అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ’దఢక్’ చిత్రంతో బీ టౌన్‌లోకి రంగప్రవేశం చేసింది. ‘గుంజన్ సక్సేనా’, ‘కార్గిల్ గాళ్’ వంటి సినిమాల్లో నటించి అభిమానులను మెస్మరైజ్ చేసింది. శ్రీదేవి చనిపోయి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో జాన్వీ ఓ పోస్ట్ పెట్టింది. తన తల్లితో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
‘‘నా జీవితంలో ప్రస్తుతం నువ్వు లేకున్నా.. ఇన్ని సంవత్సరాలు నీ జ్ఞాపకాలతోనే గడిపాను. నా పక్కన నువ్వు లేకుండానే మరో ఏడాదిలోకి అడుగుపెట్టాను. అందువల్ల ఈ ఏడాదిని కూడా అసహ్యించుకుంటాను. అయితే.. జీవితంలో నేను ఉన్నత శిఖరాలను అధిరోహించి నువ్వు గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నాను. లవ్ యూ అమ్మ’’ అని జాన్వీ కపూర్ పోస్ట్ పెట్టింది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ సైతం తన తల్లితో చిన్నప్పుడు తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శ్రీదేవి బాత్ టబ్‌లో పడి 2018, ఫిబ్రవరి 24న దుబాయ్‌లో మరణించిన సంగతి తెలిసిందే.