మనం రోడ్డుకు ఏ వైపు నుంచి వెళ్తాం? ఇదేం ప్రశ్న! ఎడమ వైపు నుంచే వెళ్తాం కదా అని అంటారా !! అవును నిజమే. మనం ఎడమ వైపు నుంచే వెళ్తాం.. కానీ అదే అగ్రరాజ్యం అమెరికా వెళ్లారనుకోండి !! ఇలాగే ఎడమ వైపు నుంచి వెళ్తా అంటే కుదరదు. అమెరికాలోనే కాదు ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్ వంటి చాలా దేశాల్లో కుడి వైపు నుంచి వెళ్తుంటారు. ఆ దేశాల్లో కారు డ్రైవింగ్ సీటు కూడా మనలా కుడి వైపు కాకుండా.. ఎడమవైపు ఉంటుంది. ఈ విషయం తెలియక ఇక్కడ వెళ్లినట్టే ఎడమ వైపు నుంచే వెళ్తే ప్రమాదాలు తప్పవు. అసలు ఈ కుడి, ఎడమ గోల ఏంటి? అందరూ ఒకే వైపు నుంచి వెళ్లకుండా.. కొన్ని దేశాల్లో ఎడమవైపు నుంచి, మరికొన్ని దేశాల్లో కుడి వైపు నుంచి ఎందుకు వెళ్తున్నారు? డ్రైవింగ్ విషయంలో అసలు ఎందుకింత గందరగోళం మొదలైందో ఒకసారి చరిత్ర వెనక్కి వెళ్లి తెలుసుకుందాం..
*పూర్వం అందరూ ఎడమ వైపు నుంచే..
పూర్వం రాజుల కాలంలో అందరూ ఎడమ వైపు నుంచే వెళ్లేవారు. అలా ఎడమ వైపు నుంచే వెళ్లడానికి కారణం కూడా ఉంది. అదేంటంటే.. అప్పట్లో సాధారణ ప్రజలు నడుచుకుంటూ వెళ్లేవారు. సైనికులు మాత్రమే గుర్రాల మీద వెళ్లేవారు. యుద్ధ సమయంలో కూడా గుర్రంపై వెళ్లి శత్రువులపై దాడి చేసేవారు. ఆ సమయంలో కత్తిని కుడి చేత్తో సులభంగా తీసేందుకు వీలుగా కత్తి ఒరను ఎడమ వైపు ఉంచుకునేవాళ్లు. కాబట్టి ఎడమ వైపు ఉండి.. కుడి కాలితో గుర్రం ఎక్కడానికి అనువుగా ఉండేది. అందుకే సైనికులు తమకు అనుకూలంగా ఉండేలా గుర్రాలను ఎడమ వైపు నుంచి నడిపించేవారు. కాలక్రమంలో సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా గుర్రాలకు అలవాటుపడ్డారు. గుర్రపు బండిపై ప్రయాణాలు చేయడం మొదలుపెట్టారు. వాళ్లు కూడా సైనికుల మాదిరిగానే ఎడమ వైపు నుంచి వెళ్లేవారు. క్రీ.శ.1300లో రోమ్‌ను సందర్శించేందుకు వచ్చే భక్తులందరూ ఎడమ వైపు నుంచే వాహనాలను నడపాలని పోప్ బెనిఫేస్ 8 నిబంధన విధించాడని చరిత్రకారులు చెబుతున్నారు.
*కుడి వైపు ఎందుకు మారాల్సి వచ్చింది..
క్రీ.శ.1700 నాటికి ఫ్రాన్స్‌లో రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందింది. ప్రయాణాల కోసం మాత్రమే కాకుండా సరకుల రవాణా కోసం కూడా గుర్రపు బండ్ల వాడకం పెరిగింది. అయితే సరుకుల రవాణా కోసం గుర్రాలకు చెక్కతో చేసిన పెద్ద డబ్బాలను కట్టేవారు. అయితే అందులో గుర్రపు బండి నడిపే వ్యక్తి కోసం ప్రత్యేకంగా ప్లేస్ ఏమీ ఉండేది కాదు. ఎడమ వైపు ఉండే గుర్రంపై కూర్చొని కుడి చేత్తో కొరడా పట్టుకుని బండిని నడిపించేవారు. దీంతో బండి నడిపే వ్యక్తి రోడ్డుకు పూర్తి ఎడమ వైపు కావడం.. వెనుకాల సరకుల డబ్బా ఉండటంతో వెనుక నుంచి వచ్చే బండ్లను గమనించడం కష్టంగా మారింది. అందుకే వెనుక నుంచి వచ్చే బండ్లను గమనించేందుకు వీలుగా కుడివైపు నుంచి బండ్లను తోలేవారు. బండి కుడివైపు నుంచి వెళ్లడంతో దాన్ని నడిపే వ్యక్తి రోడ్డు మధ్యలో ఉండేవాడు. అప్పుడు వెనుక నుంచి వచ్చే బండ్లను గమనించడం సులువుగా ఉండేది. అయితే మామూలు గుర్రాలు ఎడమ వైపు నుంచి, గుర్రపు బండ్లు కుడి వైపు నుంచి వెళ్లడంతో అంతా గందరగోళంగా మారింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు అందరూ కుడి వైపు నుంచే వెళ్లాలని 1792లో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ దీన్ని చట్టంగా మార్చారు.
**బ్రిటన్ మాత్రం ఒప్పుకోలేదు..
18వ శతాబ్దం నాటికి ఫ్రాన్స్, బ్రిటన్ అత్యంత శక్తిమంతమైన దేశాలుగా ఉండేవి. ఇతర దేశాలపై అప్పటికే ఆధిపత్యం చలాయించడం కూడా మొదలుపెట్టాయి. దీంతో ఫ్రాన్స్‌లో అమలు అవుతున్న కుడి వైపు డ్రైవింగ్ విధానాన్ని తమ ఆధీనంలో ఉన్న దేశాల్లో కూడా అమల్లోకి తీసుకొచ్చాయి. కానీ బ్రిటన్ మాత్రం కుడి వైపు డ్రైవింగ్ విధానాన్ని వ్యతిరేకించింది. బ్రిటన్‌తో పాటు తమ ఆధీనంలో ఉన్నభారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సహా చాలా దేశాల్లో ఎడమ వైపు డ్రైవింగ్‌నే కొనసాగించాయి. ఈ క్రమంలోనే ఎడమ వైపు డ్రైవింగ్‌ను ప్రోత్సహించేందుకు జనరల్ హైవే పేరుతో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఇక జపాన్, ఇండోనేసియా, థాయిలాండ్ వంటి ఆసియా దేశాలు కూడా ముందు నుంచి ఉన్న ఎడమవైపు డ్రైవింగ్‌నే అనుసరించాయి. కానీ డ్రైవింగ్ అనుకూలంగా ఉండేందుకు డ్రైవర్ సీటును కుడి వైపు మార్చాయి. అమెరికా, కెనడాలో కూడా ముందు నుంచి ఎడమ వైపు డ్రైవింగ్ ఉండేది. కానీ కాల క్రమంలో అవి కూడా ఫ్రాన్స్ తీసుకొచ్చిన కుడి వైపు డ్రైవింగ్‌కు మారిపోయాయి. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం 75 దేశాల్లో ఎడమ వైపు.. 165 దేశాల్లో కుడి వైపు డ్రైవింగ్ చేస్తున్నారు.