ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వచ్చేనెల 4 వరకు 11 రోజులపాటు జరిగే ఉత్సవాలకు వేదపండితులు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ రాత్రి 7 గంటలకు ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజారోహణం, ధ్వజపటావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో బుధవారం నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అధికారులు వసతి ఏర్పాటు పూర్తిచేశారు. భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో దర్శనం టిక్కెట్లును అధికారులు విడుదల చేశారు. అతి శీఘ్ర దర్శనం టికెట్లు రూ.500 ,శీఘ్ర దర్శనం రూ.200 , ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచారు.
వాహన సేవలు
*ఫిబ్రవరి 23- భృంగి వాహన సేవ
*ఫిబ్రవరి 24- హంస వాహన సేవ
*ఫిబ్రవరి 25- మయూర వాహన సేవ
*ఫిబ్రవరి 26- రావణ వాహన సేవ
*ఫిబ్రవరి 27- పుష్పపల్లకీ వాహన సేవ
*ఫిబ్రవరి 28- గజ వాహన సేవ
*మార్చి 1- ప్రభోత్సవం, నందివాహన సేవ, లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం
*మార్చి 2- రథోత్సవం, తెప్పోత్సవం
*మార్చి 3- పూర్ణాహుతి
*మార్చి 4- అశ్వవాహన సేవ
2. కపిలేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతిలోని కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కొవిడ్ – 19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించనున్నారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవారు, వినాయక స్వామి, చండికేశ్వరస్వామి, శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 8.10 గంటలకు మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి కంకణభట్టర్‌గా వ్యవహరించారు.
****ధ్వజస్తంభానికి విశేష అభిషేకం
ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి ఇచ్చారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు. ఉత్సవాలను కొవిడ్ నిబంధన మేరకు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. అనంతరం కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి ఆలయంలో పల్లకీ ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు
3. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. ఆదివారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
4. సర్వదర్శనానికి నాలుగు రోజుల సమయం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా రోజుకు 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం టోకెన్లు పొందిన భక్తులకు ఈ నెల 24వ తేదీ దర్శనం లభిస్తోంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుని తిరుపతికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
5. ఫిబ్రవరి 23న ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్ల అదనపు కోటా విడుదల
ఫిబ్రవరి 23న మార్చి నెల కోటా విడుదల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13,000 చొప్పున రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నుండి టిటిడి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
అదేవిధంగా, ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు కేటాయిస్తారు. కాగా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవరి 23న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.అదేవిధంగా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని కౌంటర్ల ద్వారా కేటాయిస్తారు.
6. తిరుమల శ్రీవారి భక్తులకు షాక్
ఇది వరకు వున్న శ్రీ వారి సేవ రేట్లు ఇప్పుడు కొత్త రేట్లు ఇలా చూడండి
1)సాధారణ సుప్రబాత సేవ 120/-
సిఫార్సు లేఖ 240/-
కొత్తరేటు 2000/-
2)సాధారణ తోమాల సేవ 220/-
సిఫార్సు లేఖ 440/-
కొత్త రేటు 5000/-
3) కళ్యాణోత్సవం 1000/-
కొత్త రేటు 2500/-
4) వేద ఆశీర్వచనం 3000/-
కొత్త రేటు 10500/-
5) వస్త్రాలంకరణ సేవ 50000/-
కొత్త రేటు 100000/-
6) శ్రీ వాణి సేవ టికెట్ రేటు 10500/- ఇందులో టికెట్ రేటు 500/-
మిగతా 10000/- జగన్ టాక్స్
7. పూరీ వెళ్లే భక్తులకు గమనిక.. టీకా సర్టిఫికెట్‌పై కీలక నిర్ణయం
ఇకపై పూరీ జగన్నాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు టీకా సర్టిఫికెట్, కోవిడ్ నెగెటివ్ రిపోర్టు అవసరం లేదని ఆలయ పాలక వర్గం ప్రకటించింది. కరోనా కేసులు భారీగా తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక పై ఆదివారం మినహా ఇతర రోజుల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. భక్తులు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని వెల్లడించారు.
8. దుర్గమ్మను దర్శించుకున్న సాయిధరమ్ తేజ్..
హీరో సాయిధరమ్ తేజ్ కుటుంబ సమేతంగా సోమవారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాలను, శేషవ్రస్తాలను బహూకరించారు. ఎప్పుడూ విజయవాడ వచ్చిన తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటానని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. చాలా ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగిందన్నాడు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకొని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నట్లు సాయిధరమ్‌తేజ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
9. మార్చి 4 నుంచి యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి 14వరకు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 4వ తేదీన స్వస్తివాచనం, అంకురారోపణం నిర్వహించనున్నారు. 5నుంచి 9వరకు ధ్వజరోహణం, దేవతాహ్వానం, వేదపారాయణ, హవన, అలంకార సేవలు నిర్వహించనున్నారు. 10వ తేదీన ఎదుర్కోలు, 11న లక్ష్మీ నరసింహస్వామి తిరు కల్యాణోత్సవం, 12న దివ్య విమాన రథోత్సవం, 13న పూర్ణాహుతి, చక్రతీర్థం, డోలోత్సవం నిర్వహించనున్నారు. 14వ తేదీన శతఘాటాభిషేకంతో ఉత్సవసమాప్తి అవుతుంది. బ్రహ్మోత్సవాలను ఈ సంవత్సరం ఆస్థానపరంగా నిర్వహించనున్నారు. ప్రతీసారి అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం దేవస్థానం నిర్వహిస్తోంది. అయితే మార్చి 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ పూజలు నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఒకే నెలలో వరుస వేడుకలు నిర్వహించాల్సిన నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఆస్థానపరంగా బాలాలయ గడపలోనే నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
10. ఫిబ్రవరి 23న ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్ల అదనపు కోటా విడుదల
శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13,000 చొప్పున రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్ినం టికెట్లను ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నుండి టిటిడి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. అదే విధంగా, ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు కేటాయిస్తారు.కాగా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవరి 23న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.అదేవిధంగా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని కౌంటర్ల ద్వారా కేటాయిస్తారు.
11. ఉర్వారుక మివ బంధనం అంటే…………!!
* ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు.
*‘త్య్రంబకం యజామహే…’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే.
‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో…ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ మంత్రం బోధిస్తుంది. వాటికి, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుక మివ బంధనం’లా ఉండాలంటుంది.
*పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు. పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు. దోసపండు మిగలముగ్గేనాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది. అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది. ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ‘దేహం వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం. ‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది. మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది. అందుకే దాన్ని ‘ జీవన్ముక్తి ’ అంటారు.
12. తిరుమల సమాచారం 22-02-22 మంగళవారం
నిన్న 21-02-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 39,619 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,846 మంది…నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.40 కోట్లు .