సామాజిక చైతన్యానికి వేదికలు గ్రంథాలయాలు. సాంకేతికత వల్ల గ్రంథాలయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఇ-లైబ్రరీల ( e- library ) కాలం వచ్చేసింది. కానీ.. ఆన్‌లైన్‌లో ఎంత చదివినా, లైబ్రరీలో లభించే అక్షరానుభూతే వేరు. కాబట్టే, గ్రంథాలయాన్ని కొత్త తరానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాడు పూర్ణ నాగుల.
***సిరిసిల్లకు చెందిన నాగుల రామస్వామి, సూర్యమ్మ దంపతుల బిడ్డ పూర్ణచందర్. రామస్వామికి చదువు విలువ తెలుసు. కాబట్టే, డబ్బులు లేకున్నా బంగారాన్ని తాకట్టు పెట్టి పిల్లలను చదివించాడు. పూర్ణ కూడా తండ్రి మార్గాన్నే ఎంచుకున్నాడు. యువతకు దిశా నిర్దేశం చేసేందుకు సిరిసిల్లలో ‘అక్షర చైతన్యం ( Akshara Chaitanyam )’ అనే గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఆ ప్రయత్నం వృథా కాలేదు. మొబైల్ ఫోన్లతో కాలాన్ని వృథా చేసుకుంటున్న ఎంతోమందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాడు. గ్రంథాలయం అనగానే నవలలు, కథా సంకలనాలు, వార్తా పత్రికలు మాత్రమే ఉంటాయని అనుకుంటే పొరపాటే. అక్షర చైతన్యం లైబ్రరీలో.. ఐదో తరగతి నుంచి ఐఏఎస్ వరకు, ఐటీఐ నుంచి ఎంబీఏ వరకు అన్ని పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు లభిస్తాయి. అలాగనీ ఇదేం కోచింగ్ సెంటర్ కాదు. యువత లక్ష్య సాధనకు ఉపకరించడమే దీని లక్ష్యం. సివిల్స్, గ్రూప్స్, ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలు.. ఇలా ఏదో ఒక లక్ష్యంతో అక్షర చైతన్యం లైబ్రరీకి వస్తారు జనం. దీని వెనక ఎనిమిదేండ్ల శ్రమ దాగివుంది. చదువు పూర్తయిన తర్వాత పూర్ణ అమెరికా వెళ్లాడు. అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసి మళ్లీ హైదరాబాద్ తిరిగివచ్చాడు. అమెరికాలో ఉన్నా ఆ యువకుడి ఆలోచనలు సిరిసిల్ల గురించే.
**1,200 పుస్తకాలతో
లైబ్రరీ ( Library ) అంటే తన దృష్టిలో నవలలు, కథలు మాత్రమే కాదు. ఆ నాలుగు గోడల మధ్య తెలియని విషయాలు తెలుసుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. సమాచార నిధిగా ఉపయోగపడాలి. వాస్తవానికి తన దగ్గర గ్రంథాలయం నెలకొల్పేంత డబ్బు లేదు. కానీ ధైర్యం చేశాడు. రూ.50 వేలు ఖర్చుపెట్టి తొలుత ఒక చిన్న గదిలో ఏర్పాటుచేశాడు. అప్పట్లో 1,200 పుస్తకాలు ఉండేవి. హైదరాబాద్‌లో ఉండటం వల్ల పూర్ణచందర్‌కు లైబ్రరీని చూసుకోవడం కష్టమైంది. దీంతో ప్రత్యేకించి ఓ ఉద్యోగిని నియమించాడు. ఆ లైబ్రరీకి వెళ్లి చదువుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందేమోనని చాలామంది వెనుకడుగు వేసేవారు. క్రమంగా పూర్ణ మనసు అర్థమైంది. కొంతమంది మిత్రులు ఆర్థిక సహకారం కూడా అందించారు. ‘ఇది మన లైబ్రరీ. దీనిని ఎంత సమర్థంగా వాడుకుంటే అంత ప్రయోజనం. వాడుకోవడమే కాదు, కాపాడుకోవడమూ మన పనే..’ అంటూ విద్యార్థులకు అవగాహన కల్పించాడు. నిపుణులను, ఉద్యోగార్థులను ఓ వేదిక మీదికి తెచ్చి.. గ్రంథాలయాన్ని స్ఫూర్తికేంద్రంగా తీర్చిదిద్దాడు. ‘బాగా చదువుకున్న వాళ్లు కూడా సరైన కెరీర్ గైడెన్స్ లేకపోవడం వల్ల చిన్నచిన్న ఉద్యోగాల్లో స్థిరపడుతుంటారు. సాధారణమైన చదువులే అయినా కెరీర్ గైడెన్స్‌తో స్పష్టమైన అవగాహన పెంచుకుని ఉన్నత స్థానాలకు వెళ్లినవారూ ఉన్నారు. నా లక్ష్యం కూడా ఇదే’ అంటాడు నాగుల పూర్ణ.
**ప్రారంభం ఇలా..
అమెరికా వెళ్లకముందు పూర్ణ సిరిసిల్లలో ఒక సెమినార్ నిర్వహించాడు. యువతలో మార్పు తీసుకురావాలి, లక్ష్యం వైపు మళ్లించాలి.. అనే ఉద్దేశంతో దీన్ని రూపొందించాడు. సైకాలజిస్టులు వీరేందర్, వర్లు, న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్ వంటివారితో ఉపన్యాసాలు ఇప్పించాడు. రెండు రోజులూ కలిపి రెండున్నర వేలమంది వచ్చారు. అప్పుడే, యువతలో స్ఫూర్తి నింపడానికి ఓ శాశ్వత వేదిక ఉంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అమెరికాలో ఉన్నంతకాలం దీని గురించే ఆలోచించేవాడు. తిరిగి వచ్చాక, 2014 జనవరి 14వ తేదీన సిరిసిల్లలో ‘అక్షర చైతన్య లైబ్రరీ ఆఫ్ హ్యూమన్ అండ్ ఎడ్యుకేషన్’ను స్థాపించాడు.