Movies

గంగూబాయ్‌… గొప్ప ప్రయత్నం!

గంగూబాయ్‌… గొప్ప ప్రయత్నం!

అలియాభట్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘గంగూబాయ్‌’. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఈనెల 25న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అలియా మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు వేరు. ‘గంగూబాయ్‌’ వేరు. నటిగా నన్ను సంపూర్ణంగా మార్చిన సినిమా ఇది. నేను నేర్చుకున్నవన్నీ పక్కన పెట్టి, కొత్తగా నటించాను. సాధారణంగా ఏ సినిమా చేసినా, ఏ పాత్ర నా చేతికి ఇచ్చినా, ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకుంటా. అప్పుడే నటన సులభం అవుతుంది. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు సెట్లో ఖాళీ బుర్రతో అడుగుపెట్టేదాన్ని. సంజయ్‌ లీలా భన్సాలీ ఏం చేబితే అదే చేసేదాన్ని. నేను గంగూబాయ్‌ పాత్రలోకి వెళ్లడం కాదు. తనే నన్ను ఆవహించేసింది. సెట్లో నాకు నేను పూర్తిగా కొత్తగా కనిపించేదాన్ని. సినిమా పూర్తయ్యాక కూడా ఆ పాత్ర నన్ను వెంటాడింది. కథా పరంగా చూసినా, సాంకేతికంగా చూసినా ‘గంగూబాయ్‌’ గొప్ప ప్రయత్నం. కరోనా వల్ల చాలామంది థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. వాళ్లందరినీ మళ్లీ థియేటర్లకు తీసుకొచ్చే చిత్రం ఇది. నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంద’’న్నారు.