హైదరాబాదీ మూలాలున్న ముద్దుగుమ్మ అదితి రావ్ హైదరీ! రచ్చ గెలిచి, ఇంట్లో వాళ్ల మనసునూ గెలిచిన ఈ సుందరిలో సృజనాత్మకత కూడా ఎక్కువే. విభిన్నపాత్రలతో అలరిస్తున్న అదితి తను ధరించే దుస్తులు, నగలూ వినూత్నంగా ఉండాలని కోరుకుంటుంది. ఫ్యాషన్ విషయంలో పాతదనానికి తొలి ప్రాధాన్యం ఇస్తానంటున్న ఆమె, సినిమాల విషయంలో కొత్తదనానికి స్వాగతం పలకాలని చెబుతున్నది.
*పాతదనం అంటే నాకు ఇష్టం. శాస్త్రీయ విషయాలపై ఆసక్తి ఎక్కువ. భారతీయ హస్తకళలంటే మక్కువ. ముఖ్యంగా దుస్తుల విషయంలో సంప్రదాయ వస్త్రధారణకే నా తొలి ప్రాధాన్యం. అదే సమయంలో విభిన్న వస్త్రధారణ అన్నా ఇష్టమే. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఏ పని చేసినా, ఏ దుస్తులు ధరించినా ముందుగా అవి నా సొంతం అన్న అభిప్రాయం కలగాలి. అప్పుడే ఆస్వాదించగలుగుతాను.ఆభరణాలు అంటే ఇష్టపడని మహిళలు ఉంటారా! నాకూ నగలంటే మక్కువ. ఆభరణాలు అతివ అందాన్ని ఇనుమడింపజేస్తాయి. రత్నాలు, ముత్యాలు పొదిగిన జువెలరీ నాకు బాగా నప్పుతాయని అనిపిస్తుంది. ముఖ్యంగా పాపిటబిళ్ల, చెవి దుద్దులు, ముక్కుపుడక.. ఇలా ముఖాన్ని అట్టి పెట్టుకొని ఉండే నగల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాను. డిజైన్, సైజు, వాటిలో పొదిగిన రాళ్లు ఇవన్నీ చూసి, నచ్చితేనే ఎంపిక చేసుకుంటాను.
హైదరాబాద్‌లో ఉన్నా, చెన్నైలో ఉన్నా.. ఎక్కడున్నా ఒంటరిగా భావించను. భాష, ప్రాంతం కన్నా మానవీయ కోణమే అందరినీ ఒక్కటి చేస్తుందని నమ్ముతాను. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం ఇలా విభిన్న భాషలకు చెందిన సినిమాల్లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. రకరకాల దర్శకులతో పనిచేయడం ఒక చాలెంజ్‌గా తీసుకుంటాను.హిందీ, తెలుగుతోపాటు, తమిళం కూడా అనర్గళంగా మాట్లాడగలను. ఏదైనా భాష నేర్చుకోవడానికి ఏవేవో చదవాల్సిన అవసరం లేదు. వినడం వల్ల తేలిగ్గా నేర్చుకోగలం. నేను ఆ సూత్రాన్నే పాటించాను. ఇప్పుడంతా ఓటీటీ రాజ్యం నడుస్తున్నది. నాకూ ఆ ప్లాట్‌ఫామ్ అంటే ఇష్టం. ఓటీటీల్లో విభిన్నమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రజలకు అందుతున్నాయి. సృజనాత్మక రచయితలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు ఓటీటీ చక్కటి వారధిగా నిలుస్తున్నది.