో హిమోగ్లోబిన్ 11 శాతం ఉండాలి. గిరిజన మహిళల్లో కనాకష్టంగా ఏడు శాతమే కనిపిస్తుంది. ఫలితంగా తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో గిరిజన మహిళలకు ఇప్పపూల లడ్డూలు ఇవ్వాలని సూచించింది జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్). కానీ, అన్ని లడ్డూలు ఎక్కడినుంచి వస్తాయి? ఐటీడీఏ అధికారులు రూ.25 లక్షలతో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘంతో ఓ ఆహార కేంద్రాన్ని ఏర్పాటుచేయించారు. సంఘంలోని మహిళలకు లడ్డూతోపాటు ఇప్పపూలతో వివిధ ఆహార పదార్థాల తయారీలో శిక్షణ ఇప్పించారు. వీరు తయారుచేసిన లడ్డూలలో పోషక విలువలను బేరీజు వేసేందుకు హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థకు పంపారు. ఆ నాణ్యతా ప్రమాణాలు శాస్త్రవేత్తలనూ అబ్బుర పరిచాయి. రుచి కోసం లడ్డూలో బాదం, జీడిపప్పు కూడా జోడిస్తున్నారు.
**ప్రయోగాత్మకంగా
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలలోని వివిధ గ్రామాల్లో మూడువేల మందికి మొదటి విడతగా ఇప్పపూల లడ్డూలు పంపిణీ చేశారు. అంతకుముందే ఆ గర్భిణుల నుంచి రక్త నమూనాలు సేకరించి హిమోగ్లోబిన్ 7 నుంచి 8 శాతం ఉన్నట్లు గుర్తించారు. తర్వాత రోజుకొకటి చొప్పున 45 రోజులపాటు లడ్డూలు ఇచ్చారు. ఆతర్వాత మళ్లీ ఒకసారి పరీక్షలు చేశారు. లడ్డూలు తీసుకున్న గర్భిణుల్లో సగటున 1.4 శాతం హిమోగ్లోబిన్ పెరిగినట్లు నిర్ధారణ అయ్యింది. ‘గిరిజనుల్లో రక్త హీనత నివారించడానికి ఇప్పపూల లడ్డూలను పంచాలని సూచించారు శాస్త్రవేత్తలు. దీంతో పన్నెండు మంది మహిళలతో ఒక సంఘంగా ఏర్పడ్డాం. లడ్డూలు తిన్న గర్భిణుల్లో రక్తవృద్ధి బాగుంది. మాకూ ఉపాధి లభించింది’ అంటారు సహకార సంఘ అధ్యక్షురాలు బాగుబాయి. ప్రాథమిక ఫలితాలు పాలన యంత్రాంగానికి ఉత్సాహాన్ని ఇచ్చాయి. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేపట్టనున్నారు.
**లడ్డూలతో మంచి ఫలితాలు..
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 3 వేల మందికి.. రోజుకు ఒకటి చొప్పున ఇప్పపూల లడ్డూలు పంపిణీ చేస్తున్నాం. 45 రోజుల తర్వాత గర్భిణులకు రక్త పరీక్షలు నిర్వహించాం. వారిలో సగటున 1.4 శాతం హిమోగ్లోబిన్ పెరిగింది. జిల్లావ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో లడ్డూలను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.