న్యూయార్క్ నగరంలో రాజస్థానీ నృత్యాలు, పాటలతో ప్రవాస భారతీయులు పరవశించిపోయారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను భారత కాన్సులేట్ అధికారులు 2022 ఫిబ్రవరి 21న న్యూయార్క్ నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్‌లో భాగంగా రాజస్థానీ సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా లతా మంగేష్కర్ ఆలపించిన రాజస్థానీ గతంలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు వచ్చిన వారిని ఉద్దేశించి కౌన్సుల్ జనరల్ రణ్‌ధీర్ జైస్వాల్ ప్రసంగించారు. మాతృభాష గొప్పతనాన్ని సభికులకు వివరించారు. రాజస్థానీ సంగీతం , కళలు సంస్కృతి విశిష్టతలను ఎన్నారై జైపూర్ విభాగం తరఫున ప్రేమ్ భండారీ వివరించారు.
గూంగర్ డ్యాన్సులతో, రాజస్థానీ పద్యాలతో వేడుకలు జరుగుతున్న ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ కార్యక్రమాన్ని కేవలం రాజస్థానీలకే పరిమితం చేయకుండా అమెరికాలో ఉన్న వివిధ రాష్ట్రాలు, వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలను భాగస్వాములను చేశారు. భారత్‌కే ప్రత్యేకమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించారు. భారతీయ భాషల గొప్పదానాన్ని చాటిచెబుతూ కాన్సులేట్ అధికారులు ఇప్పటికే రాజస్థానీ, తమిళ్ భాషలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలో మరో ఏడు భాషలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని వివరించారు.