DailyDose

ప్రకాశ్ రాజ్‌కు సీఎం కేసీఆర్ బంపరాఫర్…?

ప్రకాశ్ రాజ్‌కు సీఎం కేసీఆర్ బంపరాఫర్…?

సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్న ప్రకాశ్ రాజ్‌కు సీఎం కేసీఆర్ బంపరాఫర్ ఇచ్చారా? ప్రకాశ్ రాజ్‌కు ఎవరూ ఊహించని పదవి దక్కనుందా? విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారా? ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. ఇటీవలే రాజ్యసభ సభ్యుడు బండి ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. జూన్‌లో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, శ్రీనివాస్‌ల పదవీ కాలం ముగియనుంది. ఈ మూడు ఖాళీలకు ఒకేసారి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. ఈ ఖాళీల్లో ఒక సీటు ప్రకాశ్ రాజ్‌కు కేటాయించి టీఆర్ఎస్ తరఫున ఢిల్లీ రాజకీయాల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలను ఏకంచేసే బాధ్యతలు కూడా ప్రకాశ్ రాజ్‌కు అప్పగిస్తారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర పర్యటనలో ప్రకాశ్ రాజ్ సడన్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన రోల్‌పై టీఆర్ఎస్‌లో ఊహాగానాలు జోరందుకున్నాయి.